పవన్ కళ్యాణ్ చెప్పిన వారంలోపే కొడాలి నాని అసలు రంగు బయటపడింది

189

• బూతుల మంత్రి కాస్తా కోత ముక్కల కింగ్ గా మారారు
• పంపకాల్లో తేడా వల్లే మెరుపు దాడులు
• రైడింగ్ లో దొరికిన వారి వివరాలు బహిర్గతం చేయాలి
* ఖైదీ సాబ్ మంత్రివర్గంలో మూడుముక్కలాడే వాళ్ళు… కొబ్బరి చిప్పలు ఏరుకునే వాళ్ళు ఉన్నారు
• విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన మహేష్

నందివాడ మండలం తమిరశ గ్రామంలో చేపల చెరువు వద్ద పేకాట శిబిరాలపై పోలీసుల దాడి నేపథ్యంలో క్లబ్బులు మూయించానని గొప్పలు చెప్పిన బూతుల మంత్రి  కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. రూ. 30 కోట్ల డబ్బు, 60 మందికిపైగా జూదగాళ్లు, పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడిన మాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఈ రైడింగ్ తర్వాత బూతుల మంత్రి పేరు కాస్తా కోత ముక్కల కింగ్ గా మారిపోయిందని అన్నారు.  మూడు ముక్కలు ఆడుకునే వాళ్లు, గుళ్ళ ముందు కొబ్బరి చిప్పలు దోచుకునే వాళ్లు ఖైదీ సాబ్ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టే రాష్ట్ర పరిస్థితి ఇలా దిగజారిందని అన్నారు. విజయవాడలోని  జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “సరిగా వారం రోజుల కిందట జనసేన పార్టీ అధ్యక్షులు   పవన్ కళ్యాణ్ గుడివాడ నడిబొడ్డులో నిలబడి ఈ ప్రాంతంలో పేకాట క్లబులు నడుస్తున్నాయి, పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఇక్కడున్న ప్రజాప్రతినిధికి పేకాట క్లబులపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు అని మాట్లాడారు. బూతుల మంత్రి కొడాలి నాని ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. తనేదో స్వాతిముత్యం లాగా, అసలు పేకాట క్లబులే రాష్ట్రంలో ఎక్కడా నడవనట్లు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని పేకాట క్లబులు  మూయించినట్లు బిల్డప్ ఇచ్చారు.  రాష్ట్రంలో అన్ని పేకాట క్లబులు మూయించేస్తే… అమరావతిలో శ్రీదేవిగారి పంచాయితీ ఏంటి..? ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద పేకాట డెన్ బాపట్లలోని నిజాంపట్నంలో ఉంది. రోజుకు వందకోట్ల టర్నోవర్. ఎంపీ నందిగం సురేశ్, మరో ఎంపీ మోపిదేవీ వెంకటరమణ సోదరుడు శ్రీనివాసరావు కనుసన్నల్లో నడుస్తోంది. దీని సంగతి ఏంటి? పేకాట క్లబులు మూయించిన చరిత్ర మీది కాదు… వందల, వేల కోట్లలో పేకాట క్లబులను నిర్వహించిన చరిత్ర మీది.

* వివరాలు బహిరంగపరచాలి
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఏదైనా మాట్లాడారు అంటే అందులో నిజం ఉంటుంది. నిజం ఉండబట్టే ఆయన నిర్భయంగా మాట్లాడతారు. గుడివాడ పేకాట శిబిరాలపై దాడి జరిగి, కోట్ల రూపాయలు పట్టుబడింది అంటే ఆయన మాటల్లో నిజమెంతుందో మరోసారి రుజువైంది.  ఆయన మాటల్ని వాస్తవం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు.
పవన్ కళ్యాణ్ పర్యటన జరిగిన వారం రోజులలోపే కొడాలి నాని నిజ స్వరూపం బయటపడింది. ఈ బోడి లింగం ఎక్కడ తలపెట్టుకుంటారో ఇప్పుడు చూడాలి. పోలీస్ శాఖ రైడింగ్ అద్భుతంగా చేసింది. ఈ ఘటనపై డీజీపీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయాలి. అక్కడ పట్టుకున్న నగదుతో పాటు బడా బాబుల పేర్లు , కార్ల వివరాలు, మంత్రి అనుచరుల వివరాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేస్తున్నాం.  అలాగే నాని ప్రధాన అనుచరులందరూ ఈ కేసులో ఉన్నారు. కొల్లి విజయ్ అనే వ్యక్తితో పాటు యార్లగడ్డ బ్రదర్స్ నాని ఏజెంట్లుగా ఉంటూ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు.  వీరిని కేసు నుంచి తప్పించడానికే గుడివాడ పట్టణంలో అనేక అధికారిక కార్యక్రమాలను వదిలేసి తాడేపల్లి రాజప్రాసాదానికి పరిగెత్తుకుంటా వెళ్లారు.

* పంపకాల్లో తేడా వల్లే రైడింగ్
పోలీస్ రైడింగ్ జరిగిన ప్రాంతమైన చేపల చెరువుల దగ్గరకు వెళ్లడానికి ఒక్కదారే ఉంటుంది. అటువంటి దారిలో పోలీసు శాఖ వెళ్లి దాడులు చేశారంటే ప్రధాన కారణం తాడేపల్లి రాజప్రాసాదంలో ఉండే ఓ కీలక వ్యక్తికి, గుడివాడ కోతముక్క కింగ్ కి పంపకాల్లో తేడా రావడమేనని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతనికి ఇవ్వాల్సిన ముడుపులు సరిగ్గా అందించకపోవడం వల్లనే మెరుపుదాడులు చేయించారని చర్చ నడుస్తోంది.

* తాగునీరు లేదు.. నాటు సారా దొరుకుతుంది
నందివాడ మండలంలో తాగడానికి మంచినీరు దొరకడం లేదు కానీ నాటుసారా మాత్రం విచ్చలవిడిగా పారుతోంది. ఒక లీటర్ రూ. 200 అమ్ముతున్నారు. నందివాడ మండలంలో తాగునీరు ఇప్పించలేని బోడి మంత్రి సారా కాయడానికి మాత్రం పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తున్నారు. అలాగే అమ్మకాలు కూడా జరిపిస్తున్నారు.  పేకాట క్లబులు, సారా అక్రమ అమ్మకాలకు నైతిక బాధ్యత వహిస్తూ బూతుల మంత్రి రాజీనామా చేయాలి. లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే బర్తరఫ్ చేయాలి.

* సీఎం వదిలేసినా భగవంతుడు వదలడు :
ఇంకో మంత్రి… బెజవాడ జోకర్. ఆ జోకర్ మంత్రి చేసిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. వెయ్యి కోట్లు దోచుకున్న ఆ మంత్రిని ముఖ్యమంత్రి దండించకపోయినా భగవంతుడు వదిలిపెట్టడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 130కి పైగా దేవాలయాల్లో దాడులు జరిగాయి. అనేక దేవతా విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అయినా ఆ దద్దమ్మ మంత్రి నోరు మెదపడం లేదు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ పదవికి రాజీనామా చేయాలి. లేదా ముఖ్యమంత్రే ఆయన్ని బర్తరఫ్ చేయాలి. సంక్రాంతి పండక్కి పెద్దఎత్తున కోతముక్కలాట నిర్వహించాలని వైసీపీ నాయకులు చూస్తున్నారు. నందివాడ పోలీసులను స్ఫూర్తిగా తీసుకొని డీజీపీ  రాష్ట్రంలోని అక్రమ మద్యం, పేకాట శిబిరాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నామ”ని అన్నారు.