హ్హ.. హ్హ… జర్నలిస్టులు ప్రభుత్వాలను మారుస్తారట..

185

అమ్మో… జగన్ సర్కారు భయపడుతోంది!
పేర్ని నాని, విజయకుమార్‌రెడ్డి  ఇక జిల్లాలకు వెళ్లరేమో
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘సమాచార శాఖ మంత్రి, సమాచార శాఖ కమిషనర్లకు దమ్ముంటే జిల్లాల్లో తిరిగితే మా సత్తా ఏమిటో చూపిస్తాం. జర్నలిస్టుల పరిశోధనాత్మక శక్తి ఏమిటో చూపిస్తాం. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వెలికితీస్తాం. మేం తలచుకుంటే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బందరు ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు. మంత్రి పదవి పోతుంది. జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలబడలేవు. జర్నలిస్టుల సత్తా ఏమిటో ప్రభుత్వానికి త్వరలోనే చూపిస్తాం’- ఇదీ ఏపిడబ్ల్యుజె నాయకుడు,  జగన్ సర్కారుకు చేసిన తాజా హెచ్చరిక.

అంటే.. ఇకపై మంత్రి పేర్ని నాని, సమాచార శాఖ కమిషనర్ విజయకుమర్‌రెడ్డి జిల్లాల్లో తిరగాలంటే,  ప్రత్యేక బలగాలు కావలసిందే. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పేర్ని నానిని,  ఆ పదవి నుంచి తప్పించే శక్తి ఉన్న జర్నలిస్టు సంఘం, ఆ తర్వాత ఆయనను కనీసం ఎమ్మెల్యేగానయినా కొనసాగించేందుకు అనుమతించినందుకు, పేర్ని వారు జగన్ తర్వాత.. జర్నలిస్టు సంఘానికి సైతం  జీవితాంతం కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎటొచ్చీ ఈ విషయంపై సీఎం జగన్ ఏమంటారో చూడాలి మరి! ఇది కూడా చదవండి..ఆడు.. మగాడ్రా బుజ్జీ’!

జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు  ఇవ్వకుండా.. అడ్డగోలు నిబంధనలతో అవమానిస్తున్న సర్కారుకు, తమ తడాఖా ఏమిటో చూపిస్తామన్న జర్నలిస్టు సంఘం హెచ్చరికతో, జగన్ సర్కారు తెగ భయపడుతోందట. అవును.. ఇది జోక్ కాదు. నిజం!

కొత్త ఏడాదిలో జర్నలిస్టులందరికీ ఎప్పటిమాదిరిగానే అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, కొత్త నిబంధనలతో వేధిస్తోందన్నది జర్నలిస్టు సంఘాల ఆగ్రహం. నిజమే. అర్హులయిన జర్నలిస్టులకు కార్డులివ్వాలన్న, జర్నలిస్టు సంఘాల డిమాండులో తప్పేమీ లేదు. ప్రభుత్వం అన్ని వర్గాలకూ వందలు, వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు వర్తింపచేస్తోంది.  అలాంటప్పుడు, ప్రభుత్వం-ప్రజలకు వారథిగా ఉన్న పాత్రికేయులకు కార్డులిచ్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. పైగా సర్కారు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుతో, జర్నలిస్టులు రోజూ ఉచితంగా బస్సు ప్రయాణాలేమీ చేయరు. ఒకవేళ చేసినా సర్కారుపై పడే ఆర్ధిక భారం కూడా పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే… సంక్షేమ పథకాలకు కార్డులు ముడిపెట్టినందువల్ల, అవి మంజూరు చేయకపోతే పథకాలు తమకు వర్తించవన్నది,  కిందిస్థాయిలో జీతం బతె్తం లేకుండా పనిచేసే స్ట్రింగర్ల అసలు ఆవేదన.

దానికోసం బియ్యం కార్డుల మాదిరిగా ఒక ప్రత్యేక పథకం ప్రవేశపెడితే, ఈ అక్రెడిటేషన్ల పంచాయితీనే ఉండదన్నది సీనియర్ జర్నలిస్టు సంఘ నేతల సలహా. నిజానికి గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులకు జీతాలుండవు. ఈనాడు, సాక్షి, ఆంధజ్యోతి వంటి పెద్ద పత్రికలు మాత్రమే లైన్ అకౌంట్లు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్లకు క్రమం తప్పకుండా జీతాలు  ఇస్తున్నాయి. పెద్ద చానెళ్లు, ఇంగ్లీషు పత్రికలకు ఈ తిప్పలు లేవు.

మిగిలిన మెజారిటీ చిన్న-మధ్య తరహా పత్రికలకు.. ఆయా స్థానిక విలేకరులే డబ్బులు ఎదురిచ్చి, ఉద్యోగం చేసుకునే దౌర్భాగ్యం తెలుగు రాష్ట్రాల్లో తాండవిస్తోంది. ప్రకటనలు వేసుకుని జీతాలు తీసుకునే దిక్కుమాలిన సంస్కృతి కొనసాగుతోంది. కొన్ని మధ్య, చిన్న తరహా పత్రికలు- చానెళ్ల యాజమాన్యాలు, ఫ్రాంచైజీల పేరిట వేలం పాట పెడుతున్నాయి. అందులో ఎవరు ఎక్కువ  డబ్బులిస్తే వారికే జిల్లా స్టాఫర్/బ్యూరో హోదాలు అమ్మేస్తున్నాయి. ఈ వేలం పాటలో పాల్గొనే వాడు జర్నలిస్టే కానవసరం లేదు. క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించే మొనగాడయితే చాలు. వారిపై ఎలాంటి కేసులున్నా, వారు రౌడీషీటర్లయినా యాజమాన్యాలకు సంబంధం లేదు. కావలసింది కాసులే.  సకాలంలో డబ్బు చెల్లించకపోతే, డబ్బు చెల్లించే మరో మొనగాడికి ఆ హక్కులు రాసిచ్చేస్తున్నాయి.

తాజాగా ‘ నేటి దినపత్రిక సూర్య’ పత్రికకు.. గుంటూరు జిల్లా ఫ్రాంచైజరుగా పనిచేస్తున్న ఆదినారాయణ అనే జర్నలిస్టును, ఆ యాజమాన్యం తొలగించిందట. అప్పటికే తవ వద్ద కట్టించుకున్న లక్షలాది రూపాయలను తిరిగి చెల్లించకపోతే, మీ బండారం బయటపెడతానంటూ సదరు జర్నలిస్టు విడుదల చేసిన ఓ ఆడియో, ఇప్పటికే జర్నలిస్టుల గ్రూపులలో వైరల్ అవుతోంది. తాను కరోనా కాలంలో కూడా కష్టపడి డబ్బు కడితే, పేపరు ఇవ్వడం లేదని, తాను స్ట్రింగర్ల నుంచి వసూలుచేసి మీకు ఇచ్చిన డబ్బులు, వెంటనే వాపసు ఇచ్చేయాలంటూ సదరు జర్నలిస్టు ఓ ఘాటు హెచ్చరిక సందేశం పంపాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆ జర్నలిస్టు.. సమాచార శాఖ మంత్రి, కమిషనర్, డీపీఆర్‌ఓకు ఫిర్యాదు చేశాడు. అసలు జీఎస్టీ-ఆదాయపన్ను కట్టకుండా, భూసేకరణ బిల్లులను వేరే అకౌంట్లకు తరలిస్తున్నారంటూ ఏకంగా.. ఆ పత్రిక యాజమాన్యంపై ఆదాయపన్ను, జీఎస్టీకి ఫిర్యాదు చేశారట.

