ఆప్కో విక్రయాలను రూ.వెయ్యి కోట్లకు చేర్చటమే లక్ష్యం

382

నూతన ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చిల్లపల్లి వెంకట నాగమోహన రావు

ఆప్కో విక్రయాలను సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలకు తీసుకువెళ్లాలన్నదే తన ముందున్న ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహాకార సంఘం ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన రావు అన్నారు. విజయవాడ కేంద్ర కార్యాలయంలో ఆప్కో నూతన ఛైర్మన్ గా చిల్లపల్లి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్ధ నిర్వహణా సంచాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్కో పనితీరును గురించి నూతన ఛైర్మన్ కు వివరించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ దాదాపు 103 కోట్ల రూపాయల బకాయిలు వివిధ ప్రభుత్వ శాఖల నుండి రావలసి ఉండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిని విడుదల చేయించి చేనేత కార్మికులకు అండగా నిలిచారన్నారు.  చేనేత కార్మికుల పట్ల ప్రేమానురాగాలను చూపే ముఖ్యమంత్రి ఇప్పటికే నేతన్న నేస్తం ద్వారా ఆదుకుంటున్నారని, వారి జీవన ప్రమాణ స్దాయి పెంపు కోసం ఎటువంటి కార్యక్రమానికైనా సహకరించేందుకు సిఎం సిద్దంగా ఉన్నారని వివరించారు. కరోనా కాలంలో సైతం ఆప్కో వస్త్రాలను రాష్ట్ర ప్రజలు ఆదరించారని ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.26.44 కోట్ల విక్రయాలను చేయగలిగారని ప్రస్తుతించారు.

రాష్ట్రంలోని చేనేత కార్మికులను ప్రోత్సహించే క్రమంలో ముఖ్యమంత్రి ఆక్టోబర్ లో ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ apcohandlooms.com ను ప్రారంభించారని ఇది చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని చిల్లపల్లి పేర్కొన్నారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ గా ఉన్న అమెజాన్, గోక్యాప్, మిర్రా, ఫ్లిప్‌కార్ట్, మింట్రా, పేటిఎమ్, లూమ్‌ వంటి సంస్ధల భాగస్వామం సంస్ధ పనితీరును అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లిందన్నారు.  సంస్ధ ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ  ఈ కామర్స్ రూపంలో ఇప్పటి వరకు రూ.11 లక్షల వ్యాపారం చేసామని, కరోనా కాలాన్ని అధికమిస్తే విక్రయాలు పెద్ద ఎత్తున పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. కరోనా నేపధ్యంలో మాస్క్ ల తయారీలోనూ ఆప్కో కీలక భూమికను పోషించిందన్నారు.  దేశ వ్యాప్తంగా 108 షోరూమ్‌ల ద్వారా ఆప్కో విక్రయాలు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 94 షో రూములు, ఇతర రాష్ట్రాల్లో 14 షో రూమ్ లు ఉన్నాయన్నారు. నూతన ఛైర్మన్ కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన ఉద్యోగులు, నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో కేక్ కట్ చేయించారు. ఆప్కో ఆవరణలోని దేవాలయంలో చిల్లపల్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంస్ధ జిఎంలు రమేష్, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు