వైకాపా ప్రభుత్వంలో రాముడికి అపచారం

144

రామతీర్థం ధర్మయాత్ర అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర
నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్భందం పోలీసుల అదుపులో నాయకులు
సోమువీర్రాజుపై దౌర్జన్యం జైశ్రీరాం నినాదాలతో మార్మోగిన రహదారులు

ఆలయాల విధ్వంసానికి ప్రోత్సాహమిస్తూ, హిందూ మతాన్ని అవమానపరిస్తున్న వైకాపా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆరోపించారు. రామతీర్ధం ఆలయంలో విగ్రహం ధ్వంసం కావడంతో పరిశీలనకు వెళ్తున్న భాజపా, జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్దం వస్తున్న భాజపా రాష్ర్ట అధ్యక్షులు సోమువీర్రాజును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. అదే సమయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, భాజపా విశాఖ పార్లమెంటు అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డితో కలసి రామతీర్ధం వస్తున్న రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ వాహనాన్ని అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఈ సందర్భంగా విశాఖలో సిఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో మతమార్పిడులు విచ్చలవిడిగా జరుగుతూ, ఆలయాలను ధ్వంసం చేస్తూ హిందూధర్మానికి విఘాతం కలిగిస్తూ ఉంటూ ప్రభుత్వం నేరస్తులకు ప్రోత్సాహం ఇస్తున్నతీరులో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితి రెండేళ్ల నుంచీ కొనసాగుతూ మతఘర్షణలు కు దారితీసే ప్రమాదం ఏర్పడిందన్నారు. పైగా ఆలయాలపై దాడులు చేసినవారిని మానసికవైకల్యం ఉన్నవారుగా పోలీసులు పేర్కొనడం వాస్తవాన్ని తప్పుదోవ పట్టించినట్లే అన్నారు.

ప్రభుత్వం ఇలా ఒకవర్గానికి కొమ్ముకాసేలా బుజ్జగింపు ధోరణి అనుసరించడం వల్ల సమాజంలో సంఘర్షణ జరిగి, శాంతిభద్రతలు అదుపుతప్పాయని సీఎం రమేష్ ఆరోపించారు. ఆలయాలు, విగ్రహాలను ద్వంసం చేయడాన్ని ఆపలేని పోలీసులు, దెబ్బతిన్న ఆలయాన్ని చూడటానికి వెళ్తుంటే ఆపడం పౌరహక్కులను హరించడమే అన్నారు. తమ వద్ద ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకోమని సూచించారు. ఘర్షణలు పేరుచెప్పి సెక్షన్ 30 అమలుచేస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 356 అధికరణ ఉందని మర్చిపోవద్దని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రమేష్ అన్నారు. ఆయన వెంట భాజపా రాష్ర్ట మ మీడియా ఇన్‌ఛార్జి వుల్లూరి గంగాధర్, సుబ్రహ్మణ్యం, దాడ్ల శ్రీనివాసరావు వున్నారు.

పోలీసుల జులుం
రామతీర్ధం ఆలయానికి సందర్శనకు భారతీయ జనతా పార్టీ, జనసేన నేతలు చేపట్టిన ‘రామతీర్థం ధర్మయాత్ర’ ను భగ్నం చేసేందుకు పోలీసులు సెక్షన్ 30 ను అమలుచేస్తున్నట్లు ప్రకటించి పౌరహక్కులను కాలరాసారు. అధికారపార్టీ సేవలో తరిస్తున్న పోలీసులు హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను అడ్డుకోలేకపోయారు సరికదా ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తోన్న భాజపా నోరు నొక్కేరదుకు విశ్వప్రయత్నం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా రామతీర్ధానికి బయలుదేరిన భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలను పలు జిల్లాల రహదారుల్లో అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. యాత్రకు సారధ్యం వహిస్తున్న భాజపా రాష్ర్ట అధ్యక్షులు సోమువీర్రాజు, బీజేవైఎం రాష్ర్ట అధ్యక్షులు సురేంద్రమోహన్‌తో కలసి రామతీర్ధంకు వెళ్తుండగా పోలీసులు దారికాచి అడ్డుకున్నారు. వాహనాన్ని నిలిపివేశారు. సెక్షన్ 30 పేరు చెప్పి రామతీర్దానికి వెళ్లరాదని చెప్పారు.

రామతీర్థంలో పోలీసులు సెక్షన్30 అమలు చేయడంపై వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్దం వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం చూస్తుంటే తెదేపా, వైకాపా లాలూచీ పడినట్లు కనిపిస్తుందని విమర్శించారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నవారిని పట్టుకోలేని పోలీసులు ద్వంసమైన ఆలయాన్ని చూడటానికి వెళ్లడాన్ని అడ్డుకోవడంపై మండిపడ్డారు. రాముడికి అపచారం జరిగితే అడ్డుకుంటున్న తమను నిరోధించడం రాష్ర్ట ప్రభుత్వ పరికితనపు చర్యగా అభివర్ణించారు.
ఎలాగైనా రామతీర్ధం చేరుతామని పట్టుబట్టారు. దాంతో పోలీసులు సోమువీర్రాజును వలయంగా చుట్టుముట్టి వెనక్కి నెట్టివేయడంతో సోమువీర్రాజు కిందపడిపోయారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ప్రతిఘటించడంతో పోలీసులు ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వాన్లల్లో కూలేశారు. ఈ సందర్బంగా పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

హౌస్ అరెస్టు
రామతీర్దం ధర్మయాత్రను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్రను పన్నింది. సెక్షన్ 30 పేరుతో రామతీర్ధానికి రాకూడదని ఆంక్షలు విధించింది. భాజపా నాయకులను ఇంటి వద్దే హౌస్ అరెస్టు చేసింది. విశాఖపట్నంలో భాజపా పూర్వ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, భాజపా రాష్ర్ట అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, అరకు పార్లమెంట్ ఇన్ ఛార్జి పరశురామరాజు, గాజువాక నియోజకవర్గ ఇన్ ఛార్జి కరణం నర్సింగరావు, దుర్గరాజు, బుద్దా లక్ష్మీనారాయణ, రామరాజు, పార్వతీపురంలో భాజపా నేత ఉమామహేశ్వరరావును గహనిర్బంధంలో ఉంచారు. మరో 25 మంది భాజపా నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి గహనిర్బంధం చేశారు. పూర్వ అధ్యక్షులు కన్నా క్ష్మీనారాణను గుంటూరులో ఆయన ఇంటిలో నిర్బంధించారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డిని శ్రీకాళహస్తిలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాక్షనిస్టు పాలన సాగుతోందని నాయకులు విమర్శించారు. రామతీర్థం ధర్మయాత్రకు రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.