అడకత్తెరలో ఐపిఎస్ అసోసియేషన్

509

– సమావేశం ఏర్పాటుచేయాలని ఏబీవీ లేఖ
– లేఖ ఇంకా చూడలేదన్న కార్యదర్శి ద్వారకా తిరుమల రావు
– భేటీ పెడితేనే మంచిదంటున్న ఐపిఎస్‌లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పోస్టింగు, జీతం ఇవ్వకుండా తనకు చేస్తున్న  అన్యాయం చేస్తున్న ప్రభుత్వం, తాజాగా  చేస్తున్న ప్రయత్నాలపై చర్చించేందుకు  వెంటనే ఐపిఎస్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటుచేయాలంటూ సస్పెండయిన డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, సంఘం కార్యదర్శి ద్వారకా తిరుమలరావుకు రాసిన లేఖ ఐపిఎస్ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ప్రభుత్వం తనను అకారణంగా సస్పెండ్ చేసి, జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తోందని ఏబీ వెంకటేశ్వరావు ఏపీ ఐపిఎస్ అసోసియేషన్ కార్యదర్శి ద్వారాకా తిరుమలరావుకు మంగళవారం ఓ లేఖ రాశారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవలయినందున, తనను అరెస్టు చేసి, ఆ సాకుతో తిరిగి తనను సస్పెండ్ చేయాలని చూస్తోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. క్రిమినల్ కేసుపెట్టి జైలుకు పంపించాలన్న ప్రయత్నాలకు సంబంధించిన సమాచారం –  ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.

అందువల్ల తన వాదన వినేందుకు ఐపిఎస్ అసోసియేషన్ జనరల్‌బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కార్యదర్శిని కోరారు. ఆయన తన లేఖను ఆలిండియా ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు సైతం పంపించారు. తాను అసోసియేషన్ నుంచి ఎలాంటి ఫేవర్‌నూ ఆశించడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఇంటలిజన్స్ ఏడీజీ రాజేంద్రనాధ్‌రెడ్డిని ప్రభుత్వం అకారణంగా సస్పెండ్ చేసినప్పుడు తనతో సహా, అప్పటి అసోసియేషన్ స్పందించిన తీరును ఏబీ తన లేఖలో కార్యదర్శికి గుర్తు చేశారు.

తాజాగా ఏబీవీ రాసిన లేఖపై ఐపిఎస్ వర్గాల్లో చర్చ మొదలయింది. ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ గానీ, జనరల్‌బాడీ సమావేశం గానీ గత ఐదేళ్ల నుంచీ జరగలేదని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రతి పాలకులూ ఐపిఎస్‌లపైనే వేటు వేస్తున్నారని, ఐఏఎస్‌లకు ఆ సూత్రం ఏ ప్రభుత్వం అమలుచేయడం లేదన్న వ్యాఖ్యలు ఐపిఎస్‌లలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత పోస్టింగులు ఇవ్వని ఐఏఎస్‌లకు జీతాలు ఎక్కడా ఆపడం లేదని, అదే ఐపిఎస్‌ల విషయంలో మాత్రం జీతాలు ఆపి మానసికంగా వేధిస్తున్న వైనంపై, కచ్చితంగా చర్చ జరగాల్సిందేనన్న అభిప్రాయం ఐపిఎస్‌లలో వ్యక్తమవుతోంది.

టీడీపీ ప్రభుత్వం మారిన తర్వాత ఐఏఎస్ సతీష్‌చంద్ర, ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు చాలాకాలం పాటు పోస్టింగ్  ఇవ్వలేదు. వారిద్దరూ చంద్రబాబు నాయుడు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించేందుకు, వారిద్దరో  తమ పార్టీ ఎమ్మెల్యేలతో  బేరాలు సాగించారని, వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి అప్పట్లో చేసిన బహిరంగ ఆరోపణ సంచలనం సృష్టించింది. అయితే కొద్ది నెలల తర్వాత సతీష్‌చంద్రకు మాత్రం, జీతం ఆపకుండా, కొద్ది నెలల తర్వాత  కీలకమైన ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టింగ్ ఇచ్చింది. కానీ  అలాంటి ఆరోపణలే ఎదుర్కొన్న ఏబీవీకి మాత్రం జీతం- పోస్టింగు ఇవ్వకపోగా, సస్పెండ్ చేసిన విషయాన్ని ఐపిఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

