చంద్రబాబుకు చెంపదెబ్బలాంటి తీర్పు ఇచ్చిన హైకోర్టు

687

నా పరిజ్ఞానం సహకరించినంతవరకు,  పురాణకాలం లోని మహర్షులు, వేదమూర్తులు  సర్వసంగపరిత్యాగులు, మతప్రభోధకులు, గురువులు, పెద్దలు చెప్పినంతవరకు భగవంతుడు నిరాకారుడు, దయామయుడు, సర్వాంతర్యామి.  పేర్లు వివిధరకాలుగా ఉండొచ్చు కానీ, భగవత్స్వరూపం మాత్రం ఒకటే.  ఆయనకు కులమతభేదాలు లేవు.  నమ్మినవారికి కైవల్యం ప్రసాదిస్తాడు.  నమ్మనివారికి అపకారం చెయ్యడు.  అలాంటి దేవదేవుడిని దర్శించుకోవడానికి మనిషిగా జన్మించినవారు ఎవరైనా అర్హులే.  “అడుగడుగున గుడి ఉంది…అందరిలో గుడి ఉంది” అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి.  ప్రతి ప్రాణి హృదయంలో నలుసు రూపంలో భగవంతుడు ఉంటాడని వైదికవేత్తలు బోధిస్తుంటారు. జ్ఞాననేత్రాలు కలిగినవారికి ఎక్కడ చూసినా భగవంతుడు దర్శనమిస్తాడు. అణువణువులో ఆదిమధ్యాంతరహితుడు సాక్షాత్కరిస్తాడు. దేవాలయంలోకి వెళ్ళడానికి “నీకు అర్హత లేదు” అని ఒకరిని అడ్డుకోవడం అంటే అది నరకానికి వెళ్ళడానికి దగ్గర దారి అని చెప్పాలి.

జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత.  ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా అగ్రాసనం మీద కూర్చున్నారు.  ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆలయానికి, చర్చికి, మసీదుకు, గురుద్వారాకు..ఇలా ఏ ఆధ్యాత్మిక కేంద్రానికైనా వెళ్ళడానికి అధికారిక ఆమోదం ఉన్నది.  ఒక ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం వారు ఆయన్ను ముఖ్యమంత్రి హోదాలో తమ ఆలయాన్ని దర్శించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించామని కోరారు.  వారి కోరికను ఆయన తిరస్కరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ మతం వారిని అవమానించినట్లు భావించాలి.  కానీ ఆయన స్వామివారి ఆదేశాన్ని శిరస్సున దాల్చి, సంప్రదాయమైన పట్టువస్త్రాలు ధరించి, పాదరక్షలను విసర్జించి, నుదుట పవిత్రమైన కుంకుమ తిలకాన్ని ధరించి ముకుళితహస్తుడై ఆలయ ప్రవేశం  గావించి స్వామివారి పట్ల తన భక్తిప్రపత్తులు చాటుకున్నారు.  అలాంటి వ్యక్తిని ప్రశంసించకుండా, ఆయన ఆలయప్రవేశం ఏదో దేశద్రోహం అయినట్లు గావుకేకలు పెట్టడం, దానిమీద న్యాయస్థానాలకు ఎక్కడం అత్యంత అనాగరికం.

చంద్రబాబుకు అధికారం లేదు కానీ, లేకపోతేనా, ఆంధ్రదేశాన్ని పాలించడానికి తన సామాజికవర్గం వారు తప్ప మరే మతస్తులు, కులస్తులు అనర్హులు అంటూ ఒక చట్టాన్ని చేసేవారే.  జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేని అసమర్ధతతో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదంటూ నానా యాగీ చేసి కోర్టులో కేసులు వెయ్యడం చూస్తుంటే అసలు చంద్రబాబును మనిషిగా పుట్టించిన భగవంతుడిపై ఆగ్రహం కలుగుతుంది.  ఇలాంటి వారి ఆటలు కట్టిస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పుదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది.  జస్టిస్ కట్టూ దేవానంద్ తన తీర్పులో “వ్యక్తిగత హోదాలో వెళ్లిన హిందూయేతరులే డిక్లరేషన్ ఇవ్వాలి.

సీఎం హోదాలో, దేవస్థానం వారి ఆహ్వానంపై వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.  అంతే కాదు…గురుద్వారాకు వెళ్తే సిక్కు అవరు.  చర్చికి వెళ్తే క్రిస్టియన్ అవరు..సీఎం గా ఎవరున్నా బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతుంది”  అంటూ ఆదేశాలు ఇవ్వడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన బానిస మీడియాకు చెప్పుదెబ్బలాంటిది.  వారికి బుద్ధిజ్ఞానం అనేవి ఉంటే మళ్ళీ దానిగురించి మాట్లాడరు.  నలభై ఏళ్ల ఇండస్ట్రీ అనే డప్పు కొట్టుకుంటూ స్వకుచమర్ధనంలో మునిగితేలే  చంద్రబాబుకు ఇది తలదించుకోవాల్సిన పరిస్థితి. 70  ఏళ్ల వయసులో ఇలా కోర్టుతో చెప్పించుకుంటున్న చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ మసీదులకు పోలేదా?  దాంతో ఆయన ముస్లిం అయిపోయాడా?  ఆయనెప్పుడూ చర్చికి వెళ్లలేదా?  బైబిల్ గ్రంధాన్ని చేతుల్లో పెట్టుకోలేదా?  అంతమాత్రాన ఆయన క్రైస్తవుడై పోయాడా?  ఆయన చర్చికి వెళ్తే లేని తప్పు జగన్ దేవాలయానికి వెళ్తే తప్పు అవుతుందా?  పూజలు, యాగాలు కూడా బూట్లు విప్పకుండా చేసే చంద్రబాబు ఆలయమర్యాదలను, సంప్రదాయాలను పాటించే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది.

సత్తా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.  అంతేతప్ప ఇలా మతాలను, కులాలను కూడా రాజకీయాల్లోకి లాగి లబ్ది పొందాలని చూసే చంద్రబాబు లాంటి స్వార్ధపరులను సమాజం నుంచి బహిష్కరించాలి.  అపుడే దేవాలయాలను కూల్చిపారేసే  చంద్రబాబు వంటి కుహనా హిందువులకు తగిన శాస్తి జరుగుతుంది.   ఈ విషయంలో చంద్రబాబును సమర్ధిస్తూ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత, మతపరమైన ద్వేషంతో విమర్శిస్తూ తప్పు పట్టిన నికృష్టమేధావులు సిగ్గుతో తలలు దించుకోవాలి.  ఒక చారిత్రాత్మిక తీర్పును ఇచ్చిన జస్టిస్ బట్టు దేవానంద్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో  సందేహం లేదు.

                                                                                         – ఇలపావులూరి మురళీమోహన రావు 
                                                                                              (సీనియర్ రాజకీయ విశ్లేషకులు )