ఏపీలో జెరూసలేం యాత్రపై కమలదళాల కన్నెర్ర
నాగాలాండ్‌లో సర్కారు ఖర్చుతో జెరూసలేముకు పంపిస్తున్న బీజేపీ
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న బీజేపీ ద్వంద్వ విధానాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్టయింది ఇప్పుడు బీజేపీ వ్యవహారం. ఏపీలో క్రైస్తవ రాజ్యం నడుస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మత మార్పిళ్లు ప్రోత్సహిస్తున్నారని దుయ్యబడుతున్న బీజేపీకి.. పాతదే అయినా తాజాగా తెరపైకి వచ్చిన, నాగాలాండ్ వ్యవహారం నైతిక సంకటంగా పరిణమించింది. మీకు బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా అని తిరుపతి ఓటర్లను ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు.. నాగాలాండ్ ఎన్నికల్లో క్రైస్తవుల కోసం బీజేపీ మేనిఫెసోలో ఇచ్చిన హామీలు, కచ్చితంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి రాజకీయ ఇరకాటమే.
ఏపీలో క్రైస్తవ రాజ్యం నడుస్తోందని, వైసీపీ ప్రభుత్వం మత సంతుష్టీకరణ విధానాలు అమలుచేయడం ద్వారా, హిందూ వ్యతిరేక విధానాలు అమలుచేస్తోందన్న కొత్త ఆరోపణలను బీజేపీ.. ఇటీవలి కాలంలో శరవేగంగా హిందువుల్లోకి తీసుకువెళుతోంది. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కమల దళాలు ఉద్యమిస్తున్నాయి. అటు సెక్యులర్ పార్టీ అని ప్రకటించుకున్న టీడీపీ కూడా.. తన సెక్యులర్ మొహమాటాలు అటకెక్కించి, హిందుత్వ రేసులో బీజేపీని అధిగమించేందుకు పరుగులు పెడుతోంది. టీడీపీ కూడా గత ఎన్నికల్లో అదే క్రైస్తవులకు ఇండిపెండెంట్ చర్చి నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేస్తామని హామీ ఇచ్చింది. అయినా వాటిని మర్చిపోయి, ఇప్పుడు కొత్తగా ‘హిందూమతం’ తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో నాగాలాండ్ రాష్ట్రంలో, 2018 ఫిబ్రవరి 27న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అంశాలు, ఏపీలో వివిధ సంఘటనలు జరుగుతున్న సమయంలోనే, ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి రావడం ఆ పార్టీని సైద్ధాంతికంగా ఇరుకున పెడుతున్నాయి. తాము గెలిస్తే సీనియర్ సిటిజన్లకు లక్కీ డ్రా ద్వారా, ఏడాదికి 50 మంది చొప్పున ప్రభుత్వ ఖర్చుతో, జెరూసలేం యాత్రకు ఉచితంగా పంపిస్తామని హామీ ఇచ్చింది. నాగాలాండ్ బీజేపీ ఇన్చార్జి, నాటి కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ఈ హామీతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశారు.
ఎందుకంటే నాగాలాండ్ రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది క్రైస్తవులే. కాబట్టి వారి సంతృప్తి కోసం జెరూసలేం ఉచిత యాత్ర హామీని, బీజేపీ అక్కడ తన మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సులభంగానే అర్ధమవుతుంది. కానీ అదే బీజేపీ నేతలయిన సునీల్ దియోధర్, సోము వీర్రాజు, బండి సంజయ్ మాత్రం.. ఏపీలో అమలవుతున్న జెరూసలేం యాత్రకు ప్రోత్సహకాలు, చర్చి పాస్టర్లకు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని మాత్రం తప్పు పట్టడం ద్వారా.. నైతిక సంకటంలో పడ్డారు. ఫక్తు హిందుత్వ-సైద్ధాంతిక పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ, ఈవిధంగా రాష్ట్రానికో విధంగా.. ఆయా రాష్ట్రాల్లోని మతాల జనాభాను బట్టి, తన విధానాలు మార్చుకోవడం కచ్చితంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే అంశమే. నాగాలాండ్‌లో బీజేపీ మేనిఫెస్టో అంశాలు, ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే దానికి కారణం.
