అర్హత కలిగిన ఏ ఒక్క జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ నిరాకరించం

529

ఐఅండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి
కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏపీయూడబ్ల్యూజే
మెరుపు ధర్నా అనంతరం కమిషనర్ హామీ

రాష్ట్రంలో అర్హత కలిగిన ఏ ఒక్క జర్నలిస్టుకూ  అక్రెడిటేషన్ నిరాకరించడం జరగదని,142 జీవోలో ఇబ్బందిగాఉన్న కొన్ని నియమాలను సరళం చేసి  అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ ఇస్తామని సమాచార, పౌరసంబంధాలశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.  మంగళవారం తనకార్యాలయంలో బైఠాయింపు కార్యక్రమం చేపట్టిన   ఏ.పి.యు.డబ్ల్యు.జే. నాయకులను చర్చలకు ఆహ్వానించారు. పలు అంశాలపై యూనియన్ నేతలతో  చర్చించారు.యూనియన్ నాయకులు లేవనెత్తిన  పలుసమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.అక్రెడిటేషన్ దరఖాస్తుల స్వీకరణ కు, సవరణకువీలుగా   ఆన్ లైన్ లింకును  వెంటనే   తిరిగి ఓపెన్ చేస్తామని కమిషనర్ చెప్పారు.మండలాల్లో వందకాపీల  సర్క్యులే షన్ ఉండాలన్న నియమాన్ని సడలిస్తామని కమిషనర్ తెలిపారు.  మండలస్థాయి విలేఖరులకు యాజమాన్యలేఖ ఆధారంగా అక్రెడిటేషన్ ఇస్తామని కమిషనర్ చెప్పారు.

చిన్న,మధ్యతరహా  పత్రికలకు జి.ఎస్.టి.నుండి పూర్తిగా  మినహాయింపు ఇవ్వాలన్న యూనియన్ నేతలడిమాండ్ పై స్పందిస్తూ పత్రికకు జి.ఎస్.టి.లేకపోయినా ప్రింటర్ నుండి లేఖఇస్తే సరిపోతుందన్నారు. అలాగే పత్రికకాపీల కనీససంఖ్యను 1000 నుండి  500 కు కుదించే విషయం ప్రభుత్వంతోచర్చించి తగునిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.ఆంధ్ర భూమి పత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి అక్రెడిటేషను కొనసాగించాలన్న యూనియన్ డిమాండ్ కు కమిషనర్ సానుకూలంగా స్పందించారు.గతంలో అక్రెడిటేషన్ ఉన్న  ఆంధ్ర భూమి సిబ్బంది తమకు ప్రత్యేకంగా ఒక అభ్యర్ధన పంపితే స్పెషల్ కేసుగా పరిగణించి వారికి అక్రెడిటేషన్ కొనసాగిస్తామని కమిషనర్ చెప్పారు.స్టూడియోఉండి, రోజుకుమూడు వార్తాబులెటిన్లు ఇచ్చే కేబులు ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ లు కొనసాగిస్తామని కమిషనర్ చెప్పారు.అక్రెడిటేషన్ల మంజూరు విషయంలో  స్థానిక స్థాయిలో ఇబ్బందులు ఉన్న పక్షంలో తమ శాఖఅధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిపరిష్కారం కోసం తగినచర్యలు తీసుకుంటామనికూడా కమిషనర్ హామీఇచ్చారు.కరోనా బారిన పడి మృతి చెందిన పాత్రికేయ కుటుంబాలను ఆదుకొనే విషయమై యూనియన్ నేతలు లేవనెత్తిన అంశంపై కమిషనర్ స్పందించారు. ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఆర్థిక సహకారం అందించే  ఫైల్ కు పరిపాలనా ఆమోదం లభించిందని, ఫైనాన్స్ నుండి క్లియరెన్స్ రాగానే బాధితకుటుంబాలకు సహాయం అందిస్తామని కమిషనర్ చెప్పారు.

కమిషనరుతో జరిగినచర్చలలో ఏ.పి.యు.డబ్ల్యు.జే.అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ప్రధానకార్యదర్శి చందుజనార్ధన్, ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, జాతీయకార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్, యూనియన్ రాష్ట్రఉపాధ్యక్షులు పసుపులేటిరాము, తెలుగు అంబన్న, కార్యదర్శి పి.రామ సుబ్బారెడ్డి, కోశాధికారి ఏ.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావారవి, పి. భక్తవత్సల రావు,  ఏ.సురేష్,  సాయి, లక్ష్మినారాయణ, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివ రావు,  సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శి రమణారెడ్డి,  ఎలెక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్ రెడ్డి, కార్యదర్శులు ఏచూరి శివ, బి.బుచ్చిబాబు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, కృష్ణాఅర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బైఠాయించిన పాత్రికేయులు:
142 జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ,అక్రెడిటేషన్ విధానంలో ఉన్న అసమంజసమైన నియమాలను నిరసిస్తూ మంగళవారం  ఏ.పి.యు.డబ్ల్యు.జే. ఆధ్వర్యంలో వందలాదిమంది  పాత్రికేయులు  కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడించి  బైఠాయించారు. ఉదయం 11 గంటలకే  కార్యాలయానికి చేరి  కారిడార్లో నేలపై బైఠాయించిన పాత్రికేయులు 142 జీఓను రద్దుచేయాలని, చిన్న, మధ్యతరహా  పత్రికలను జి.ఎస్.టి.నుండి మినహాయించాలని, అక్రెడిటేషన్ కు సర్క్యులేషన్ తో లింకు రద్దు చేయాలని,  అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలని పెద్దపెట్టున నినాదాలుచేశారు.