రాముడి గుడికి సర్కారు అక్కర్లేదు!

251

రామాయణంలో మారీచుడి వంటి రాక్షసుడే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని అభివర్ణిస్తాడు. రాముడంటేనే.. ధర్మానికి విగ్రహరూపం. అంటే మూర్తీభవించిన ధర్మం. అలాంటి రాముడి విగ్రహానికే జరిగిన అపచారం చాలా తీవ్రమైనది. అయితే ఆ దుర్మార్గానికి పాల్పడ్డది ఎవరో ఇప్పటిదాకా తెలియడం లేదు. పోలీసులు తేల్చడం లేదు. ఎవరినైతే అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారో.. ఆ వ్యవహారంమీదనే బోలెడన్ని అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉత్తరాంధ్ర అయోధ్యగా గుర్తింపు ఉన్న రామతీర్థంలో రాముడికి జరిగిన అపచారం పట్ల.. యావదాంధ్ర దేశంలోని హిందూజాతి కుమిలిపోతున్నది. ఈ హేయమైన చర్యల పట్ల ఆగ్రహిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో వారిలోని బాధను ఉపశమింపజేయడానికా అన్నట్లుగా ప్రభుత్వం ఒక మధ్యేమార్గపు ప్రకటన చేసింది. రామతీర్థంలోని బోడికొండపై గుడిని పునర్నిర్మిస్తామని.. అందుకోసం కాగల.. 1.50 కోట్లరూపాయల అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

ఈ ప్రకటన హిందువుల్లోని బాధను ఉపశమింపజేస్తుందా? సాధ్యమేనా? ఎక్కడ ఏ ఆలయాన్ని ధ్వంసం చేసినా, దేవుడిని ధ్వంసం చేసినా.. దానికి కాంపన్సేషన్ గా కాస్తంత డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి విదిల్చి.. ఏడవకుండా ఊరుకోమని హిందువులను ఊరడించడం మంచిదేనా? ప్రభుత్వం డబ్బు కేటాయించినంత మాత్రాన ఎలాంటి అపచారాన్నయినా మర్చిపోవాలా? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలు.

రాష్ట్రంలో ఒక లెక్కల ప్రకారం.. ఇప్పటికి 130కి పైగా ఆలయాల మీద దాడులు జరిగాయి. ఎక్కడ ఏ గుడి మీద ఏ దుర్మార్గం జరిగినా.. నేరస్తులను పట్టుకునే పని చేయకుండా, అలాంటి నేరాలు చేసే వారిలో భయం పుట్టించకుండా.. కేవలం నిధులు ఇచ్చేసి.. రిపేర్లు చేసేస్తే.. సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుండడం.. హిందువుల పట్ల ఆలయాలు, దేవళ్ల పట్ల వారిలోని పలుచన భావానికి నిదర్శనం. అంతర్వేదిలో రథం దగ్ధమైంది. ప్రభుత్వం నిధులు ఇచ్చి కొత్త రథం చేయిస్తోంది. దుర్మార్గులెవరో తేలలేదు. తప్పుచేసిన వారిని తేల్చకుండా.. నిధులు ఇచ్చేసి అందరినీ సర్దేయవచ్చునని అనుకోవడం ప్రభుత్వం భ్రమ!

రాముడికి సర్కారు సొమ్ము కావాలా?

రామతీర్థంలో రామాలయ నిర్మాణానికి ప్రభుత్వం సొమ్ము అవసరమా? అయోధ్యలో రామాలయం నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉండే రామభక్తులు.. ఇప్పటికే పదివేల కోట్లకు పైగా డబ్బు విరాళాలుగా పోగుచేశారు. అలాంటిది.. రామతీర్థంలో రామాలయంకోసం తెలుగువాళ్లు.. కోటిన్నర రూపాయలను విరాళాలుగా జమచేసుకోలేరా? రాష్ట్రంలోని రామభక్తులు తలా ఒక్కరూపాయి ఇచ్చినా.. బోడికొండలో ఓ అద్భుతమైన రామాలయ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. అనే అభిప్రాయంతో ప్రజలున్నారు.

ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నట్టుగా ప్రభుత్వం చాలా పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లుగా ప్రకటించుకుంటోంది. కానీ.. జరిగిన దుర్మార్గం సంగతి తేల్చకుండా, దోషుల్ని శిక్షించకుండా.. కొత్త ఆలయ నిర్మాణం గురించి మాత్రం మాట్లాడడం అనేది.. ప్రజల దృష్టిని మళ్లించడానికే అని చాలా స్పష్టంగా అర్థ మవుతోంది. ఇలాంటి పన్నాగాలు హిందూ సమాజం ముందు పనిచేయవు అని వారు తెలుసుకోవాలి. ప్రభుత్వం ముందు తాము చేయవలసిన పని చేస్తే తప్ప… దోషుల్ని పట్టుకునే- శిక్షించే బాధ్యతను నెరవేరిస్తే తప్ప.. ఇతరత్రా వారి మాటలను ప్రజలు విశ్వసించరు.

.. ఎంఎల్ఎన్ మూర్తి