ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయ్

120

– రాజకీయంగా దివాళా తీసిన టీడీపీ మత రాజకీయాలు చేస్తోంది.
– విగ్రహాల విధ్వంసం వల్ల ఎవరికి ప్రయోజనం?
– చంద్రబాబుకు క్రిస్టియన్లు ఓట్లు వేసి ఉండరా? క్రిస్టియన్లు, ముస్లింలు ఓట్లు వేయకుండానే సీఎం అవుతారా?
– పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు.. భద్రత లేని గుడులను టార్గెట్ చేస్తున్నారు- అవగాహన లేనివారు చేసే వ్యాఖ్యల్లా బండి సంజయ్‌ మాటలు..
– మఠాధిపతులు, పీఠాధిపతులు సంయమనం పాటించండి
– ఎవరు చేశారో అప్రస్తుతం కాదు.. ఎవరు చేశారో, ఏ కుట్ర దాగి ఉన్నదన్నది ప్రస్తుతమే..

రాష్ట్రంలో రకరకాల సంక్షోభాలు చూశామని, గతంలో ఎప్పుడూ ఇంత హఠాత్తుగా ఒక సంక్షోభం సృష్టించి దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహాలు, ఎత్తుగడలు కొన్ని రాజకీయ పార్టీలు ప్రవృత్తిగా మార్చుకుని వ్యవహరించటం చూడలేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  కానీ ఈరోజు అత్యంత ప్రమాదకరమైన రాజకీయానికి ప్రతిపక్షాలు తెరలేపాయని ఇది చాలా బాధాకరమని సజ్జల అన్నారు. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు..  దేవుళ్లు, మతం పేరుతో చెలగాటమాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వరుసగా ఒక పద్ధతి ప్రకారం  ఆలయాలపై దాడులు చేస్తున్నారని సజ్జల తెలిపారు. ఎక్కడైతే భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉండవో.. మారుమూల చిన్న చిన్న గుడులు ఉంటాయో.. ఎక్కడ భద్రత పరంగా ఏమరుపాటుగా ఉంటారో వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సజ్జల వివరించారు.

రాష్ట్రంలో లక్షలాది గుడులు ఉన్నాయని.. అక్కడక్కడ విగ్రహాలకు నష్టం కలిగించి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకువెళ్లాలనే కుట్ర కనిపిస్తోందని సజ్జల పేర్కొన్నారు. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేయటం ద్వారా వైయస్‌ఆర్‌సీపీకి గానీ, సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి గారికిగానీ ఏదైనా ప్రయోజనం లభించే అవకాశం ఉందా అని సజ్జల ప్రశ్నించారు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరైనా, ఒకటో తరగతి చదివే పిల్లవాడు కూడా దీనివల్ల ప్రభుత్వానికి నష్టం తప్ప ఏముంటుందని సమాధానం చెబుతారు. అసలు ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తారని సజ్జల నిలదీశారు. తెరవెనుక సీఎం జగన్‌ ఉండి ఏదో చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏ ప్రయోజనం ఆశించి సీఎం జగన్ ఇటువంటివి చేస్తారని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో 60వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి, కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసి 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో తాను చేస్తున్న మంచిని సీఎం  జగన్ చెప్పాలనుకుంటారా? లేక దేవాలయాల ధ్వంసం వల్ల పబ్లిసిటీ పొందాలని అనుకుంటారా అని సజ్జల సూటిగా ప్రశ్నించారు.

తుచ్ఛమైన, నీచమైన రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టీడీపీనే
ప్రజా సమస్యలు తీర్చటమే రాజకీయ పార్టీల పని.. మతపరమైన అంశాలన్నీ మతగురువులు చూసుకుంటారు.తెలుగుదేశం పార్టీ లాంటి దురాలోచనలు వైయస్‌ జగన్ గారికి ఎప్పుడూ లేవు. ఇలాంటి తుచ్ఛమైన, నీచమైన రాజకీయ ఆలోచనలు ఆయన ఎప్పుడూ చేయలేదని సజ్జల తెలిపారు.జగన్ కష్టపడి పదేళ్లపాటు పోరాడి రాజమార్గంలో అధికారంలోకి వచ్చారని సజ్జల తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ, మా నాయకుడుజగన్ గానీ సున్నితమైన మతపరమైన అంశాలపై ఏనాడైనా క్షణికావేశంతో ఉద్యమాలు చేపట్టలేదన్నారు. క్షణికావేశంతోనే కాదు.. వీలైతే ఇటువంటి ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా, వాటిని తగ్గించటానికి ప్రయత్నించామని సజ్జల తెలిపారు. రాజకీయ పార్టీల పని ప్రజల సమస్యలు తీర్చటం, ప్రజల గురించి ఆలోచించటమే అని సజ్జల అన్నారు. సమస్యలకు పరిష్కారాలకు చూడటమే. మతపరమైన సమస్యలు, దేవాలయాలకు సంబంధించి స్వాములు, బిషప్‌లు, ముల్లాలు, మతగురువులు మాట్లాడుకోవాలి తప్ప రాజకీయనాయకులకు సంబంధం ఉందని ఏనాడూ భావించలేదని సజ్జల తెలిపారు.

మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎవరి విశ్వాసాలు వారికి ఉన్నా,  వారందర్నీ గౌరవించాలన్నారు. ఆ విశ్వాసాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అనేది వీటికి అతీతంగా ప్రజల సమస్యలపైన, వారి విశ్వాసాలకు సంబంధించి ప్రార్థనా మందిరాల భద్రత చూస్తుందని సజ్జల తెలిపారు. ప్రధానంగా మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ప్రభుత్వం అయితే మతాలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందని ఈ విషయాన్ని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారని సజ్జల తెలిపారు.కులాలు, మతాలు అయిపోయాయ్. దేవుళ్లతో రాజకీయాలు చేసే అవకాశం టీడీపీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. దేవాలయాల ఘటనలకు వైయస్‌ఆర్‌సీపీకి ఎటువంటి సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు. జగన్ చేతితో ఘోర అవమానానికి గురై ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో వారే ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని సజ్జల అన్నారు. జగన్ ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో కులాలు, మతాలు అయిపోయి, ఇక దేవుళ్ల మీదకు వెళ్లి రాజకీయం చేస్తున్న (టీడీపీకే) పార్టీకే ఆ అవకాశం ఉందని గట్టిగా భావిస్తున్నానని సజ్జల అన్నారు. అలాగే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తోందని సజ్జల అన్నారు. ముందు నుంచి మతం వాళ్ల అజెండాలో ఒక భాగం కాబట్టి దాన్ని తీసుకొని ఉద్యమిస్తున్నారు .కానీ చంద్రబాబు నాయుడి వైఖరే విచిత్రంగా ఉందని సజ్జల అన్నారు. అలాగైనా బీజేపీ జత కడుతుందేమో అని చంద్రబాబు అనుకుంటున్నారేమో అని సజ్జల అన్నారు. ప్రజల్లో జగన్ మీద అనుమానాలు సృష్టించవచ్చనే నమ్మకంతో లేదా అత్యాశతో ఈ పని చంద్రబాబు చేస్తున్నారని భావిస్తున్నామని సజ్జల అన్నారు. రామతీర్థం ఘటన కుట్రే… కావాలని ధ్వంసం చేశారు కుట్రకు పాల్పడిన వారిని, అందుకు కారకుల్ని పట్టుకొని ప్రభుత్వం శిక్షిస్తుంది ఉన్మాదంగా వ్యవహరించే వారు చేసే దురాగతాలు ఇవి

