తెలంగాణ పోలీస్ ప్రచారకర్తగా ఎన్టీఆర్..

450

‘ఫేస్‌బుక్’ మోసాలపై చెల్లెమ్మలకు అవగాహన!
ఫేస్‌బుక్ మోసాలపై హైదరాబాద్ పోలీసుల వీడియో
ప్రేమ పేరుతో విసిరే వలకు దూరంగా ఉండాలంటూ ఎన్టీఆర్ రిక్వెస్ట్
బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపు

ఫేస్‌బుక్ ప్రేమల బారినపడి మోసపోవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ అవగాహన కల్పిస్తున్నాడు. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ మోసాలకు పాల్పడే ముఠాలు చాలానే ఉన్నాయని, వాటి బారినపడొద్దంటూ తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు.
ఈ ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటాయని, ఆపై ప్రేమ పేరుతో వల విసురుతాయని పోలీసులు ఆ వీడియోలో చూపించారు. కాస్తంత దగ్గరైన తర్వాత వాట్సాప్‌లో అభ్యంతరకర ఫొటోలను తెప్పించుకుంటాయని, అనంతరం రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు.
ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని, ఇవ్వకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారని వివరించారు. కాబట్టి  ఇలాంటి ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ‘‘చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మోసగాళ్ల బారినపడి ఎవరైనా బాధితులుగా మారితే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.