అంతర్వేది నుంచి..అంతులేని కథ!

365

విగ్రహ విధ్వంసకులెవరు?
తిరుపతి ఉప ఎన్నికకు లింకుందా?
అనుమానం- అడకతె్తరలో టీడీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

గత 18 నెలల కాలంలో ఏపీలోని వివిధ ఆలయాల్లో దేవతా విగ్రహాలు విధ్వంసానికి గురవుతున్నాయి. కొన్ని అగ్నికి ఆహుతవుతుంటే, మరికొన్ని చోట్ల శిరచ్ఛేదనాలు జరుగుతున్నాయి. కేసుల హడావిడి, విచారణ, ఆందోళనలు తప్ప.. ఇప్పటిదాకా విగ్రహ విధ్వంసకులెవరో తెలియడం లేదు.  ఇన్ని అరాచకాలు జరుగుతున్నా,  మరికొన్ని ఘటనలు నిర్నిరోధంగా సాగుతున్నాయంటే.. వాటి వెనుక ఉన్నది రాజకీయ శక్తులా? మతోన్మాదులా? లేక పోలీసులు చెబుతున్నట్లు పిచ్చివాళ్లా? అసలు అంతులేని కథకు అంతమెప్పుడు? తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వరకూ ఈ ఉద్రిక్తత తప్పదా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏపీలో విజయవంతంగా జరుగుతున్న దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు, రథాల కాల్చివేత వంటి కార్యక్రమాల జాబితాలో.. తాజాగా మరో రెండు ఘటనలు చేరడం  కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథాల దహనం నుంచి మొదలయిన ఈ అరాచకం, తాజాగా అదే జిల్లా రాజమండ్రి శ్రీరాంనగర్‌లో విఘ్నేశ్వరాలయంలోని,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో విగ్రహానికి ఉన్న రెండు చేతులను ధ్వంసం చేసే వరకూ కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతకు రెండురోజుల ముందే.. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామ  విగ్రహ శిరస్సు కూల్చి,  దానిని కొలనులో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది.

కొన్ని నెలల నుంచి ఇలాంటి ఘటనలు నిర్నిరోధంగా జరుగుతున్నా, ఇప్పటివరకూ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడంపై, సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలు ఏదైనా ‘దూరదృష్టి’తో రాజకీయ పార్టీ మేలు కోసం జరుగుతున్నవా? ఒక రాజకీయ పార్టీ సమాధి చేసి, ఆ స్థానంలో మరొక పార్టీని ప్రతిష్టింప చేసే రాజకీయ వ్యూహమా? లేక మతోన్మాదుల దుశ్చర్యలా? అన్న చర్చకు తెరలేచింది. అంతర్వేది రథం దహనానికి ముందు జరిగిన ఘటనలన్నీ ‘మతిలేని వారి జాబితా’లో చేర్చి విమర్శల పాలయిన పోలీసులు, ఆ తర్వాత జరుగుతున్న ఘటనలపై అసలు నిందితులనే పట్టుకోవడంలో విఫలమవడం చూస్తే.. ఈ ఘటనల వెనుక,  అదృశ్య శక్తులు కచ్చితంగా ఉన్నాయన్న బలమైన అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. కాకపోతే ఆ అదృశ్య హస్తాలు రాజకీయ ప్రేరేపితమైనవా? లేక ‘విస్తరణ’లో  భాగంగా జరుగుతున్న అన్యమత శ క్తులవా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన  చర్చ జరుగుతోంది.

దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌లో లోతైన చర్చ జరుగుతోంది. కొద్ది నెలల నుంచి జరుగుతున్న మతపరమైన ఘటనలను సంఘ్ పెద్దలు విశ్లేషిస్తున్నారు. ఆ ప్రకారం.. ఈ పరిణామాలలో రాజకీయపార్టీల పాత్ర-ప్రమేయం ఉండకపోవచ్చని సంఘ్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలను అనుమానించలేమని, అయితే తమకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాస్టర్ల  ప్రోత్సాహంతోనే ఈ సంఘటనలు పాల్పడుతున్నట్లు కనిపిస్తోందన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

