బీజేపీ దూకుడుకు టీడీపీ చెక్!

339

సెక్యులర్ మొహమాటాలకు తెర
దేవాలయాల రక్షణ దారిలో ‘దేశం’
పొలిట్‌బ్యూరో నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

హిందుత్వ అజెండాతో రాజకీయ లబ్థి కోసం పరుగులు తీస్తున్న బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తన సెక్యులర్ మొహమాటాలను పక్కనపెట్టి, దేవాలయాలపై ఎక్కడ దాడి జరిగినా దానిపై ఉద్యమించాలని తీర్మానించింది. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి 127 సంఘటనలు జరిగినా, ఎలాంటి చర్యలు తీసుకోని జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది.

సోమవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ కార్యవర్గ సమావేశంలో.. హిందుత్వానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించడంతో పాటు, వాటికి నిరసనగా తన పార్టీ నే ముందు వరసలో నిలబడి ఉద్యమించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది దేవాలయాలపై దాడుల కేంద్రంగా దూసుకుపోతున్న,  బీజేపీ దూకుడుకు చెక్ పెట్టే వ్యూహమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత కొద్దికాలం నుంచి ఏపీలో దేవాలయాలపై నిర్నిరోధంగా జరుగుతున్న దాడులపై ఉద్యమిస్తున్న బీజేపీ దూకుడు,  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని కలవరపెడుతోంది. ఆలయాల రక్షణలో వైసీపీ సర్కారు కంటే, గత టీడీపీ సర్కారు వైఫల్యాలపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తరచూ ప్రస్తావిస్తుండాన్ని టీడీపీ నిశితంగా విశ్లేషించింది. ఇదంతా పరోక్షంగా వైసీపీ సర్కారుకు మేలు చేకూర్చడంగానే టీడీపీ భావిస్తోంది. బీజేపీ తీరు వల్ల సమస్య పక్కదారి పట్టి, అది ప్రభుత్వం తప్పించుకునేందుకు అవకాశం ఏర్పడుతోందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.


ఈ క్రమంలో సెక్యులర్ పార్టీగా తనపై ముద్ర ఉన్నప్పటికీ, సమస్యల తీవ్రత-రాజకీయ పరిస్థితుల కారణంగా..  తాము కూడా ఇకపై దేవాలయాలు-ధార్మిక అంశాలు-సమస్యలపై ముందు వసరలో ఉండి పోరాడాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. దీనివల్ల దేవుళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ దూకుడుకు  చెక్ పెట్టినట్టవుతుందన్నది,  టీడీపీ నాయకత్వ వ్యూహంగా పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించిన సందర్భంలో, చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ అని నినదించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు రామతీర్థ పర్యటనతో టీడీపీకి బాగా పొలిటికల్ మైలేజీ వచ్చిందని, దానికంటే ముందు యువనేత ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొని ధర్నా చేయడం వల్ల పోలీసులు దిగివచ్చారని పార్టీ నేతలు సమావేశంలో ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి రాకతో, వైసీపీని ప్రజలే ఈసడించుకునే పరిస్థితి వచ్చిందని, ఒకరకంగా ఆయన పర్యటన వల్ల టీడీపీకి ఉచిత మైలేజీ వచ్చిందని మరికొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు  రామతీర్థం సందర్శన వల్ల హిందువుల్లో ధైర్యం వచ్చిందని, స్వామి శ్రీనివాసానంద కూడా జత కలవడం మంచి సంకేతాలని సీనియర్లు విశ్లేషించారు.  అయితే ఈ సందర్భంగా సెక్యులర్ పార్టీగా పేరున్న టీడీపీ, హిందుత్వంపై దృష్టి సారిస్తే రాబోయే పరిణామాలు, రాజకీయరపమైన లాభనష్టాలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

నేతల సందేహాలపై స్పందించిన చంద్రబాబు నాయుడు.. ‘మనది సెక్యులర్ పార్టీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా, రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి 127 సంఘటనలు జరిగాయి. అయినా ఒక్కరినీ అరెస్టు చేయలేదు. హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే బాధ్యతగల పార్టీగా మనం మౌనంగా ఉండకూడదు. ముస్లింలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో, హిందువులకూ అంతే ప్రాధాన్యం ఇస్తాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నందున మనం స్పందించి, భక్తులకు భరోసా ఇవ్వాల్సిన నైతిక బాధ్యత మన పార్టీపై ఉంది’ అని స్పష్టం చేశారు.


