తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు కొరవడిన రాజనీతి..!!

0
2

(  వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ )

బంగాళాఖాతం తీరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చలి చంపేస్తుంది. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులు ఆంధ్ర రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఆంధ్రలో రాజుకున్న రాజకీయ వేడి దెబ్బకు చలికి కూడా చెమటలు పడుతున్నాయి. చంద్రబాబు చేసిన విగ్రహ ధ్వంస రచన బెడిసి కొట్టింది. విజయనగరం జిల్లా రామతీర్ధంలో శ్రీరాములవారి తల తీయించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు అండ్ కో చేసిన పన్నాగం ప్రజల విజ్ఞత ముందు ఓడిపోయింది. విగ్రహాల ధ్వంసంలో రాజకీయ కోణం ఉందని 88 శాతం మంది నెటిజన్లు పలు సర్వేల్లో అభిప్రాయపడ్డారు.  అయితే..తెలుగు  రాష్ట్రాల్లోని కొంతమంది బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారు.

చంద్రబాబు నోటి నుంచి వెలువడే మాటలు ఆ కొంత మంది బీజేపీ నేతల నోటి వెంట వచ్చాయి.  ఏ రాజకీయ పార్టీయేనా అధికారంలోకి రావాలి అనుకోవడం తప్పు కాదు. కానీ..అధికారంలోకి రావడానికి ఎన్నుకునే మార్గం మీదనే ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తు  ఆధారపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ స్థాపించిన తరువాత భారతీయ  రాజకీయాల్లోకి అత్యంత వేగంగా దూసుకు వచ్చింది. రామ మందిర నిర్మాణం పేరుతో కోట్లాది మంది హిందూవుల మనోభావాలను గెలుచుకుంది. ఉత్తరాదిలో రామ మందిర నిర్మాణ నినాదం భారతీయ జనతా పార్టీని బలోపేతం అయ్యేలా చేసింది. కానీ..ఉత్తరాది రాజకీయాలకు , దక్షిణాది రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని కమలనాధులు మరిచిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నేతలు చంద్రబాబు ట్రాప్‌లోకి వెళ్లిపోతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు.

మతం మత్తు మందు లాంటిది అంటారు కారల్ మార్క్స్‌. ఆ మత్తు మందుతో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారు. విగ్రహాలు, గుళ్లు ధ్వంసం చేయడం చంద్రబాబుకు కొత్త కాదు. 2014-19 మధ్య కాలంలో 40 గుళ్లను ధ్వంసం చేసి దేవతా విగ్రహాలను చెత్త కుప్పల్లో విసిరేయించిన ఘనుడు చంద్రబాబు. బూట్లు విప్పకుండా పూజలు చేయడం చంద్రబాబుకు పరిపాటి. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి తన ఇష్టదైవం అని చెప్పుకుంటూనే వెయ్యికాళ్ల మండపాన్ని కూలదోశాడు.

గొల్ల మండపాన్ని కూలదోయపోతే యాదవుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గాడు.శ్రీ వేంకటేశ్వర స్వామిని మొదటి సారి యాదవులు చూసే సంప్రదాయాన్ని, యాదవులకు శ్రీనివాసుడు ఇచ్చిన వరాన్నే రద్దు చేసిన ఘనుడు చంద్రబాబు. పుష్కరాల్లో తన కుటుంబం షార్ట్‌ ఫిలిం పేరుతో 29 మందిని చంపిన పాపాత్ముడు చంద్రబాబు. ఈ పాపాలన్నీ పండి 2019లో ఘోర ఓటమిని చంద్రబాబు చవిచూశారు.అయినా చంద్రబాబులో పాప భీతిలేదు. దేవుడంటే భయమూ లేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక రాములవారి తలనే తీయించాడు  కలియుగపు నారా రావణాసుడు చంద్రబాబు.

