‘రామతీర్ధం’లో వైసీపీ వ్యూహాత్మక తప్పిదం!

579

పోలీసుల తీరుపై  వైసీపీ నేతల అసంతృప్తి
టీడీపీకి మైలేజీ ఇచ్చామంటున్న వైసీపీ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

విజయనగరం జిల్లా రామతీర్థ ఆలయం కేంద్రంగా శనివారం జరిగిన పరిణామాల్లో అధికార వైసీపీ వ్యూహాత్మక తప్పిదం, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పొలిటికల్ మైలేజీ తెచ్చిపెట్టిందన్న భావన.. వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శనివారం నాటి సంఘటనలో విజయనగరం పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించందుకే, అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడిందన్న అసంతృప్తి కూడా ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

కోదండరాముడి విగ్రహం శిరస్సు ధ్వంసం చేసిన వైనం,  రాష్ట్రంలోని హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. దీనికి నిరసనగా చివరకు.. హైదరాబాద్‌లో బజరంగదళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు సైతం జగన్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో  రామతీర్థకు వెళ్లి, సంఘటనా స్ధలాన్ని పరిశీలించాలని టీ డీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నిర్ణయించారు.  విజయనగరం జిల్లా పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన పస్యటన కోసం స్థానిక టీడీపీ శ్రేణులు ఏర్పాట్లుచేశారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కొందరు టీడీపీ నేతలను  అదుపులోకి  తీసుకోవడంతో,  ఉద్రిక్త వాతావరణం మొదలయింది.

విపక్ష నేత చంద్రబాబు నాయుడు శనివారం రామతీర్థకు వస్తున్నారని తెలిసిన, వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా అదే రోజు రామతీర్థ పర్యటనకు వెళ్లడం ఘర్షణ పరిస్థితికి దారితీసింది.  ఈ క్రమంలో పోలీసులు,  చంద్రబాబు కాన్వాయ్‌లో ఒక్క వాహనానికే అనుమతించడం, మిగిలిన వాహనాలు ముందుకు వెళ్లకుండా స్వయంగా పోలీసులే లారీలు అడ్డుపెట్టడం, దీనికి నిరసనగా చంద్రబాబు ధర్నాకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అప్పటికే రామతీర్థలో ఉన్న విజయసాయిరెడ్డికి నిరసనగా అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలోని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం, ఆయన కారుపై రాళ్లు వేయడంతో పోలీసులు ఆయనను, వేరే కారులో తీసుకువెళ్లాల్సిన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

రామతీర్థ కోదండరామాలయం కేంద్రంగా జరిగిన  ఈ పరిణామాలకు, టీవీ చానెళ్లు విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడంతో అందరి దృష్టి అటు మళ్లింది. ఈ పరిణామాలు పరిశీలించిన ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, తమ నాయకత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష నేత చంద్రబాబును అడ్డుకోకుండా వదిలేస్తే సరిపోయేదని, ఆయన జగన్ ప్రభుత్వంపై సహజంగానే విమర్శలు చేసి వెళ్లిపోయేవారని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. బాబు పర్యటనకు అనుమతించిన పోలీసులు, తిరిగి అదే రోజు విజయసాయిరెడ్డి పర్యటనకూ అనుమతివ్వడం వల్లనే శాంతిభద్రత సమస్య ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు. పోనీ, బాబు పర్యటనకు అనుమతి ఇవ్వకుండా నిరాకరిస్తే, ఆయన కోర్టు ద్వారా తర్వాత మరెప్పుడయినా అక్కడికి వెళ్లేవారని వివరిస్తున్నారు. శనివారం ఇద్దరిలో ఒకరికే అనుమతిస్తే, ఈ సమస్య ఏర్పడేది కాదన్నది వైసీపీ నేతల వాదన. ఈ విషయంలో జిల్లా పోలీసులు కఠినంగా, నిర్మొహమాటంగా వ్యవహరించలేపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు సంఘటన మొత్తం చానెళ్ల ద్వారా, అందరికీ తెలిసిపోవడంతో ప్రజల దృష్టిలో తమ పార్టీనే తప్పు చేసిందన్న భావన నాటుకుపోవడం, రాజకీయంగా ఆందోళన కలిగించే అంశమనేనని  వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. రామతీర్థ కేంద్రంగా శనివారం నాటి తమ పార్టీ నేతల చర్యలన్నీ,  పరోక్షంగా టీడీపీకి పొలిటికల్ మైలేజీ తీసుకువచ్చేవేనని పలువురు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రామతీర్థకు తమ పార్టీ నేతలు వెళ్లకుండా ఉండి ఉంటే, అక్కడి రాజకీయ పరిణామాలు  మొత్తం.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య కేంద్రీకృతమయి ఉండేదని వైసీపీ సీనియర్లు  విశ్లేషిస్తున్నారు.

విజయసాయి వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా,  నినాదాల చేసిన వారిలో టీడీపీ కార్యకర్తలతోపాటు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉండటాన్ని విస్మరించకూడదని చెబుతున్నారు. అదే తమ పార్టీ నేతలు అక్కడ లేకపోతే  బీజేపీ కార్యకర్తలే చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఉండేవారని విశ్లేషిస్తున్నారు.  పైగా చంద్రబాబు ఉన్న వేదిక ను,  పీఠాథిపతి శ్రీనివాసానంద స్వామి  కూడా  పంచుకోవడం ఆందోళన కలిగించే అంశమేనంటున్నారు. బాబు బృందాన్ని ఆలయ దర్శనం చేయకుండా,  దేవదాయ శాఖ అధికారులు చేసిన ఓవరాక్షన్ కూడా టీడీపీకి మైలేజీ తెచ్పిపెట్టిందని,  వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ‘ మా పార్టీ వ్యవహారశైలి వల్ల ఈరోజు టీడీపీకి ఉచితంగా పొలిటికల్ మైలేజీ వచ్చింది. ఇది ఒకరకంగా వచ్చింది అనటం కంటే, మా పార్టీనే టీడీపీకి మైలేజీ ఇచ్చిందనడం సబబు. విజయసాయి గారు నిన్న కూడా వైజాగ్‌లోనే ఉన్నారు.  కాబట్టి నిన్ననే రామతీర్థకు వెళితే సరిపోయేది. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నందుకే మా పార్టీ నేతలు, ఆయనకు పోటీగా వెళ్లారన్న భావన జనంలోకి వెళ్లింది. బాబు కార్లకు పోలీసులే లారీలు అడ్డం పెట్టారన్న వార్తలు చానెళ్లలో చూశాం. ఇది మంచి పరిణామం కాదు.  విజయసాయిరెడ్డి,చంద్రబాబులో ఒకరినే పోలీసులు అనుమతించాల్సింది. ఈ విషయంలో విజయనగరం జిల్లా పోలీసులు ఫెయిలయ్యారు. ఇద్దరు ప్రముఖులు వస్తే జరిగిన ఘటన తీఊవత దృష్ట్యా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని పోలీసులు ముందుగా అంచనా వేయకపోవడమే ఆశ్చర్యం.  సహజంగా అధికారంలో ఉండే పార్టీలు లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అపశృతి జరిగినా అది ప్రభుత్వాలకే నష్టం. అది ఎవరూ గ్రహించడం లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే, వీటిపై మాతో చర్చించే వారే లేరు. అసలు రామతీర్థ పర్యటన గురించి పార్టీలో ఎలాంటి చర్చ జరగలేద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.