బెజవాడలో భవానీ దీక్షల విరమణ మహోత్సవాల్లో ఆంక్షలు

361

ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలు బంద్‌
విజయవాడ – హైదరాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ  : భవానీ దీక్షల విరమణ మహోత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం మహోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలను పూర్తిగా బంద్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో ప్రతిరోజూ అర్ధరాత్రి 12 నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు  ఒక ప్రకటన విడుదల చేశారు.
– కుమ్మరిపాలెం సెంటర్‌, వినాయక గుడివైపు నుంచి ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలన్నీ కనకదుర్గ ఫ్లైఓవర్‌ పై నుంచే రాకపోకలు సాగించాలి.
– ఉండవల్లి వైపు నుంచి ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా వాహనాలను అనుమతించరు.
– పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడలి నుంచి, ఫ్లైఓవర్‌ మీదుగా వినాయకుడి గుడి వైపునకు వాహనాలకు అనుమతి లేదు.
– గద్ద బొమ్మ జంక్షన్‌ నుంచి వినాయకుడి గుడి వైపునకు ట్రాఫిక్‌ను అనుమతించరు.
– భవానీపురం నుంచి వచ్చే వాహనాలు కుమ్మరిపాలెం నుంచి నాలుగు స్తంభాల మీదుగా సితార వైపునకుగానీ, సొరంగం వైపునకు గానీ వెళ్లాలి.
– ఇతర జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే భవానీ భక్తులు వారధి, రాజీవ్‌ గాంధీ పార్కు, ఫ్లైఓవర్‌ మీదుగా లారీ స్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి స్వాతి సెంటర్‌, వెంకటేశ్వర ఫౌండ్రీ దగ్గర యూ టర్న్‌ తీసుకుని స్వాతి సెంటర్‌ మీదుగా పున్నమి ఘాట్‌కు చేరుకుని బస్సులను అక్కడ నిలుపుకోవాలి.

– జిల్లాల నుంచి నాలుగు చక్రాల వాహనాలపై వచ్చే భవానీ భక్తులు సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న ఫ్లైఓవర్‌కు దిగువ తమ వాహనాలను నిలుపుకోవాలి.
– పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు తమ్మలపల్లి కళాక్షేత్రం, గద్ద బొమ్మ, కాళేశ్వరరావు మార్కెట్‌, గణపతిరావు రోడ్‌, కేటీ రోడ్‌, చిట్టినగర్‌ మీదుగా సొరంగం, సీతార నుంచి విద్యాధరపురం, భవానీపురం వెళ్లాలి.