బీజేపీ నేతలపై నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలంటే నాకు చాలా గౌరవమూ ఉంది. కమలనాధులు రాజకీయంగా చాలా మంచి వ్యూహాలు పన్నుతారని నమ్ముతాను. హిందుత్వం పేరుతో కోట్ల మంది భారతీయుల్లో ఓ ఎమోషనల్ క్రియేట చేయడంలో బీజేపీ నేతలకు ఎవరూ సాటి రారు. కానీ..ఈ ఎమోషన్ అన్నవేళలా, అన్ని రాష్ట్రాల్లో పని చేయదు. ఒక్కో రాష్ట్రానికి ఓ రాజకీయ నేపథ్యం ఉంటుంది.ఓ రాజకీయ  ఆలోచన, అవసరాలు ఉంటాయి. ఈ విషయం బీజేపీ నేతలకు బాగా తెలుసు.అందుకే.. క్రిస్టియన్లు 88 శాతం  ఉండే నాగాలాండ్ లాంటి రాష్ట్రంలో హిందుత్వ పిడివాద పార్టీ బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మేనిఫెస్టో విడుదల చేసింది.

నాగాలాండ్ లోని సీనియర్ సిటీజన్లకు బీజేపీ ఉచిత జెరూసలేం ట్రిప్‌ను ఎన్నికల హామీగా ఇచ్చింది. సో..నాగాలాండ్ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ తమ ఆలోచనను మార్చుకుని ఉనికిలేని రాష్ట్రంలో, క్రిస్టియన్లు ప్రాబల్యం ఉన్న స్టేట్‌లో 12 సీట్లు గెల్చుకోగలిగింది(నాగాలాండ్‌లో మొత్తం సీట్లు 60).12 సీట్లు గెల్చుకుని ప్రభుత్వంలో భాగస్వామి అయింది. నాగాలాండ్ నుంచి  తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు పాఠాలు నేర్చుకోవడంలేదనేది నా అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక,  రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు విఫలమయ్యారనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ  ఎదగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ..తెలంగాణ చారిత్రక, సాంస్కృతి నేపథ్యం వేరు. ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో  హిందూ ఎమోషనల్ టచ్‌ ఎక్కువుగా ఉంటుంది. కారణం..తెలంగాణను నిజాంలు అత్యధిక కాలం పాలించడం. అదే..ఆంధ్ర బ్రిటీషర్ల ఏలుబడిలో ఉంది. ఇక్కడ చారిత్రక నేపథ్యం పూర్తిగా వేరు. ఇక్కడ పాలన ఎవరూ బాగా చేస్తున్నారు అనేది మాత్రమే  ప్రజలు చూస్తారు. 2014లో లెక్క ప్రకారం వైఎస్‌ఆర్‌ సీపీ ఆంధ్రలో అధికారంలోకి రావాలి. కానీ..పాలనలో చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు నమ్మడం, కేంద్రంలో అధికాంలోకి వస్తారు అన్నమోదీని పక్కన కూర్చోపెట్టుకోవడం, అప్పటికే రాష్ట్రం విడిపోవడం,హైదరాబాద్‌ను కోల్పోయి ఆంధ్రాకు రెవెన్యూ లేకపోవడం,  ప్రత్యేక హదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంత హామీ ఇవ్వడం, ఇటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో మోదీతో సఖ్యతగా ఉండే  చంద్రబాబు అవసరమని భావించడం వలన 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 102 సీట్లు గెల్చుకుంది.

కానీ..2019 వచ్చే సరికి సీన్‌ రివర్స్‌ అయింది. ప్రత్యేక హోదా ఇస్తానన్న పార్టీ ఇవ్వలేదు, తెస్తానన్నా టీడీపీ తేలేదు. దీనికి తోడు అమరావతి ఒకే కులం వారి కోసమని ప్రజలు బలంగా నమ్మారు. పోలవరాన్ని దోపిడీకే బాబు ఉపయోగించుకున్నారు. తన తప్పిదాలను  మోదీ మీదకు నెట్టి 2019 ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాడు చంద్రబాబు.అంతటితో ఆగలేదు.. కాంగ్రెస్‌ నేతలతో చెట్టాపట్టాల్ వేసేకుని తిరగారు. జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశారు.ప్రధానిగా మోదీ అనర్హుడు అంటూ తన పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేయించారు .2014లో ప్రజల అప్పగించిన పని చేయని చంద్రబాబు 2019లో ఏ మాట మాట్లాడిన ప్రజలు నమ్మలేదు. అప్పటికే పాదయాత్రలో జనబాహూళ్యంలోకి వెళ్లిన  వైఎస్ జగన్‌ మాటను, హామీలను  ప్రజలు విశ్వసించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు.