పోస్టింగుల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాలను డీజీపీతో చర్చించి, ఆయన ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసే వాతావరణం,  లేకుండా పోయిందన్న ఆవేదన కూడా ఐపిఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా వారు 2009లో ప్రత్యేక-సమైక్య రాష్ట్ర ఉద్యమం సమయంలో జరిగిన ఓ ఘటనను ప్రస్తావిస్తున్నారు. విజయవాడ ఎంపీగా ఉన్న  లగడపాటి రాజగోపాల్ విజయవాడ పోలీసుల కళ్లు గప్పి, హైదరాబాద్‌కు పారిపోయారు. ఆ సంఘటనలో, నాటి ప్రభుత్వం విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న రాజేంద్రనాధ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇది ఐపిఎస్‌లలో తీవ్రమైన వ్యతిరేకతకు దారితీసింది. ఐపిఎస్ ఆఫీసర్ అసోసియేషన్, ప్రభుత్వ చర్యపై రగిలిపోయింది. నాటి సంఘంతోపాటు, ఏపీఎస్పీ ఐజిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని.. నాటి డీజీపీ గిరీష్‌కుమార్‌ను కలసి, తమ నిరసన వ్యక్తం చేశారు.  బాలసుబ్రహ్మణ్యం, చారుసిన్హా, ఆంజనేయులు వంటి సీనియర్లంతా జరిగిన సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన వార్తలు అప్పట్లో మీడియాలో కూడా వెలువడ్డాయి.

దానితో ఐపిఎస్‌ల మనోభావాలు గుర్తించిన డీజీపీ గిరీష్‌కుమార్, ఐపిఎస్ అధికారి కృష్ణంరాజుతో ఒక కమిటీని వేశారు.  వారంరోజుల్లో నివేదిక తెప్పించుకుని, రాజేంద్రనాధ్‌రెడ్డి సస్పెన్షన్‌ను తొలగించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి, నాడు రాజేంద్రనాధ్‌రెడ్డి కోసం పోరాడిన ఏబీవీకి రావడం ప్రస్తావనార్హం. ‘ఐఏఎస్‌లకున్న ఐక్యత ఐపిఎస్‌లకు ఉండదు. వారికి ఎన్ని విబేధాలున్నా, పోస్టింగులు-వేతన ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో అంతా ఒకే తాటిపైన నడుస్తారు. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి  ఐకమత్యం ఐపిఎస్‌లలో లేద’ని ఓ ఐపిఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ కావాలన్న ఏబీ లేఖ మళ్లీ చర్చనీయాంశమయింది. అయితే ఏబీ లేఖపై స్పందించి, అసోసియేషన్ జనరల్ బాడీని సమావేశపరిచే పరిస్థితి ఇప్పుడు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న చర్చ  తెరపైకి వచ్చింది. సంఘం కార్యదర్శిగా ఉన్న ద్వారకా తిరుమల రావు, ఈ భేటీపై ఎలాంటి నిర్ణయం తీరుకుంటారోనన్న ఆసక్తి ఐపిఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏబీ కోరినట్లు సమావేశం ఏర్పాటుచేస్తే ఒక సమస్య, సమావేశం ఏర్పాటుచేయకపోతే సంఘం సభ్యులతో మరో సమస్య. సహజంగా ఎవరైనా సభ్యుడు సమావేశం ఏర్పాటుచేయాలని కోరితే, సమావేశం ఏర్పాటుచేయవలసి ఉంటుంది. ప్రస్తుతం సంఘం కార్యదర్శిగా ఉన్న ద్వారకా తిరుమలరావు ముందున్న  సంకటం ఇది.

అయితే, ఏబీవీ రాసిన లేఖ తనకు ఇంకా అందలేదని ద్వారకా తిరుమలరావు చెప్పారు. ‘ ఏబీ వెంకటేశ్వరావు నాకు రాసిన లేఖ కవర్, మంగళగిరిలోని మా కార్యాలయానికి వచ్చినట్లు నాకు తెలిసింది. నేను ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో ఉన్నా. వెళ్లిన తర్వాత ఆయన లేఖ చూసి స్పందిస్తానని’ ద్వారకా చెప్పారు.