అధికారం ఎప్పుడూ రుచి చూడని పార్టీనో, బాధ్యతాయుతంగా అధికారంలో లేని పార్టీనో ఏదో ఒక స్టాండ్ తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చని సజ్జల అన్నారు. గత 18 నెలల క్రితం వరకు కూడా టీడీపీ అధికారంలో ఉందని సజ్జల తెలిపారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. రాత్రి ఎవరైనా దుండగులు విగ్రహం చేతిని, ముక్కును ధ్వంసం చేస్తే అక్కడ ఏం చేస్తోందో తెలియదని సజ్జల అన్నారు. కోల్డ్‌ బ్లడెడ్‌గా, ఓ పథకం ప్రకారం చేస్తున్నారని సజ్జల తెలిపారు. రామతీర్థం కొండ ఎక్కి దిగాలంటే కాళ్లు పట్టుకుంటాయి. ఎవరో వెళ్లి అపచారం చేసి సరదాగా వస్తారని అనుకోవటానికి వీల్లేదని ఒక పథకం ప్రకారం వెళ్లారని సజ్జల అన్నారు. మావైపు నుంచి ఇలాంటి వాటికి ఎవ్వరూ వెళ్లరని అంతకంటే తెలివితక్కువతనం ఉండదని సజ్జల అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పదేళ్ల చరిత్రలో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని సజ్జల తెలిపారు. మతపరమైన సంఘటనల్లో, రాత్రి ఘటన జరిగితే తెల్లవారే సరికి ఆరోపణలు ఎప్పుడూ చేయలేదని పైగా ఎవరైనా చేస్తే వద్దని చెప్పటం జరిగిందని సజ్జల గుర్తు చేశారు. పైగా నీచంగా ఏ స్థాయికి అయినా దిగి సొంత తల్లిని, తండ్రిని, బిడ్డలను చంపే స్వభావం కలిగిన ఉన్మాదంగా రాజకీయం చేసే స్థితిలో ఉన్న నేతలో, గ్రూపులో, పార్టీలో చేసే దురాగతంగా దీన్ని భావిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

కోడిగుడ్డు మీద ఈకలు పీకటం మానుకోండి
టీడీపీ గత18 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చంద్రబాబు చెప్పుకుంటారు. మీ హయాంలో గుడులకు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయ్. ఎన్ని పరిష్కరించారో చెప్పండి. కోడిగుడ్డుకు ఈకలు పీకటమో.. ఏదో ఒకటి క్రియేట్ చేసి చేయటం లాంటి ఆలోచనలు ఉంటే మేం అధికారంలోకి రాగానే మీరు ఇది చేశారని చిట్టా పెట్టేవాళ్లమని సజ్జల తెలిపారు. ఈ సొసైటీలో అన్నిరకాల వాళ్లు ఉన్నారు. ఏదో ఒకచోట జరగవచ్చు. ఆ జరిగిన దానిమీద ఇన్వెస్టిగేషన్‌లో దొరకవచ్చు. ఒక్కోసారి డిలే కావొచ్చు. దాన్ని కాదనటం లేదని సజ్జల తెలిపారు. ప్రజా సమస్యలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని అనుకుంటోంది తప్ప అనవసరమైన విషయాలపైన కాదని సజ్జల అన్నారు.