ఇక్కడ .. తెలుగు రాష్ట్రాల బీజేపీనేతలు ఒక్కటి గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మతం పని చేయదు. ఎమోషనల్ టచ్‌ చేయాలంటే కుదరదు. ఆంథ్ర రాష్ట్రంలో పాలకుల పనితీరునే ప్రాతిపదికగా ప్రజలు తీసుకుంటారని రాజకీయ చరిత్ర చూసినవారికి అర్ధం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  “బైబిల్ పాలన కావాలా ? భగవద్గీత పాలన కావాలా?”అనగానే ఆంధ్రులు పూనకంతో ఊగిపోరు. గతంలో వైఎస్‌ఆర్‌ మీద టీడీపీ చేసిన దుష్ప్రచారాన్నే బండి సంజయ్ చేస్తున్నారు. ఏడు కొండలను రెండు కొండలుగా వైఎస్‌ఆర్‌ మార్చారని టీడీపీ దుష్ప్రచారం చేసింది. కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకటే..వాస్తవానికి రెండు కొండల శ్రీవారిని ఏడుకొండలవాడిగా జీవో ఇచ్చి మార్చింది వైఎస్ఆర్‌ . కొండ మీద రాజకీయాలొద్దని జీవో తెచ్చింది వైఎస్‌ఆర్‌.  ఇవన్నీ ఆంధ్రులకు తెలుసు.

అంతేకాదు..చంద్రబాబు రద్ద చేసిన గొల్లల తొలి దర్శనాన్ని  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పునరుద్ధరించారు. శ్రీవారి నామాలు ధరించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తాను శ్రీవారి  భక్తుడిని అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఇంత కంటే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కొంత మంది చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వాస్తవాలు తెలుసుకోవాలి. విగ్రహాల ధ్వంసం ప్రభుత్వం చేయదు. విగ్రహాల ధ్వంసం ఎవరికీ అవసరం బీజేపీకి దగ్గర కావాలని కొంగ జపం చేస్తున్న చంద్రబాబుకు అవసరం. ఈ విషయాన్ని బీజేపీ నేతలు వాస్తవథృక్పథంతో చూడాలి. చంద్రబాబు కుట్రలను ప్రజలకు విడమరిచి, అర్ధమయ్యేలా చేప్పే బాధ్యత జాతీయ పార్టీగా బీజేపీపై ఉంది. అంతేకాదు..చంద్రబాబులాంటి రాజకీయ అవకాశవాది కంటే  వైఎస్‌ జగన్‌లాంటి సిద్ధాంతపరమైన, మాట మీద నిలబడే రాజకీయనాయకుడు దీర్ఘకాలంలో బీజేపీకి అవసరం.వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి విడిచిపెట్టుకున్న తరువాత తెలుగు రాష్ట్రాల్లో   కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో బీజేపీనేతలు గమనించాలి.

ఈ రోజున బీజేపీ బలంగా ఉండొచ్చు,కానీ భవిష్యత్తులో మిత్రులు అవసరం అవుతారు. అప్పుడు బీజేపీకి మంచి మిత్రుడిగా తోడు ఉండేది వైఎస్‌ జగనమోహన్ రెడ్డే. ఎందుకంటే..వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో కలుస్తామన్నా  వైఎస్ఆర్‌ కుటుంబ అభిమానులు, ఆంధ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే..ఆంధ్ర  ప్రదేశ్ విభజన ఆంధ్రుల హృదయాల నుంచి ఇంకా తొలగిపోలేదు, తొలగిపోదు. ఆ పాపాన్ని కాంగ్రెస్‌ జీవిత కాలం, శాశ్వతంగా అనుభవిస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో ముందు చూపు చాలా అవసరం. ఈ ముందు చూపుతోనే  తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అడుగులు వేయాలి. బండి సంజయ్ స్పీడ్ తెలంగాణలో పనికి వస్తుంది కానీ..ఆంధ్రాలో పనికి రాదు.

తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరించడం వెనుక చారిత్రక కారణాలతోపాటు  సీఎం కేసీఆర్ వైఫల్యాలు ఉన్నాయి. ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు.  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై 80 శాతానికిపైగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఆలోచన చేయాల్సింది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఎంత దగ్గర కావాలి, చంద్రబాబు నాయుడికి  ఎంత దూరం కావాలి అని మాత్రమే. ఈ రాజనీతి తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు ఉందని అనుకుంటున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here