‘ఇందులో ఏ పార్టీకీ ప్రమేయం ఉంటుందని అనుకోవడం లేదు. తమ ప్రభుత్వం ఉందన్న ధీమాతో కొందరు పాస్టర్లే వీటిని ప్రోత్సహిస్తున్నట్లు మేం అనుమానిస్తున్నాం. గుళ్లను కూల్చమని, విగ్రహాలు పగులకొట్టాలని ప్రభుత్వం ఎందుకు చెబుతుంది? అలా చెబితే అది ప్రభుత్వానికే నష్టం కదా? శాంతిభద్రతలకు విఘాతం కలగాలని ఏ ప్రభుత్వం మాత్రం కోరుకుంటుంది? అయితే పాస్టర్ల ప్రోద్బలంతో జరుగుతున్న ఈ ఘటనలు నివారించడం, నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం భయపడుతోంది. వారిపై చర్యలు తీసుకుంటే ఓటు బ్యాంకు ఎక్కడ నష్టపోతుందన్న భయమే, ప్రభుత్వ మౌనానికి కారణంగా కనిపిస్తోంద’ని ఆరెస్సెస్ ప్రముఖుడొకరు విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,  రామతీర్థ పర్యటనతో అందరి దృష్టి అటు మళ్లింది. అంతర్వేది వంటి ప్రధాన ఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబు అక్కడికి వెళ్లలేదు. తన పార్టీ బృందాన్ని పంపించారు. కానీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ముందు.. రాష్ట్రంలో జరుగుతున్న మతపరమైన దాడుల నేపథ్యంలో, బాబు పర్యటనకు కచ్చితంగా ప్రాధాన్యం ఏర్పడింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముందు,  వరస వరస వెంట వ్యూహాత్మకంగా  జరుగుతున్న మతపరమైన దాడులు, సంఘటనలను రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే రంగంలోకి దిగింది.

దేవాలయాలపై దాడులు జరిగిన కొద్ది గంటల వ్యవథిలోనే,  కమల దళాలు అక్కడ వాయువేగంతో వెళ్లి మోహరిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలతో..  రాజకీయ రంగస్థలంలో వైసీపీ-బీజేపీ మాత్రమే మిగిలే అవకాశాలున్నాయన్నది టీడీపీ నేతల ఆందోళన.  ఉప ఎన్నిక నాటికి రాష్ట్రంలో మరిన్ని ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరిగినా జరగవచ్చని, వాటిని  రాజకీయంగా బీజేపీ సొమ్ము చేసుకుంటే, తన పరిస్థితి ఏమిటన్న ఆందోళన టీడీపీలో ఇప్పటికే మొదలయింది. ఒక రకంగా తెలంగాణలో మాదిరిగా.. ఏపీలో కూడా బీజేపీ ‘మతమేఘాల’ను బలవంతంగా  తీసుకురావడం ద్వారా, రాజకీయ లబ్థి పొందాలని చూస్తోందన్నది టీడీపీ అసలు అనుమానం.

ఈ క్రమంలోనే చంద్రబాబు తన సహజ లౌకిక మొహమాటాలు పక్కకుపెట్టి, రామతీర్థకు వెళ్లారంటే.. రాష్ట్రంలో హిందుత్వ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, టీడీపీని ఏ స్థాయిలో ఆందోళనకు గురిచేస్తున్నాయో స్పష్టం చేస్తోంది. దేవాలయాలు, విగ్రహాల విధ్వంసంపై బీజేపీ నేతలు, వైసీపీ సర్కారుపై దునుమాడుతున్నా వైసీపీ  సర్కారు-పార్టీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంపై, టీడీపీ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వైసీపీ మైనారిటీ-రెడ్డి, బీజేపీ హిందూ ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటే, ఇక రాజకీయంగా తన పరిస్థితి ఏమిటన్న చర్చ ఇప్పటికే టీడీపీలో మొదలయింది. సున్నితమయిన ఈ అంశంపై..  ఎలాంటి వైఖరి అనుసరించాలో ఈనెల 4,5 వ తేదీల్లో జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఖరారు చేయనున్నట్లు సమాచారం.

‘ఇదంతా పొలిటికల్  గేమ్‌ప్లాన్‌గానే మాకు అర్ధమవుతోంది. రాష్ట్రంలో బీజేపీని మా స్థానంలోకి తీసుకువచ్చేందుకు,  వైసీపీ ప్రోత్సాహంతో జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తున్నాం. కర్నూలులో డిసెంబర్ 11న పొన్నకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించిన  దామోదర్‌రెడ్డి వైసీపీ కార్యకర్త అని పోలీసులే ప్రకటించటం బట్టి ఏం జరుగుతుందోః ఏం జరగబోతోందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో  భవిష్యత్తులో వైసీపీ.. మైనారిటీ, రెడ్డి కార్డు, బీజేపీ హిందూ కార్డు వాడితే, మా పార్టీ విధానం ఎలా ఉండాలన్న దానిపై పార్టీలో చర్చిస్తాం.అంతర్వేది దోషుల అరెస్టుల ఆలస్యంపైనా చర్చిస్తాం. ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడికి ముందు వెళ్లింది మా పార్టీ నేతలే.  వైసీపీ-బీజేపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయిస్తామ’ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వెల్లడించారు.