నిజానికి కరుడుగట్టిన హిందూ సంస్థగా ముద్ర ఉన్న ఆర్ఎస్ఎస్కు, క్రైస్తవ అనుబంధ సంస్థ ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. దానిపేరు ‘రాష్ట్రీయ ఇసాయి మంచ్’. సంఘ్ సర్చాలక్ సుదర్శన్‌జీ ఉన్నప్పుడే ఇది మొదలయింది. కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఆధ్వర్యాన, గత పార్లమెంటు ఎన్నికల ముందు త్రిపుర, అస్సోం, నాగాలాండ్, గోవా వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని క్రైస్తవుల ఓట్ల కోసం ప్రత్యేక వ్యూహరచన జరిగింది. నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, రాంమాధవ్, అనితా బెంజిమన్ తదితర ప్రముఖులు దానికోసం వివిధ రాష్ట్రాల్లోని బిషప్‌ల సాయం తీసుకున్నారు. రాజమండ్రి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బిషప్‌లు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఈ బిషప్‌ల సాయంతోనే, నాగాలాండ్ తదితర ఈశాన్య రాష్ట్రాల క్రైస్తవుల ఓట్ల కోసం ప్రయత్నాలు జరిగాయి.
అందులో భాగంగా అప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించిన పథకాలే తాము తిరిగి కొనసాగిస్తామని, దానితోపాటు జెరూసలేం యాత్రకు ప్రభుత్వపరంగా నిధులు ఇస్తామన్న ప్రతిపాదన తెచ్చారు. తమకు క్రైస్తవులతో ఎలాంటి శత్రుత్వం లేదని, ఎవరి మతం వారు పాటించాలన్నదే తమ సిద్ధాంతమని వారికి నచ్చచెప్పారు. ఈ ప్రతిపాదనలు వివరించి, క్రైస్తవులను ఒప్పించడంలో బీజేపీకి బాసటగా వెళ్లిన బిషప్‌లు సఫలమయ్యారు.
ఆ హామీ మేరకు వాటిని, బీజేపీ తన మేనిఫెస్టోలో జెరూసలేం యాత్ర హామీ పొందుపరిచింది. ఇప్పుడు వాటిని ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ కైస్తవుల కోసం విభాగం ఏర్పాటుచేసినట్లుగానే, ముస్లింల కోసం కూడా ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ ఏర్పాటుచేసిన విషయం చాలామంది హిందువులకు తెలియదు. ఇప్పటివరకూ ఆర్ఎస్ఎస్ కేవలం, హిందువుల కోసమే పనిచేస్తుందన్న విషయమే ప్రజలకు తెలుసు.
ఇప్పుడు ఏపీలో మత ప్రాతిపదికన జరుగుతున్న వివాదాల నేపథ్యంలో… బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, క్రైస్తవుల బలం ఎక్కువ ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో సంతుష్టీకరణ విధానాలు అమలుచేస్తోందన్న విషయం, సోషల్‌మీడియాలో గుప్పుమంది. నిజానికి ఇవేమీ ఏపీ-తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా పెద్దగా తెలియవు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి, జగన్ సర్కారుపై బీజేపీ విరుచుకుపడుతోంది. జగన్ సర్కారు క్రైస్తవ అనుకూల వైఖరిని తూర్పారపడుతోంది.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో, ఈ పరిణామాలన్నీ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తాయని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కూడా.. ఓట్ల కోసం అలాంటి క్రైస్తవ అనుకూల విధానాలే అమలుచేస్తోందన్న విషయం ఆలస్యంగా బయటకు పొక్కడం, బీజేపీకి సైద్ధాంతిక సంకటంలా పరిణమించింది. దీనిని బీజేపీ ప్రత్యర్ధులు హిందువుల్లోకి తీసుకువెళితే పరిస్థితి ఏమిటో చూడాలి మరి!