పుష్కరాల్లో 29 మంది హత్యకు చంద్రబాబే కారకుడు
టీడీపీ హయాంలో ఘోరాలు,పాపాల చిట్టా తీస్తే.. లెక్కే ఉండదు చంద్రబాబు హయాంలో పుష్కరాల సందర్భంగా 29 మంది తొక్కిసలాటలో మృతి చెందారు. ఆ ఘటనలో భక్తులను సామూహికంగా హత్య చేశారని అనొచ్చు. బీజేపీ మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. చాలా మంది పోరాటం చేశారు. ఏరోజు కూడా చంద్రబాబు పవిత్రమైన గుడులకు, పూజలకు వెళ్లినప్పుడు కూడా బూట్లు విప్పి గౌరవప్రదంగా వెళ్లిన దాఖలాలు లేవు. దానికి చంద్రబాబు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కారణం కావొచ్చని నేను అంటున్నాను. అదే చంద్రబాబు అయితే ఆమాట కూడా అనరని సజ్జల అన్నారు.  సదావర్తి భూములు ఎంత ఘోరంగా కొల్లగొట్లాలని చూశారన్నారు. టీటీడీలో జరిగిన సంఘటనలు ఇలా లెక్కపెట్టుకుంటూపోతే ఎన్నో ఉన్నాయ్. మీరు అధికారంలో ఉన్నారు. మీ కబ్బోర్డు నిండా అస్థిపంజరాలే ఉన్నాయని సజ్జల మండిపడ్డారు. పైగా సీఎం శ్రీ జగన్ గారిని ఏసుప్రభువు భక్తుడు, నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని అని చంద్రబాబు అనటం ఏంటి?  ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి తొందరపాటు వ్యవహారం చేయలేదని సజ్జల స్పష్టం చేశారు. మతపరమైన అంశంగా ఉన్న బీజేపీ కూడా చేయటం లేదని సజ్జల అన్నారు. ఇంత ఆరాటం, ఆతృత చంద్రబాబుకు ఎందుకు? ఎన్నికలకు కూడా ఇంకా మూడేళ్ల సమయం ఉందని సజ్జల గుర్తు చేశారు.

.ఒక్కసారి ప్రజాజీవితానికి నష్టం జరిగితే.. మతసామరస్యం భంగం కలిగించే వాటివల్ల జరిగే గాయాలు పోవని సజ్జల హెచ్చరించారు. టీడీపీనే గాయం చేసి చూపిస్తున్నారు. దానికి కారం పూసి, దానిని పెద్దది చేయాలని అనుకుంటున్నారు. దానివల్ల టీడీపీ నాయకులే నష్టపోతారని ఈ విషయాన్ని గమనించాలని సజ్జల కోరారు. రాజమండ్రి, శింగరాయకొండ సంఘనలు జరిగాయని చెబుతున్నారు. వీటి అన్నింటి దగ్గరకు ఎవరైనా పోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా దర్యాప్తు చేయటం జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకులు వెళ్తున్నారు. అయితే, రెచ్చగొట్టేలా పోవద్దని ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామని సజ్జల సూచించారు. మొన్న రామతీర్థం చంద్రబాబు వెళ్లారు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. వెళ్లేముందు ఏం చేస్తున్నామో.. ఈ కార్యక్రమం రాజకీయంగా ఎక్కడికి వెళ్తుందనేది వారు ఆలోచించాలని సజ్జల అన్నారు. మాట్లాడే సందర్భంలోనూ ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబు ఆలోచించాలన్నారు. చంద్రబాబుకు క్రిస్టియన్లు ఓట్లు వేసి ఉండరా? క్రిస్టియన్లు, ముస్లింలు ఓట్లు వేయకుండానే సీఎం అవుతారా? హిందువులు వేయకుండానే అధికారంలోకి ఎవరైనా వస్తారా? చంద్రబాబుకు ఇక అధికారంలోకి వచ్చే ఆలోచన లేదో.. వద్దనుకుంటున్నారో .. పూర్తిగా ఆలోచన శక్తి పోయిందో తెలీదని సజ్జల అన్నారు. ఇదైతే సరైన పద్ధతి కాదన్నారు.

