ఏపీలో బీజేపీకి వర్కవుట్ కాదు!

416

తెలంగాణ లో  లోకసభ గత ఎన్నికల్లోను; హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను బీజేపీ పుంజుకున్నట్టు -ఆంధ్ర లో కూడా పుంజుకుంటుందా?
క్షేత్ర స్థాయి పరిస్థితులను ఒకసారి పరిశీలించి చూస్తే- అటువంటి ‘వెసులుబాట్లు’ ఆంధ్ర బీజేపీ కి ఉన్నట్టు కనిపించవు.
తెలంగాణ లో ఉన్న ‘ అనుకూల’ పరిస్థితులు – ఆంధ్ర లో బీజేపీ కి లేవు.
తెలంగాణ లో- అటు హైద్రాబాద్ లోనూ, ఇటు పలు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా గణనీయం గా ఉంది. వారికీ, హిందూ జనాభాకు సఖ్యత అంతంత మాత్రం అనే భావన తెలంగాణ లో అంతర్లీనం గా ఉన్నదని అంటారు. తెలంగాణ ముస్లింలలో ఎం.ఐ. ఎం పార్టీ ప్రభావం చాలా అధికం. అఫ్జల్ గంజ్ బ్రిడ్జి కి అవతల ఉండే  ఓల్డ్ సిటీ కి- ఇవతల ఉండే సిటీ కి చాలా తేడా ఉంది. ఈ కారణాల వల్ల, హిందువులలో బీజేపీ కి చెప్పుకోతగిన ఆదరణ ఉంది.  హైద్రాబాద్ లోనూ, తెలంగాణ లోని కొన్ని జిల్లాల లోనూ బీజేపీ బలం- ముస్లిం లలో ఉంది.
పైపెచ్చు- బీజేపీ కి తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు. ‘టైగర్’ ఆలె నరేంద్ర , వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు, లక్ష్మణ్, ప్రభాకర్, రాజా సింగ్…. ఇంకా అనేక మంది-గేలక్సీ ఆఫ్ స్టార్స్- తెలంగాణ బీజేపీ ని సుసంపన్నం చేశారు. వారంతా వేసిన బలమైన పునాది మీద  నిలబడి…కత్తి తిప్పే బండి సంజయ్ నాయకత్వం తెలంగాణ బీజేపీ కి లభించింది. ఆయన స్వయంగా ఎం.పి గా గెలిచి ఉన్నారు.
ఇక్కడ తెలంగాణ లో కే సీ ఆర్ ప్రభుత్వం పై కలిగే అసంతృప్తి ని కాంగ్రెస్ ‘క్యాష్’ చేసుకోలేక పోతున్నదనే భావం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఫలితం గా – బీజేపీ కాలూనడానికి కాస్తంత జాగా దొరికింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా- ‘ప్రస్తుతానికి’ బీజేపీ వైపు మళ్లింది.ఫలితంగా బీజేపీ విజయాలు కంటికింపుగా కనిపిస్తున్నాయి.
ఆంధ్ర విషయానికి వస్తే- ఆంధ్ర లో ముస్లిం ల నుంచి ముస్లిమేతరులు ఎవరూ అభద్రతా భావానికి లోను కావడం లేదు. ఆంధ్ర లో ముస్లిం లు- ముస్లిమేతరులు కూడా- అక్కా,బావా; పిన్నీ-బాబాయ్; అత్తయ్యా- మామయ్య వరుసలతో కలిసి, మెలసి ఉంటారు. అందువల్ల- అక్కడ చలి కాచుకోవడం బీజేపీ కి కుదరదు.
గతం లో బీజేపీ అంటే- తెనాలి లో జూపూడి యజ్ఞనారాయణ గారు- అటు విశాఖ వైపుకు వెడితే- చలపతిరావు గారు, మేయర్ గా పని చేసిన అడ్వకేట్ సుబ్బారావు గారు(జనసంఘ్ రోజులలో)
ఆ తరం గతించిన తరువాత- వెంకయ్య నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.
కారణాలు ఏమైతేనేం- నాయకత్వ సూన్యత అనేది ఆంధ్ర బీజేపీ లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం. ఆంధ్ర బీజేపీ లో ముఖ్య నాయకుల పేర్లు మూడు, నాలుగు చెప్పమంటే- తడుముకోవాల్సిందే. తెలంగాణ నాయకత్వ శ్రేణి తో పోల్చుకుంటే- ఆంధ్ర బీజేపీ కి ఇది రెండో మైనస్.
ఇక హిందూత్వ భావజాలాన్ని గిలకొట్టి లబ్ది పొందవచ్చుననుకున్నప్పటికీ- ఆంధ్ర లో బీజేపీ కి వర్క్ ఔట్ అయ్యే వాతావరణం కనపడడం లేదు. ఎందుకంటే- తెలుగుదేశం ఈ కోణం లో రెడీ అయిపోతున్నది. వైసిపి ని రాజకీయంగా ఎదుర్కొనడానికి సతమతమై పోతున్న తెలుగు దేశం పార్టీ కి -అనుకోకుండా జాక్ పాట్ తగిలింది.
ఎవరో ఆకతాయిలు- పైశాచికానందం పొందేందుకు దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే- వీటిని వైసీపీ కి అంటగట్టేయడం ద్వారా , హిందూత్వ భావనలను భుజానికి తగిలించుకొనే సరికొత్త రాజకీయానికి తెలుగు దేశం పార్టీ శ్రీకారం చుట్టింది. దీనితో- ఆంధ్ర బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ కే ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. రామ తీర్ధం సందర్శనకు చంద్రబాబు వెళ్ళినపుడు వ్యక్తమైన జన స్పందన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ దేవతా విగ్రహానికి ఏ రకమైన ఇబ్బంది కలిగినా- తెలుగు దేశం పార్టీ అక్కడ ముందుగా ప్రత్యక్షమవుతుందనడం లో సందేహం లేదు. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంత వరకు- హిందూత్వ భావజాలాన్ని తానే ప్రతినిధిని తప్ప; బీజేపీ కాదని- తెలుగు దేశం పార్టీ ఘనంగా ప్రకటించడానికి సమాయత్తమవుతున్నది. దానికి 40 శాతం నిలకడైన ఓట్ బ్యాంక్ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాలి. హిందూత్వ భావజాలాన్ని  ఈ ఓట్ బ్యాంక్ కు జత చేయడానికి చంద్రబాబు నాయుడు సమాయత్తమవుతున్నారు. బీజేపీ కి ఉన్న ఓట్ బ్యాంక్- ఒక్క శాతమే.
ఈ కారణాలు అటు ఉంచితే- పవన్ కళ్యాణ్…సోము వీర్రాజు- చెరో పక్కకూ లాగుతున్నారనే భావం రాజకీయాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
జగన్ ను, వైసీపీ ని విమర్శించడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం. చంద్రబాబును, తెలుగు దేశం ను విమర్శించడం సోము వీర్రాజు కు ఇష్టం. దీనితో బీజేపీ కి ఒక స్పష్టమైన వైఖరి లేకుండా పోయే ప్రమాదం ఉంది.
తమకు వైసీపీ రాజకీయ శత్రువా…లేక- తెలుగు దేశమా అనేది ఈ నాయకులు నిర్ణయించుకోకుండా- ఎన్నికలకు వెడితే- ఖాతా తెరవడం కూడా కష్టం కావచ్చు.
తెలంగాణ బీజేపీ కి – వెనుక నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మద్దతు ఇవ్వడం వల్ల-4 ఎం.పి స్థానాలు; 48 మునిసిపల్ కార్పొరేటర్ స్థానాలు లభించాయనేది బహిరంగ రహస్యం. ఆంధ్ర బీజేపీ కి ఆ వెసులుబాటు బాటు కూడా లేదు. బీజేపీ స్వంతం గా పోటీ చేయాలి అనుకుంటే- కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వరు. వైసీపీ ఇవ్వదు. టీడీపీ కూడా ఇవ్వదు.
వైసీపీ, టీడీపీ లలో- దేనితోనో ఒకదానితో పొత్తు పెట్టుకోకుండా- స్వంతం గా సీట్లు సంపాదించే పరిస్థితి బీజేపీ- జనసేన కూటమికి లేదు.
అయితే- రాజకీయ కాలక్షేపానికి మాత్రం లోటు ఉండదని చెప్పవచ్చు.
ఆంధ్ర లోని తిరుపతి లోకసభ ఉపఎన్నిక లో బీజేపీ తరఫున- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయిన బండి సంజయ్ ఘీంకరించడమే-ఆంధ్ర బీజేపీ ‘నిస్సహాయ’ స్థితికి అద్దం పడుతున్నది.

-భోగాది వెంకట రాయుడు