జగన్ పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ తీవ్రంగా స్పందిస్తుంది: జీవీఎల్

334

హిందూ వ్యతరేక విధానాలను అవలంబిస్తున్నట్టుగా జగన్ చర్యలు ఉన్నాయి
చర్చిపై రాళ్లు వేసిన ఘటనలో 40 మంది హిందువులను అరెస్ట్ చేశారు
వందలాది ఆలయాలు ధ్వంసం అవుతుంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారు?

ఏపీలో ఆలయాల విధ్వంసంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, హిందువులపై వివక్ష కొనసాగుతోందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను మానుకోకపోతే ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
రామతీర్థంకు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. గతంలో చర్చిపై రాళ్లు వేసిన ఘటనలో 40 మంది హిందువులను అరెస్ట్ చేశారని… వందలాది దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
హిందూ మతంపై జరుగుతున్న దాడులు మరో మతంపై జరిగి ఉంటే పర్యవసానాలు మరోలా ఉండేవని జీవీఎల్ అన్నారు. క్రిస్మస్ పండుగ రోజున పోలీసులే కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారని దుయ్యబట్టారు. రామతీర్థంతో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేయడం దారుణమని అన్నారు.
హిందూ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నట్టుగా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, ఈరోజు రామతీర్థంకు వెళ్లేందుకు యత్నించిన సోము వీర్రాజును మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను బలవంతంగా తరలించిన సంగతి తెలిసిందే.