పీఠాథిపతుల మౌనంపై హిందువుల ధర్మాగ్రహం!

752

దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కదలరేం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో  శరపరంపరగా దేవాలయాలు, విగ్రహ విధ్వంసాలు జరుగుతున్నా పీఠాథిపతులు, మఠాథిపతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండటంపై,  హిందూ సంస్ధల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2109 నవంబర్ 14న గుంటూరులో,  దుర్గ గుడి ధ్వంసం నుంచి మొదలయిన ధ్వంసరచన, తాజాగా విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని సీతారామమందిరం సీతమ్మ విగ్రహ విధ్వసం వరకూ దాదాపు 125 ఘటనలు జరిగాయి. అయినా పీఠాథిపతులు వీటిపై ధర్మాగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కకపోవడంపై, భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పీఠాథిపతుల మౌనాన్ని ప్రశ్నిస్తూ సోషల్‌మీడియాలో భక్తులు, హిందూ సంస్థలు పెడుతున్న పోస్టింగులు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా పీఠాథిపతులు ఏసీ కార్లు, విమానాల్లో తిరుగుతూ లగ్జరీలకు అలవాటు పడి, ధర్మపరిరక్షణను అటకెక్కించారన్న వ్యాఖ్యలు హిందూ సంస్థల్లో వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో గత ఏడాది నుంచి శరపరంపరగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందూ సమాజంలో ఆందోళన రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో, రాముల వారి శిరస్సు ఖండించి కొలనులో వేసిన వైనం  రాజకీయ దుమారం రేపింది. వైసీపీ-టీడీపీ-బీజేపీ నేతలు శనివారం రామతీర్థానికి వెళ్లిన వైనం, ఘర్షణలకు సైతం దారితీసింది. ఆ సంఘటన జరిగిన మరుసటిరోజునే, ఆదివారం విజయవాడ బస్టాండు ప్రాంగణంలోని సీత మ్మవారి విగ్రహం విధ్వంసానికి గురికావడం, హిందూ సమాజంలో అలజడి మరింత పెరిగింది.

ఇన్ని సంఘటనలు జరుగుతూ, హిందువుల మనోభావాలు  గాయపడుతున్నా పీఠాథిపతులు ఒకే వేదికపైకి వచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంపై హిందూ సమాజం- సంస్థల ఆగ్రహానికి కారణమవుతోంది. పీఠాథిపతులు కేవలం తమ  పీఠాల ప్రయోజనాలు, పబ్లిసిటీ, పాలకుల ప్రాపకం  కోసం తప్ప ధర్మపరిరక్షకు నడుంబిగించడం లేదన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు పీఠాథిపతులు ప్రభుత్వం నుంచి భూములు, సన్మానాలు, తమ కార్యక్రమాలకు దేవదాయ శాఖ నిధులు ఆశిస్తూ.. ‘పాలకపక్ష పీఠాలు’గా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామతీర్థం ఘటనపై, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన ప్రకటన చూస్తే, పీఠాథిపతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రభుత్వాన్ని కనీసం తమలపాకుతో కూడా కొట్టలేకపోతున్నారన్న వ్యంగ్యాస్త్రాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న స్వరూపానంద వ్యాఖ్యలు, ఆయనలోని ‘సర్కారీస్వామి’ని మరోసారి బయటపెట్టిందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, స్వరూపానంద ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లి  ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో సుమారు 15 పీఠాథిపతులున్నాయి. వీరంతా దండం ఉన్న స్వాములు.  కాగా, దండం లేని పీఠాథిపతులు-మఠాథిపతులు  20 వరకూ ఉంటారు. వీటిలో శారదా పీఠం వంటి స్వయం ప్రకటిత పీఠాలే  ఎక్కువ. ఇవికాకుండా శృంగేరీ, కంచి పీఠానికి ఆలయాలు సుమారు 40 వరకూ ఉన్నాయి. అయినా ఆ రెండు పీఠాలు కూడా రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వీరందరికీ రాష్ట్రంలో టీటీడీ సహా అన్ని దేవాలయాల్లోనూ  ఆలయ మర్యాదలు, పూర్ణకుంభ స్వాగతాలు అందుతున్నాయి. వీరిలో శారదాపీఠాథిపతి స్వరూపానంద- స్వాత్మానందస్వామికి పోలీసు సెక్యూరిటీ, పైలెట్-ఎస్కార్టు కార్లు, పోలీసుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుతున్నాయి.  అయినా భువనేశ్వరీ  పీఠాథిపతి కమలానంద భారతి, శైవక్షేత్ర పీఠాథిపతి శివస్వామి, సాధుపరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద తప్ప… మిగిలిన ఒక్క పీఠాథిపతి కూడా, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

‘దేవాలయాలు, ధర్మాన్ని రక్షించకుండా ఏసీ కార్లు, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న ఈ పీఠాథిపతులు హిందువులకు అవసరమా? కాషాయం వేసుకున్న ఈ పీఠాథిపతులు దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా స్పందించి, ఎందుకు ఒకే వేదికపై వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? మతం, ధర్మ పరిరక్షణ కోసమే కదా వీరి పీఠాలకు భక్తులు కోట్లాది రూపాయల విరాళాలిస్తోంది? మరి దేవుడి వల్ల ఇంత లబ్ధి పొందుతున్న ఈ పీఠాథిపతులు, దేవుడిపైనే దాడులు జరుగుతున్నా మౌనంగా ఉన్నందున ఇక వారికి ఆ పీఠాలెందుకు? రాష్ట్రంలో ఇలాంటి నిరర్ధక పీఠాలున్నందుకు హిందువులుగా అంతా సిగ్గుపడాలి’ అని,  అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాథ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏపీ-తెలంగాణ పాలకులకు సన్నిహితంగా ఉండే చినజీయర్‌స్వామి, స్వరూపానంద స్వామి ఇప్పటిదాకా దాడులకు గురయిన ఒక్క ఆలయాన్ని కూడా సందర్శించకపోవడంపైనా,  హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘జీయరు, స్వరూపా స్వాములిద్దరూ ఇప్పటిదాకా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించనప్పుడు ఇక వారికి పీఠాల అవసరం ఏమిటి? ఏ ప్రభుత్వంలో ధర్మంపై దాడి జరిగినా వారు స్పందించి,  మిగిలిన పీఠాలను మార్గదర్శనం చేయాలి కదా? రాష్ట్రంలో నడుస్తున్న హిందూ వ్యతిరేక శక్తులకు పీఠాలే భయపడితే ఎలా? ఇప్పటివరకూ రాష్ట్రంలోని పీఠాథిపతులంతా ఒకేవేదికపైకి వచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న ఆలోచన లేకపోవడం హిందువుల దురదృష్టం. పీఠాథిపతులంతా ఒక వేదికపైకి వస్తే, ప్రభుత్వం దిగి వచ్చి నిందితులపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మతమార్పిళ్లు, దేవాలయాలపై దాడులు నిరోధించకపోతే,  క శ్మీర్ మాదిరిగానే ఏపీలో కూడా హిందువులు మైనారిటీలుగా మిగిలిపోవడం ఖాయమ’ని సింహపురి ధార్మిక సంస్థ  వ్యవస్థాపకులు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.