‘సంజయ్’ దమ్ము ‘సోము’కు ఏదీ?

176

కమలదళాలకు సంజయస్ఫూర్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

దళపతి అంటే ఆయనలా ఉండాలేమో.. సారథి అంటే ఆయలా స్ఫూర్తి ప్రదాతలా ఉండాలేమో? యుద్ధమంటే బంతిపూలతో కాదు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చేసినట్లు అస్త్రశస్త్రాలు సంధించాలేమో? కలసి వెరసి పార్టీ రథసారధి అంటే బండి సంజయ్‌లా ఉండాలి! ఇదీ.. ఏపీ బీజేపీ శ్రేణుల మనోభావం. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో,  బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా అన్నదే తమ నినాదమని ప్రకటించిన సంజయ్ వ్యాఖ్యలు కమలదళాల్లో సమరోత్సాహం నింపినట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది. ఆవిధంగా బీజేపీది భగవ ద్గీత పార్టీ అయితే వైసీపీది బైబిల్ పార్టీ అన్న విషయాన్ని సంజయ్ నేరుగా హిందువుల్లో తీసుకువెళ్లడంలో వ్యూహాత్మక విజయం సాధించారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన ట్లు..అదే ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారింది.

ఏపీలో దేవాలయాలపై శరపరంపరగా జరుగుతున్న దాడులపై..  రాష్ట్ర  పార్టీ నాయకత్వం, వైసీపీ సర్కారుపై తమలపాకు, అప్పుడప్పుడు బంతిపూలతో చేస్తున్న యుద్ధంపై బీజేపీ శ్రేణుల్లో చాలాకాలం నుంచీ అసంతృప్తి నెలకొంది. కానీ మునుపటి మాదిరిగా నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడకుండా, సోము వీర్రాజు నాయకత్వం లక్ష్మణరేఖ విధించడం, దానిపై సంఘటనా ప్రధాన కార్యదరిశ మధుకర్‌జీ కూడా జోక్యం చేసుకోకపోవడంతో సీనియర్లు సైతం కిమ్మనడం లేదు. గత కొద్దికాలం నుంచీ,  దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చేస్తున్న  ప్రకటనలన్నీ.. అధ్యక్షుడు వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు పార్టీకి సంబంధించి చేసే అన్ని ప్రకటలన్నీ వీరిద్దరికే పరిమితమవడంతో, సీనియర్లు మౌనం వహిస్తున్నారు. ఏపీలో పార్టీ అంటే సునీల్ దియోధర్, వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డికే పరిమితమయిందని, సంఘటనా ప్రధాన కార్యదర్శి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న  వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగినప్పుడల్లా,  సోము-విష్ణువర్ద్‌రెడ్డి 30 శాతం ముఖ్యమంత్రి జగన్, మిగిలిన 70 శాతం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించేందుకే వెచ్చిస్తుండటంపై,  పార్టీ వర్గాల్లోనే ఆక్షేపణ వ్యక్తమవుతోంది.  టీడీపీ హయాంలో తమ పార్టీ కూడా భాగస్వామి అయినందున, అప్పటి సంఘటనలకు తామూ భాగస్వామి అన్న వాస్తవాన్ని రాష్ట్ర నాయకత్వం మర్చిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఒక సంఘటన జరిగినప్పుడు అధికారపక్షంపై ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తున్న సమయంలో, తాము కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమే సరైన వ్యూహమని చెబుతున్నారు. అయితే దానికి బదులు, సర్కారుపై దాడి చేస్తున్న తోటి ప్రతిపక్షంపై విమర్శలు చేస్తుంటే, సహజంగానే ఆ అంశం బలహీనమయి,  అది పరోక్షంగా ప్రభుత్వానికే లాభిస్తోందన్న వ్యాఖ్యలు సీనియర్ల  నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న వ్యూహం అదేవిధంగా ఉందని ఓ రాష్ట్ర నాయకుడు పెదవి విరిచారు.  సంజయ్ పాటి దమ్ము, ధైర్యం, తెగించే తత్వం, శ్రేణులను యుద్ధానికి సన్నద్ధం చేసే లక్షణం తమ అధ్యక్షుడు వీర్రాజుకు ఉండి ఉంఏ, ఈపాటికి టీడీపీ సగానికి పైగా ఖాళీ అయి ఉండేదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గళం విప్పడం, కమల దళాలలో సమరోత్సాహం నింపినట్టయింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలకు వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఘాటుగా మాట్లాడిన సంజయ్, ఊహించని విధంగా.. రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను భగవద్గీత-బైబిల్ మధ్య యుద్ధంగా మార్చడంతో, బీజేపీ శ్రేణులు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఈ వ్యూహం తమ అధ్యక్షుడు సోము వీర్రాజుకు లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది. బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా అన్నది తిరుపతి ప్రజలే తేల్చుకోవాలి. వైసీపీ రెండు కొండలు అంటోంది. బీజేపీ మాత్రం ఏడుకొండలు కావాలంటోంద’ని సంజయ్ చేసిన వ్యాఖ్య,  ఏపీ నాయకత్వానికి చెంపదెబ్బలాంటిదేనన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ‘సంజయ్ కంటే సోము వీర్రాజు పార్టీలో సీనియర్. సంఘ్ నుంచి వచ్చిన కార్యకర్త. అయినా తన కంటే జూనియర్ అయిన సంజయ్ పాటి ధైర్యంలో, వీర్రాజుకు ఇసుమంత కూడా లేకుండా పోయింది. సంజయ్ మాదిరిగా ఆయన ఎప్పుడయినా అలా సూటిగా మాట్లాడటం, ప్రభుత్వాన్ని నిలదీయడం మేమెప్పుడూ చూడలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ అధికార పార్టీని విమర్శించే వారిని ఆయన అడ్డుకుంటారు. ఇప్పుడు సంజయ్ ఫైర్ చూసి మా క్యాడర్‌లో ఎంత ఉత్సాహం వచ్చిందో, వారితో మాట్లాడితే మీకే అర్ధమవుతుంద’ని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.  ఇప్పుడు సంజయ్ ఏపీ కమలదళాలకు స్పూర్తిదాయకమైన నాయకుడిగా అవతరించారు.

