ప్రక్షాళన దిశగా బీజేపీ !

497

తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి సతీష్‌జీ మార్పు
త్వరలో మంత్రి శ్రీనివాస్, మధుకర్‌రెడ్డికీ స్థానచలనం
ఫిర్యాదుల ఫలితమే ప్రక్షాళన?
(సుమ)

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు సంస్థాగతంగా ప్రక్షాళన ప్రారంభించింది. అందులో భాగంగా పార్టీ సంఘటనా సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.సతీష్‌జీని తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ, అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన శివ ప్రకాష్‌ను నియమించింది. శివప్రకాష్ ను మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సతీష్‌జీని పార్లమెంటు కార్యాలయ సమన్వయకర్త-ఎస్సీ ఎస్టీ మోర్చాల సమన్వయకర్తగా నియమించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాశంమమయింది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆయన ఉమ్మడి-విభజత రాష్ట్రానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా పార్టీ ప్రక్షాళనలో భాగంగా పలు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న, మరో ఇద్దరు రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శులను కూడా తప్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది నాయకులు జాతీయ స్థాయికి ఎదిగినా, కనీసం ఒక్కసారి కూడా ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోని కారణాలపై, బీజేపీ జాతీయ నాయకత్వం చాలాకాలం నుంచి విశ్లేషిస్తోంది. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, కృష్ణంరాజు, సత్యనారాయణ, కిషన్‌రెడ్డి వంటి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు… కేంద్రమంత్రుల నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకూ ఎదిగారు. ఏపీలో అయితే గత టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ మంత్రులుగా కూడా పనిచేశారు. అయితే, వీరిలో చాలామంది ప్రాతినిధ్యం వహిస్తోన్న సొంత డివిజన్లు, గ్రామాలలో పార్టీ నుంచి, ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా విజయం సాధించలేకపోతున్నారు. పేరుకు రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకులయినప్పటికీ, వారికి స్థానికంగా ఎలాంటి పట్టు లేకపోవడం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.

దీనికి కారణం పార్టీని దిశానిర్దేశం చేసే, రాష్ట్ర-జాతీయ సంఘటనా మంత్రుల వైఫల్యమేనని తేలినట్లు సమాచారం. వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, పార్టీ ప్రక్షాళనకు నడుంబిగించినట్లు సీనియర్లు చెబుతున్నారు. జాతీయ సంఘటనా సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వి. సతీష్‌జీ.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా, తెలుగు రాష్ట్రాల ఇన్చార్జిగా వ్యవహరించారు. కానీ ఇప్పటిదాకా పార్టీ ఎక్కడా పట్టు సాధించలేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రాల పార్టీ స్థితిగతులపై చర్చించేందుకు, ఆయన ఏనాడూ తగిన సమయం ఇవ్వలేదన్న ఫిర్యాదులు లేకపోలేదు. కార్యవర్గ సమావేశాలు, కోర్ కమిటీ భేటీ తర్వాత వెళ్లిపోవడం తప్ప.. నిర్దిష్టంగా పలు కమిటీలతో భేటీ అయిన దాఖలాలు లేవన్న విమర్శ ఉంది. తాజాగా తిరుపతిలో జరిగిన చింతన్‌బైఠక్‌లో నేతలు పలు అంశాలపై చర్చిస్తుంటే, సతీష్‌జీ మాత్రం సెల్‌ఫోన్ చూడటంలో మునిగిపోయారన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాన్ని బట్టి ఆయనకు పార్టీ వ్యవహారాలపై ఎంత ఆసక్తి ఉందో స్పష్టమవుతోందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానించారు. ఆయన వైఫల్యం, నిరాసక్తత కారణంగానే సునీల్‌దియోధ ర్.. పార్టీ వ్యవహారాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఏపీలో సతీష్‌జీ.. ప్రస్తుతం ఉత్తరాదికి బదిలీ అయిన ఓ సంఘటనా ప్రధాన కార్యదర్శి, ఆయన శిష్యుడయిన సోము వీర్రాజు, సహ ఇన్చార్జి సునీల్ దియోథర్‌ను ప్రోత్సహించినందుకే, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఏపీ వ్యవహారాల నుంచి తొలగించిన ఆ నాయకుడి మార్గదర్శకత్వంలోనే, సతీష్‌జీ పనిచేశారన్న విమర్శలు కూడా ఆయనపై లేకపోలేదు. సదరు పాత నాయకుడు సిఫార్సు చేసిన పలువురు మహిళా నేతలే, ఇప్పుడు వివిధ కీలక పదవుల్లో ఉన్న విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో ఓ రాష్ట్రానికి సంఘటనా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సదరు నాయకుడితోపాటు, సంఘ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నేత ఆశీస్సులతోనే వీర్రాజు అధ్యక్షుడయిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఓ మహిళా నేత స్థానం సంపాదించుకోవడంలో, సదరు సంఘ్ కీలక నేతనే చక్రం తిప్పారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఎంపికలో ఆయన ‘భాగ’స్వామి అయ్యారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