మఠాధిపతులు, పీఠాధిపతులు సంయమనం పాటించండి
ఎవరి చేశారో అప్రస్తుతం కాదు.. ఎవరు చేశారో ప్రస్తుతం అన్నది చూడాలి  మఠాధిపతులు, పీఠాధిపతులు మాట్లాడుతున్నారు. వారికీ విజ్ఞప్తి చేస్తున్నామని.. ఈ సంఘటనలు ఎవరో ఉన్మాది చేసి ఉండాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రగా చేస్తున్నారని కనిపిస్తోందని సజ్జల తెలిపారు. మఠాధిపతులు, పీఠాధిపతులు సంయమనం పాటించాల సజ్జల కోరారు. ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు. రాత్రి జరిగితే తెల్లవారే సరికి ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రభుత్వ వైఫల్యం అంటే రాజకీయం ఉందని భావించాలని సజ్జల అన్నారు. కొద్దిసేపటి క్రితం చినజీయర్ స్వామి మాట్లాడుతూ… ఎవరు చేశారో అప్రస్తుతం అన్నారు. కానీ ఎవరు చేశారో, దాని వెనుక ఎవరు ఉన్నారో, వాళ్ళ ఉద్దేశాలేమిటో అన్నది ప్రస్తుతంగా చూడాలని సజ్జల తెలిపారు. ఎవరు చేస్తారు? నగల కోసం చేశారంటే అర్థం ఉంటుంది. ఊరి చివరన గుడికి నష్టం కలిగించారంటే కచ్చితంగా ఏదో కుట్రపూరితంగా చేశారని సజ్జల అన్నారు. మరి అలాంటప్పుడు అప్రస్తుతం ఎందుకు వస్తుందని ప్రస్తుతం అవుతుందని .. దర్యాప్తులో వాడ్ని పట్టుకుంటేనే లక్ష్యం ఏమిటో తెలుస్తుందని సజ్జల అన్నారు.

ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ప్రజానీకం సహకరించాలని సజ్జల కోరారు. ఇలాంటివి చేసినవారు తప్పించుకోలేరనే విధంగా హెచ్చరిక ఉండాలన్నారు. వారిని పట్టుకోవాలని ప్రజల్ని కోరారు. భవిష్యత్‌లో ఎవ్వరు ఇలాంటి దురాగతాలకు పాల్పడాలన్నా భయపడేలా శిక్షలు ఉండాలని సజ్జల అన్నారు. ప్రభుత్వం కచ్చితంగా పట్టుకొని ఇలాంటి ఆలోచన చేయకుండా చర్యలు తీసుకుంటుందని సజ్జల తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
గతంలో దారిదోపిడీలు జరిగేవి. ఇప్పుడు అలాంటివి ఏమీలేవు. మారుమూల ఇళ్లు ఉంటే ముఠాలు దాడి చేసేవని సజ్జల అన్నారు. ఇప్పుడు కూడా మారుమూల ప్రాంతాల్లోని దేవాలయాలపై అలా దాడులు చేసే దురదృష్టకరమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతి ఊరిలో పెద్దలు, అధికారులు కలిసి యువకులతో రాత్రులు గస్తీలు తిరిగి పోలీసులకు సహకరించాలని సజ్జల కోరారు. మీ ప్రాంతానికి కొత్తగా ఎవరైనా అగంతకులు వచ్చినా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడినా సమాచారం ఇచ్చి సహకరిస్తే త్వరగానే దీన్ని అదుపు చేయవచ్చని సజ్జల అన్నారు. ఇది మనందరి బాధ్యత అని సజ్జల తెలిపారు.

మారుమూల ప్రాంతాల్లో, ఊర్లలో ఎక్కడో జరిగే దానికి పోలీసు యంత్రాంగం చేయాలని కోరటం సరైంది కాదు. ప్రజలు కూడా ఈ నిఘాలో సహకరిస్తే వారం రోజుల్లో దొరుకుతారు. దొరికితే వారిని ఉతికి పోలీసులకు అప్పజెబితే.. ఆ విషయం టీడీపీనో, మతాన్ని నమ్ముకున్న శక్తుల దగ్గరకు వెళ్తుందన్నారు. రాజకీయం నుంచి మతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే.. వారి రోజువారీ సమస్యలు తీర్చాలని సజ్జల అన్నారు. ఆధ్యాత్మిక సమస్యలు తీర్చటానికి, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఆలయాల పవిత్రను కాపాడటానికి వారు చెబుతారు. ప్రభుత్వం వారికి పూర్తి గౌరవం ఇస్తుంది. ఈ ఇష్యూను రాజకీయం చేయాలనుకునే వారికి తగిన పాఠం చెప్పటానికి ప్రజలంతా సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

-మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
రాత్రి సంఘటన జరిగి.. తెల్లవారే సరికి ఏదో ఊహించని సంక్షోభం వచ్చినట్లు క్రియేట్ చేస్తున్నారు. మొన్న నాలుగు డివిజన్లు గెలిచిన(బీజేపీ) తర్వాత రాష్ట్రంలో పొలిటికల్‌గా రావటానికి వారు ఎంచుకొన్న దారి ఏమో. అచ్చెన్నాయుడు ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు కానీ విజయవాడలో గుళ్లు కూల్చినప్పుడు మాణిక్యాలరావే మంత్రిగా ఉన్నారు. మతమే దీన్ని రాజకీయంగా నడపాలని అనుకుంటున్నారేమో వాళ్లు చెప్పాలి. బీజేపీ అజెండాలో హిందూమతం ఉంది. కానీ రోజుకు నాలుగుసార్లు నాలుక మడతలు వేసే చంద్రబాబు హిందూమతం ద్వారా బీజేపీతో కలవటానికి ప్రయత్నిస్తున్నారేమో. బీజేపీకి సంబంధించిన వరకు వారు ఏపీలో రావటానికి ఇదొక దారి వేసుకుంటున్నారేమో. భ్రమలే ఉన్నారేమో.

మాటలు దొరుకుతున్నాయని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అసంబద్ధమైన ప్రేలాపనలు సరికాదు. వార్డుస్థాయి రాజకీయాలు చేయటం సరికాదు. తిరుమల పవిత్రత కాపాడింది వైయస్‌ఆర్‌ కాదా? వీళ్ల ఆత్రుత చూస్తుంటే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయ్. ఒక అఘాయిత్యం జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ మాటలన్నీ ఆకోవలేనే ఉన్నాయని సజ్జల అన్నారు.
ఉప ఎన్నిక కోసం టీడీపీ రాజకీయం చేస్తుంది. గతంలో మీరు గమనిస్తే నంద్యాల ఉప ఎన్నికలప్పుడు కూడాఇలానే చేశారు. అప్పుడు టీడీపీ అక్కడ బీజేపీతో పార్టనర్‌గా ఉంది. అయినా సరే.. రిపబ్లిక్ టీవీలో  జగన్, బీజేపీ ఒకటి అవుతున్నారని ముస్లిం ప్రాంతాల్లో నంద్యాల ఎన్నికల సమయంలో కరపత్రాలు పంచారని సజ్జల గుర్తు చేశారు. షార్ట్‌ కట్‌లో నికృష్ట ఆలోచనలు చేయటంలో టీడీపీ ముందుంది. బీజేపీ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ, రాష్ట్ర స్థాయిలో ఒక ఉప ఎన్నిక కోసం అలా ఆలోచిస్తున్నారంటే ఏపీ రాష్ట్ర ప్రజలైతే క్షమించరు.

అధికారులను కూడా కులాల పరంగా చూడటం మొదలు పెట్టారు. గౌతం సవాంగ్‌ గారు ఇక్కడ విజయవాడ కమీషనర్‌గా చేశారు. మతాలను, కులాలను అడ్మినిస్ట్రేషన్‌కు అప్లై చేస్తున్నారంటే ఉన్మాదం అయినా వచ్చి ఉండాలి. లేకపోతే రాజకీయంగా దిగజారి చేయటమే. సామాన్యంగా ప్రజల బాగోగులపై ఆలోచించే వారు ఎవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరు.