నాయుడు..జై ‘హింద్’..నై క్రిస్టియన్!

505

బాబు నోట తొలిసారి క్రిస్టియన్, హిందూ మాట
టీడీపీ రాష్ట్ర కమిటీ భేటీలో మతమార్పిళ్లపై బాబు ఆగ్రహం
(సుమ)

టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన హిందుత్వ విధానాలను కొనసాగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ తొలి కార్యవర్గ భేటీలో ఆయన తొలిసారి క్రైస్తవులు, హిందువులు- మతమార్పిళ్లు-చర్చిల పేర్లు ప్రస్తావించారు. దీనితో టీడీపీ హిందుత్వ విధానాల దారిలోనే వెళ్లడం ద్వారా, బీజేపీ హిందుత్వను హైజాక్ చేయనుందన్న  వాదన నిజమయినట్టయింది.

ఇప్పటిదాకా సెక్యులర్ మంత్రం జపిస్తోన్న టీడీపీ, ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హటాత్తుగా హిందుత్వ దారిలో నడ వాలని నిర్ణయించుకోవడం, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తొలిసారిగా,  సీఎం జగన్‌ను క్రైస్తవుడని సంబోధించారు. దానితోపాటు గ్రామాల్లో పెరుగుతున్న చర్చిల అంశాన్నీ ప్రస్తావించడం, సీఎం-హోంమంత్రి-డీజీపీ క్రిస్టియన్లే అని బాహాటంగా ప్రకటించడం ద్వారా, బాబు కూడా బీజేపీ దారిలోనే మతకోణంలోనే అడుగులు వేస్తున్న విషయం స్పష్టమయింది.

సీఎం-హోంమంత్రి-డీజీపీ ముగ్గురూ క్రిస్టియన్లు అయినంత మాత్రాన ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆపలేరా? అని బాబు ఫైర్ అయ్యారు.‘నువ్వు క్రిస్టియన్. జెరూసలేముకు వెళతావు. నేను హిందువును. నేను వెంకటేశ్వరస్వామిని కొలుస్తాను. ఆ ముగ్గురూ క్రిస్టియన్లు. అందులో తప్పులేదు. కానీ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఉంటారా? గ్రామాల్లో చర్చిల సంఖ్య ఎందుకు పెరుగుతోందో ఆలోచించాలి. మన గ్రామాల్లో ఆలయాలను మనమే కాపాడుకోవాల’ని సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మారుతున్న టీడీపీ వైఖరిని స్పష్టం చేస్తోంది. గత పదేళ్ల నుంచి వైసీపీ అధినేత జగన్, తనను ఎంత ఇబ్బంది పెట్టినా చంద్రబాబు ఒక్కసారి కూడా ఆయన మతం గురించి గానీ, ఆయనను క్రైస్తవుడని గానీ ఎప్పుడూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ, తొలిసారిగా జగన్ మతం గురించి బాబు బహిరంగం కావడంతో, ఇకపై ముసుగు లేకుండా ఎదురుదాడి చేయాలన్న టీడీపీ వైఖరిని స్పష్టం చేసింది.టీడీపీ రాష్ట్ర కమిటీ భేటీలో చంద్రబాబు ప్రసంగం మొత్తం.. దేవాలయాలపై దాడుల కేంద్రంగా, జగన్ ప్రభుత్వ క్రైస్తవ వ్యతిరేక విధానాల చుట్టూనే తిరగడం గమనార్హం. ఈ సందర్భంగా బాబు తొలిసారి మతమార్పిళ్లు జరగడానికి వీల్లేదని హెచ్చరించడం.. పాస్టర్లకు నెలకు 5 వేలు ఇవ్వడం చట్టవిరుద్ధమని విమర్శించడం  బట్టి, హిందుత్వ రేసులో  బీజేపీని వెనక్కి నెట్టి ,  ముందువరసలో ఉండాలన్న పార్టీ వ్యూహం స్పష్టమవుతుంది. మతమార్పిళ్లు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించడం ద్వారా, ఏపీలో జరుగుతున్న మతమార్పిళ్ల వెనుక సీఎం ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు తన విమర్శ ద్వారా చర్చనీయాంశం చేశారు.

క్రైస్తవుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. వ్యూహాత్మకంగా హిందూ-ముస్లింలపై జరుగుతున్న దాడులను కూడా ప్రస్తావించడం గమనార్హం.  హిందు-ముస్లిం మనోభావాలు దెబ్బతీసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని బాబు నిలదీశారు. దీన్నిబట్టి.. హిందుత్వ విధానాలు అనుసరించినా, బలమైన ముస్లిం వర్గాన్ని  మాత్రం దూరం చేసుకోకూడదన్నదే  టీడీపీ ముందస్తు వ్యూహంగా స్పష్టమవుతోంది. కాగా, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు,  అందులో ప్రభుత్వ పాత్రపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఆ సందర్భంగా సీబీఐ విచారణ కోరాలని కూడా తీర్మానించింది. కాగా   అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ను,  ఈపాటికే కోరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.