తన కటౌట్ పక్కనే నిల్చుని సంతోషంగా సెల్ఫీలు తీసుకున్న డీజీపీ

318

తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్
ఇగ్నైట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విన్యాసాలు
తిలకించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇగ్నైట్ పేరుతో ఏపీ పోలీస్ విభాగం తిరుపతిలో డ్యూటీ మీట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక్కడి పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ పోలీస్ డ్యూటీమీట్ కు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తన కటౌట్ ను ఆయన ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, తన కటౌట్ పక్కనే నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాలు నిన్న ప్రారంభమయ్యాయి. బాంబ్ స్క్వాడ్ లు, డాగ్ స్క్వాడ్ బృందాలు, ఆక్టోపస్ బలగాల విన్యాసాలు తొలిరోజు మీట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు, హైజాక్ ఘటనల సందర్భంగా నిర్వహించే విన్యాసాలను ప్రత్యేక బలగాలు ప్రదర్శించాయి. ఈ కార్యక్రమాలను డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు వీక్షించారు.