కాగా, ఈ సందర్భంగా రాష్ట్రంలో కులరాజకీయాలు- సమీకరణపైనా చర్చ జరిగినట్లు సమాచారం.  రాష్ట్రంలో క్రైస్తవులు- దళితులు-దళితులు-రెడ్లు వైసీపీ పక్షాన ఉన్నారు. పవన్‌తో జతకట్టినందున కాపులను తన వైపు మళ్లించుకోవాలని బీజేపీ చూస్తోందని పలువురు నేతలు విశ్లేషించారు. బీజేపీ తనకు రాజకీయంగా బలం లేకపోయినా,  ఇలాంటి సంఘటనలతో హిందువులను తన వైపు మళ్లించుకునే ఎత్తుగడతో వెళుతోందని పార్టీ నేతలు సమావేశంలో ప్రస్తావించారు. ఈ క్రమంలో టీడీపీ ఎటు వైపు ఉండాలి? ఏ వర్గానికి చేరువకావాలన్న అంశంపై స్వల్ప చర్చ జరిగినట్లు సమాచారం.
తన హిందుత్వ విధానాలతో టీడీపీని వెనక్కి నెట్టి, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకునే వ్యూహంతో వెళుతున్నందున, మనం కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు సూచించారు. దేవాలయాలపై దాడుల వ్యవహారంలో రాజకీయంగా మనం మౌనంగా ఉంటే, ఆ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకునే ప్రమాదం లేకపోలేదని మరికొందరు హెచ్చరించారు. రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను కూడా దృష్టిలో ఉంచుకుని, బీజేపీ అమలుచేస్తున్న వ్యూహాలను గమనించాలని, పలువురు నేతలు చంద్రబాబుకు సూచించారు.

ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న చంద్రబాబు నాయుడు.. మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దేవాలయంపై కూడా దాడి జరగలేదని, ఏ మతం మనోభావాలు గాయపడలేదని గుర్తు చేశారు. దాడికి గురయిన ఒక్క ఆలయాన్ని కూడా జగన్‌రెడ్డి సందర్శించలేదని, హిందూ ఆలయ రక్షణపై ఆయన చిత్తశుద్ధికి అదే నిదర్శనమన్న విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. ఈ రాష్ట్రంలో సీఎం, డీజీపీ, హోం మంత్రి క్రైస్తవులే అయినందుకే.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్న భావన ప్రజల్లో ఉందన్న విషయాన్ని, మరికొందరు నేతలు సమావేశంలో చర్చించారు. దానితో జోక్యం చేసుకున్న బాబు.. వారు ముగ్గురూ సంఘటనలపై వెంటనే స్పందించి, నిందితులను అరెస్టు చేసి కఠినంగా వ్యవహరించి ఉంటే అలాంటి భావన ఏర్పడేది కాదన్నారు. జగన్‌రెడ్డికి పాలనానుభవం లేక, ఇంకా  ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు సంఘటనల్లో టీడీపీ హస్తం ఉంటే, ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని బాబు ఆదేశించారు.

రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా, నేతలు ముందుండి పోరాడాలని ఆదేశించారు.  ప్రొద్దుటూరులో పార్టీ కార్యకర్త సుబ్బయ్య హత్య తర్వాత లోకేష్ అక్కడికి వెళ్లి, ధర్నా చేయడం వల్లే పోలీసులు దిగివచ్చారని, ఇది కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపిందని సీనియర్లు చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా అదే స్ఫూర్తి ఇకపైనా కొనసాగించాలని బాబు ఆదేశించారు.