క్రైస్తవులపై మాట మార్చిన బాబు

0
3

నాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరాల జల్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా, కొత్తగా మత కోణంలో విరుచుకుపడుతున్న టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శలు.. మారుతున్న టీడీపీ రాజకీయ విధానాలకు అద్ధం పడుతోంది. అందులో భాగంగా జగన్ మతం, పాస్టర్లకు వేతనాలు, మతమార్పిళ్ల అంశాలను  కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే.. ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో క్రైస్తవుల సంక్షేమం కోసం టీడీపీ గుప్పించిన హామీలు తెరపైకి రావడంతో, రాజకీయంగా ఆ పార్టీ ఇరుకున పడింది.

గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం, విదేశీ విద్యకు 25 లక్షలు, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంపు, ప్రభుత్వ భూములు శ్మశాన స్థలాలకు కేటాయింపు, పాస్టర్లకు ఉచిత గృహ వసతి, క్రైస్తవులకు సంపూర్ణ భద్రతతోపాటు, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు,  కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. క్రైస్తవ పాస్టర్లకు ఇస్తున్న వేతనాలను తప్పుపట్టడంపై,  రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతానన్న టీడీపీ, ఇప్పుడు పాస్టర్లకు ఇస్తున్న వేతనాలను విమర్శించడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన దళిత హక్కులను హరించేలా ఉన్న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశంపై,  దళితులలో వ్యక్తమయిన అభ్యంతరాలను ఆనాడు టీడీపీ లెక్కచేయకుండా ముందుకు వెళ్లిన విషయాన్ని,  సొంత పార్టీ వర్గాలే గుర్తు చేస్తున్నాయి.

వైసీపీకి క్రైస్తవులు, దళితులు, రెడ్డి వర్గాలు పూర్తి స్థాయి ఓటు బ్యాంకుగా మారిన నేపథ్యంలోనే, టీడీపీ తన భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం, ఈవిధంగా దారి మళ్లించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

‘మాకు  దరిచేరని వర్గాల కోసం పోరాడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు. వాళ్లంతా వైసీపీకి పక్కా ఓటు బ్యాంకుగా ఉన్నందున, మిగిలిన హిందువుల ఓటు బ్యాంకును కాపాడుకోవడమే తెలివైన పని. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుపై బీజేపీ కన్నేసినందున, దానిని కాపాడుకోవలసిన బాధ్యత మాకు ఉంది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు, భయాలకు పోకుండా చంద్రబాబు నాయుడు ధైర్యంతో తీసుకున్న నిర్ణయం వల్ల, కనీసం హిందువులయినా మమ్మల్ని ఆదరిస్తారు. బీజేపీకి ఎలాగూ బలం లేదు. ఆ విధానాలనే మేం అనుసరిస్తే హిందువుల్లో మాకే ఆదరణ ఉంటుంది. బహుశా ఇదే వ్యూహంతో బాబు హిందుత్వ విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. అందులో మాలాంటి వాళ్లకు తప్పేమీ కనిపించడం లేద’ని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

హిందుత్వ విధానాలు అనుసరిస్తున్నందున,  పార్టీపరంగా వచ్చే నష్టం కూడా ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ టీడీపీలో క్రైస్తవుల సంఖ్య తక్కువే అయినందున, పార్టీపరంగా కూడా పెద్ద అవరోధాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో,  అధికార ప్రతినిధి దివ్యవాణి అడిగిన ప్రశ్నకు బాబు జవాబు ఇచ్చిన తీరు చూస్తే, క్రైస్తవుల వ్యవహారంలో టీడీపీ వైఖరి ఏమిటన్నది స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి మతాన్ని ఎత్తిచూపే బదులు,  ఆ వ్యక్తి దుష్ట ప్రవర్తనను విమర్శిస్తే బాగుంటుందని సినీ నటి దివ్యవాణి సూచించారు.

అయితే..‘ 80 శాతం ప్రజల మనోభావాలు దెబ్బతింటుంటే మనం మౌనంగా ఉండటం కరెక్టు కాదు. జగన్ ఇప్పుడు దేవాలయాలపై పడుతున్నాడు. విధ్వంసం జరిగిన వారిని ఉపేక్షిస్తున్నారు. ఇది కొత్త రాజకీయం. ఈ సీఎంకు నేరపూరిత ఆలోచనలు ఎక్కువ. కాబట్టి మనం కూడా కొత్త పద్ధతిలోనే వెళ్లాల’ని బాబు తన మనోగతం వెల్లడించడం ప్రస్తావనార్హం.  ఇదంతా బాగున్నప్పటికీ, ఇప్పుడు హిందూ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న టీడీపీ.. ఎన్నికల మేనిఫెస్టోలో క్రైస్తవ అనుకూల విధానాలు,  తెరపైకి రావడమే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా సంకటంలా పరిణమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here