ఇప్పటివరకూ తమకూ-వైసీపీకి జరుగుతున్నది తమలపాకుల యుద్ధమేనని, సంజయ్ వ్యాఖ్యల తర్వాతయినా దానిని ‘నిజమయిన యుద్ధం’గా మార్చాల్సిన బాధ్యత, రాష్ట్ర నాయకత్వానిదేనని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. సంజయ్ మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తే నిజమైన ప్రతిపక్షంగా మారేందుకు,  పెద్దగా సమయం అవసరం లేదన్న వాదన మొదలయింది. దానికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో బలం లేని తాము, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని నిర్వీర్యం చేసిన తర్వాత, దాని స్థానంలో బలపడాలన్నది ఇప్పటి దాకా బీజేపీ వ్యూహంగా ఉంది. ఒక పార్టీని బలహీనపరిచే బదులు, స్వయంగా తామే స్వయంకృషితో బలపడితేనే,  అక్కడ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందన్న వాస్తవాన్ని, తమ నాయకత్వం గుర్తించకపోవడమే వింతగా ఉందంటున్నారు.తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార అజెండా ఏమిటన్నది.. సంజయ్ ఈపాటికే తన వ్యాఖ్యలతో స్పష్టం చేసినందున, రాష్ట్ర నాయకత్వం ఇకపై అదే పంథాలోనే వెళుతుందా లేక, యధావిథిగా తమలపాకు-బంతిపూల ప్రకటనల యుద్ధంతోనే కాలక్షేపం చేస్తుందా చూడాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకూ సోము వీర్రాజు నాయకత్వం ‘అన్యమతం’ వంటి పదాన్నే వాడుతోంది తప్ప,  సంజయ్ మాదిరిగా బైబిల్ పేరు నేరుగా ప్రస్తావించిన సందర్భం లేదు. అలాంటి మొహమాట పరిస్థితిలో,  సంజయ్  తెరపైకి తీసుకువచ్చిన బైబిల్-భగవద్గీత పోలిక కొనసాగింపు అంశం,  రాష్ట్ర నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో  వినిపిస్తున్నాయి. స్వయంగా తమ పార్టీకి చెందిన పక్క రాష్ట్ర అధ్యక్షుడే ఈ అంశాన్ని ప్రస్తావించినందున, దానిని కొనసాగించి  ప్రచార ప్రాధాన్యం ఇవ్వకపోతే.. రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రభుత్వానికి భయపడుతోందన్న సంకేతాలు వెళ్లడం సహజం. అలా కాకుండా సంజయ్ శస్త్రాన్ని కొనసాగిస్తే, తిరుపతి ఉప ఎన్నిక కాక పెరిగి, పోటీ వైసీపీ-బీజేపీ మధ్యనే కేంద్రీకృతమవుతుందని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించారు.

రెండురోజుల క్రితం రామతీర్ధం ఘటనకు నిరసనగా, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేసిన ర్యాలీలు పేలవంగా ముగియడం శ్రేణులను నిరుత్సాహపరిచింది. మహిళామోర్చా పేరిట గుంటూరులో నిర్వహించిన ర్యాలీలో, మహిళలు పట్టుమని పదిమంది కూడా లేకపోగా, పురుషులే ఎక్కువగా ఉండటం విశేషం.  అంతకుముందు అంతర్వేది రథం దహనం అనంతరం జరిగిన ఘటనలో కూడా తమ పార్టీ వెనుకబడినా, కనీసం నిందితులను అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై పట్టుపట్టకుండా దానిని అటకెక్కించడంలో,  తెరవెనుక నడిచిన కథే కారణమని సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యవహారంలో ఇద్దరు పెద్ద నేతలు కీలకపాత్ర పోషించారన్న చర్చ పార్టీ వర్గాల్లొ జరుగుతోంది.

తగులబడిన రథం స్థానంలో కొత్త రథం తయారయినా, ఇప్పటివరకూ నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని,  రాష్ట నాయకత్వం నేటి వరకూ ప్రశ్నించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఎన్నికల ముందు.. తాము నానా యాగీ చేసిన పింక్ డైమండ్ మాయం  వ్యవహారాన్ని కూడా నాయకత్వం ప్రశ్నించకుండా, విజయవంతంగా సమాధి చేసిన వైనంపై,  సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్తబ్దుగా ఉన్న పార్టీలో,  బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.