అందుకే 2020ని మనం గౌరవించాలి

అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన జీవితంలో గత ఏడాది ఎంతో ఉత్తమమైంది. మనకు చాలా నేర్పింది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైంది. రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసింది. పోషకాహారం విలువ తెలిసింది. పరిశుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు చేతులు కడుక్కోలేదు. పల్లెటూళ్లలో పుట్టిన వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, శానిటైజర్, క్వారైంటన్, యాంటీబాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి.
మొదట్లో నెలరోజులు లాక్డౌన్ అంటే మనకు పిచ్చిపట్టినట్లయింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరమని తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది. ఎనిమిది నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా.. ఎలా బతికామో మనకే తెలియదు. నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలిసింది. జీవితంలో పొదుపు ఎంత అవసరమో తెలిసొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. అనవసరమైన షాపింగ్లు, చిరుతిళ్లు తగ్గాయి. ప్రకృతి చాలా శక్తిమంతమైనదని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా చిన్న సహాయం చేస్తే దాని విలువ మనకు అర్థమైంది
రెండు నిమిషాలు ఊపిరి ఆగితే చాలు ప్రాణాలు పోతాయి.. చావనేది పెద్ద విషయం కాదు’ అనేది తెలిసి వచ్చింది. అనుక్షణం ఒళ్లు దగ్గరపెట్టుకొని బతికాం. జలుబు, జ్వరం కూడా మనం భరించలేని పరిస్థితి వచ్చింది. పసుపు, వెల్లుల్లి, తేనె, కషాయం, ఆవిరిపట్టడం వంటివి మంచివని తెలిసింది. ఆయుర్వేద విలువ తెలిసింది. 2020 మహమ్మారి సంవత్సరం కాదు.. ఇది మేల్కొలుపు సంవత్సరం. అందుకే 2020ని మనం గౌరవించాలి. గత ఏడాది మనకు గురువు. ఏడాది పాటు ప్రపంచాన్ని స్తంభింపజేసి మనందరికీ పాఠం చెప్పింది. ఉత్పాదకత నాశనమైపోయింది. ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. పోతేపోనీ.. బతికున్నాం చాలురా దేవుడా అనే పరిస్థితిలో పెట్టింది. ఇక 2021 ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇంకా ఎన్ని వైరస్లు వస్తాయో తెలియదు. కానీ, 2020 అనుభవం తర్వాత మనం చాలా పరిపక్వత సాధించాం. మనలో ఏదో తెలియని విశ్వాసం వచ్చింది’’.అందుకే జీవితంలో ప్రతి రోజునూ పండగలా జరుపుకోవడం నేర్చుకోండి. గతం మనది కాదు.. భవిష్యత్తు మనది కాదు.. ఈ రోజును మనం ఆస్వాదించామా.. లేదా..!
సెలబ్రేషన్ అంటే ఏంటి? పని చేయడం, నవ్వడం, ప్రేమించడం, పాడటం, డ్యాన్స్ చేయడం. అందరూ జీవితాన్ని సెలబ్రేట్ చేసే పనిలో ఉంటే ప్రపంచంలో సగం దరిద్రాలు తగ్గుతాయి. గొడవలుండవు.. యుద్ధాలుండవు. ప్రతి రోజు మనం చేయాల్సినవి ఉదయం లేవగానే.. హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామా లేదా..? మన మూత్రం రంగు మారిందా లేదా..? ఈ రెండూ బాగుంటే ఆ రోజు మనం బాగున్నట్లే. రోజూ పని చేసుకుందాం. ఇక నుంచి రెట్టింపు శ్రమిద్దాం. మంచి ఆహారం తిందాం. అరగంటైనా వ్యాయామం చేద్దాం. లేదా కనీసం పది గుంజీలు.. కాసేపు గోడకుర్చీ వేద్దాం. విద్యుత్, నీళ్లు, ఆహారం వృథా చేయొద్దు. జంతువుల్లా రోజంతా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుందాం. మొక్కలు, ఆకులు, చెట్లను పలకరిద్దాం. స్నేహితులతో కలిసి కాసేపు నవ్వుకుందాం. బతికిన ప్రతిరోజూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ పోవడమే.. ప్రతిరోజునూ పండగ చేసుకుంటూ ఆస్వాదిద్దాం. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. బోలెడంత సంతోషాన్నివ్వాలి.
– రాజా చీమకుర్తి
కార్యదర్శి, సంస్కృత విభాగ్ విశ్వ హిందూ పరిషత్
నరసరావుపేట, గుంటూరు జిల్లా