కాగా సీనియర్లను మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయడం మంచిదికాదని.. కేంద్ర మాజీ మంత్రి పురంధీశ్వరి రెండుసార్లు కోర్ కమిటీలో ప్రస్తావించినా, సతీష్‌జీ స్పందించకుండా నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు వీర్రాజుకి వదిలేయడంపై, అప్పుడే విమర్శలు వెల్లువెత్తువెత్తాయి. జిల్లా కమిటీలను కూడా అధ్యక్షుడు సోము వీర్రాజు నియమిస్తామన్న విధాన నిర్ణయాన్ని, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమను రాష్ట్ర అధ్యక్షుడు నిర్వీర్యం చేస్తున్నందున, సమయం ఇవ్వాలని పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సతీష్‌జీని కోరినా, ఆయన స్పందించని వైనాన్ని జిల్లా అధ్యక్షులు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో కూడా సతీష్‌జీ భాగస్వామ్యం అతి స్వల్పమేనంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ఆయన వైఫల్యం చెందారని, రాష్ట్ర సంఘటనా మంత్రులతో సమన్వయం- కార్యకర్తల్లో సమరోత్సాహం నింపడంలో, సతీష్‌జీ ఘోర వైఫల్యం చెందారన్న విమర్శలు లేకపోలేదు. టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సరైన దిశానిర్దేశం ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాతనే, ఆయనను తెలుగు రాష్ట్రాల ఇన్చార్జిగా తొలగించారని చెబుతున్నారు.

కాగా తెలంగాణ బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, ఏపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌రెడ్డిని కూడా మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి శ్రీనివాస్‌పై సీనియర్ల నుంచి లెక్కకుమించి ఫిర్యాదులున్నట్లు సమాచారం. ఆయనపై ఇప్పటికే తెలంగాణ సీనియర్లు, జాతీయ నాయకత్వానికి అనేక ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులను డమ్మీని చేసి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నదే ఆ ఫిర్యాదుల సారాంశం. దాదాపు ఐదేళ్ల పాటు ఏబీవీపీ కార్యకర్తలకు మోటారు వాహనాలు కొనుగోలు చేసి, వారికి నెలవారీ జీతాలిచ్చినా తెలంగాణలో ఒక్క హైదరాబాద్ తప్ప, ఎక్కడా పార్టీ విజయం సాధించలేదని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి సంఘటనా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ, ఎలాంటి పురోగతి సాధించని కారణంగా మంత్రిజీని మార్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇక ఏపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌రెడ్డి పనితీరుపైనా, అనేక ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఆయనపై మిగిలిన వారిలా ఆరోపణలు లేకపోయినా, చురుకుగా వ్యవహరించడం లేదని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆయన పార్టీ సమన్వయకర్తగా కాకుండా, సోము వీర్రాజు వర్గానికి చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. నేతలు వెళ్లినప్పుడు వారితో ఆయన సరైన విధంగా మాట్లాడరని, ఆయన నుంచి ఎలాంటి స్పందన-హామీ లభించదన్నది నేతల ఫిర్యాదు. ఈ నేపథ్యంలో, ఆయన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లయినా, ఎలాంటి ఫలితం రాబట్టని కారణంగా మధుకర్‌రెడ్డిని కూడా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

సహ ఇనార్జి సునీల్ దియోథర్ వ్యవహారశైలి పలు విమర్శలకు గురవుతోంది. ఈ సందర్భంగా ఆయన ‘బలహీనత’లపై, పార్టీ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతుండ టం విశేషం. ఏపీలో పార్టీ మొత్తం ముగ్గురి వ్యక్తిగత నిర్ణయాలపై నడుస్తోందని, దానికి సునీల్ దియోథర్ కారణమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్ బిజీగా ఉండటంతో, సునీల్ హవా నడిపిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి సునీల్‌ను ఏపీ సహ ఇన్చార్జిగా తప్పించాలని భావించినప్పటికీ, ఆరెస్సెస్‌కు చెందిన ఓ నేత … కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సిఫార్సు చేయడం వల్లనే, ఆయన కొనసాగుతున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. అయితే సునీల్ ఏకపక్ష-పక్షపాత వైఖరిపై, ఏపీ బీజేపీ సీనియర్లు ఇప్పటికే నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.