ఈ ఫిర్యాదు ఒక ఉదాహరణ మాత్రమే.  ఇలాంటి ఫ్రాంచైజీ నియామకాల విధానాన్ని,   దాదాపు అన్ని చిన్న-మధ్య తరహా యాజమాన్యాలు విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. పత్రికలు సంక్షోభంలో ఉన్నందున, ఈ విధానంలో  తప్పులేదనుకున్నప్పటికీ.. ఎవరు ఎక్కువ తూకం పెడితే, ఉన్నవారిని తొలగించి కొత్త వారికి కిరీటాలు తగిలించడంపైనే జర్నలిస్టుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందులో మధ్యవర్తులుగా ఉంటూ, నష్టపోతున్నది కూడా జర్నలిస్టులే కావడం మరో దారుణం. ఎందుకంటే, ఈ వ్యవహారాల్లో యాజమాన్యాలు నేరుగా రావు. ఈ విధానంపై జర్నలిస్టు సంఘాలేవీ ప్రభుత్వానికి గానీ, సమాచార శాఖకు గానీ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే…జిల్లా జర్నలిస్టు నేతలుగా ఉన్న వారంతా ఆ తరహా పత్రికల్లో పనిచేసే వారే కావడం దానికి కారణం.  ఇది కూడా చదవండి..‘ జర్నలిస్టు నేతలూ.. సిగ్గుపడండి’!

ఇప్పుడు అక్రెడిటేషన్లపై రగడ చేస్తుంది కూడా ఈ బాపతు  ఫ్రాంచైజీలు తీసుకున్నవారే. ఎందుకంటే అక్రెడిటేషన్లు ఉంటేనే, స్ట్రింగర్లు ఫ్రాంచైజర్లకు డబ్బులు కడతారు. అవి లేకపోతే ఎవరూ ముందుకురారు. డబ్బులిచ్చే స్ట్రింగర్లు రాకపోతే, జిల్లా ఫ్రాంచైజర్ల బండి అసలు నడవదు. స్ట్రింగర్లు ఇచ్చే డబ్బులతోనే న్యూస్‌ప్రింటు, యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుంది.  జీఎస్టీ చెల్లింపు నిబంధన పెట్డడం వల్ల, ఈ బాపతు సంస్థల పప్పులు ఉడకని పరిస్థితి. మరి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి,  ఇతర ఇంగ్లీషు పత్రికలు, చానెళ్లకు అక్రెడిటేషన్లు ఎలా ఇస్తున్నారంటే.. అవి జీఎస్టీ బిల్లులు దాఖలు చేశాయి కాబట్టి!   నిజంగా  ప్రింటింగ్ చేసే సంస్థలు జీఎస్టీ చెల్లిస్తాయి. మరి ఆ బిల్లుల రశీదు దాఖలు చేసేందుకు ఇంత రచ్చ ఎందుకన్నది అధికారుల ప్రశ్న. అదీకాకుండా, కరోనా తర్వాత చాలా పత్రికలు పిడిఎఫ్‌కే పరిమితమయ్యాయి. ఇప్పుడు సమస్యల్లా.. రోజువారీ ప్రింటు చేయని పత్రికలకే.

పోనీ.. ప్రభుత్వమే పత్రికలు-వాటి స్థాయి నిర్ణయించి, జీఎస్టీ సౌకర్యం లేని పత్రికలకు ఏదో ఒక ప్రాతిపదిక కొన్ని కార్డులిస్తే మంచిదన్నది సీనియర్ జర్నలిస్టుల సలహా. పోనీ అదీ కాకపోతే.. బియ్యం కార్డుల మాదిరిగా, జర్నలిస్టు హెల్త్ కార్డుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులిస్తే ఇక సమస్యలే ఉండవన్నది సీనియర్ల మరో సలహా. ఇప్పటికే ఎలాగూ గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లోని మెజారిటీ విలేకరులకు తెల్లకార్డులున్నందున, హెల్త్‌కార్డులిస్తే వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. దీనిపై సమాచార శాఖ సీనియర్ జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటుచేసి, సమస్య మూలాలు చర్చించి పరిష్కరిస్తే మంచిది.

ఇక జర్నలిస్టులు తలచుకుంటే ప్రభుత్వాలే మారతాయన్న  హెచ్చరికలు, మంత్రి పదవులు పోతాయన్న సంఘాల నేతల కళ్లెర్ర చూస్తే… జర్నలిస్టు నేతలు ఇంకా పాపం సతె్తకాలపు రోజుల్లోనే బతుకుతున్నారనిపిస్తోంది. ఒక రకంగా జర్నలిస్టు నేత చెప్పింది నిజమే. కానీ అవి ఇప్పటిరోజుల్లో కావు. నైతిక విలువలు కొద్దిగయినా పాటించిన అప్పటి  కాంగ్రెస్ రోజుల్లో!  ఆ జమానా మారి, పార్టీలే  మీడియా సంస్థలు పెట్టుకుని ఎవరినీ లెక్కచేయని ఈరోజుల్లో.. యాజమాన్య స్వేచ్ఛ తప్ప, పత్రికాస్వేచ్ఛ లేని ఈకాలంలో కూడా,  తాము తలచుకుంటే ప్రభుత్వాలు మారతాయన్న.. భ్రమల ప్రపంచం నుంచి జర్నలిస్టు నేతలు, ఎంత త్వరగా  బయటకు వస్తే అంత మంచిది. పైగా.. ఏపీ సీఎం జగన్‌కూ ఓ పత్రిక-ఛానెల్ ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా? జర్నలిస్టులు ఉద్యమిస్తున్నారు కాబట్టి ఫలానా పేర్ని నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తే, నానిని తీసేయడానికి… సీఎంగా ఉన్న చంద్రబాబు కాదు. జగన్మోహన్‌రెడ్డి అని గుర్తించకపోతే ఎలా? ఏడాది నుంచీ అలుపు లేకుండా ఉద్యమిస్తున్న అమరావతి ఆందోళననే ఖాతరు చేయని జగన్, జర్నలిస్టు సంఘాల హెచ్చరికలకు భయపడతారనుకోవడం జోక్‌గా లేదూ?!

దివంగత నేత వైఎస్ పాదయాత్ర తర్వాత జరిగిన ఎన్నికల్లో.. ఒక్క ‘వార్త’ దినపత్రిక మినహా, మిగిలిన పత్రికలన్నీ నాటి టీడీపీ సర్కారు వైపే మొగ్గాయి. ఇప్పుడు టీడీపీకి బద్ధ శత్రువుగా ఉంటూ, బీజేపీ  రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న..  నాటి సెఫాలజిస్టు  ఢిల్లీ నుంచి వచ్చి, రానున్న ఎన్నికల్లో టీడీపీనే గెలుస్తుందన్న సర్వే జోస్యం చెప్పారు. కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మీడియా సంస్థలు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే రాశాయి. కానీ అది అధికారంలోకి వచ్చింది.

అంతకుముందు,  మహాకూటమిలో పోటీ చేసిన టీడీపీ-టీఆర్‌ఎస్ గెలుస్తాయని జోస్యం చెప్పాయి. కానీ లెక్క తప్పి మళ్లీ కాంగ్రెసే గెలిచింది. విభజన తర్వాత ఏపీలో వైసీపీ గెలుస్తుందని సాక్షి, టీడీపీ గెలుస్తుందని మిగిలిన పత్రికలు జోస్యం చెప్పగా సాక్షి’ జోస్యం ఫలించలేదు. మళ్లీ జరిగిన ఎన్నికల్లో టీడీపీనే గెలుస్తుందని మెజారిటీ మీడియా సంస్థలు రాయగా, ఆ జోస్యం బోల్తాపడి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అన్ని మీడియా సంస్ధలూ టీఆర్‌ఎస్‌కే జైకొట్టినా, కారు స్పీడు సగంలోనే ఆగిపోయింది. ఇన్ని ఉదాహరణలు కళ్లెదుట కనిపిస్తున్నా.. ఇంకా  జర్నలిస్టులు తలచుకుంటే.. పార్టీ లేదా ప్రభుత్వాలు మారుతాయని  జర్నలిస్టు నేతలు అనుకుంటే,  వారి అమాయకత్వాన్ని ఏమీ అనలేం. పైగా ఇప్పుడు పాత్రికేయ స్వేచ్ఛ కంటే యాజమాన్యస్వేచ్ఛ ఉన్నందున, జర్నలిస్టుల ఆవేశానికి పెద్దగా ఫలితం ఉండదేమో? ఈ సందర్భంగా వైఎస్ తొలిసారి సీఎం అయి తర్వాత చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయాలి. ‘మేం ఈటీవీలు, మహాటీవీలను నమ్ముకుంటే అధికారంలోకి వచ్చేవాళ్లమే కాద’ని జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ  చురక వేశారు.