సగర భవనాన్ని క్రైస్తవులకు అప్పగిస్తారా?-బండి సంజయ్ ఫైర్

221

కేసీఆర్ సర్కార్ బీసీ వ్యతిరేకతతో ముందుకు పోతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ విమర్శించారు. వెనకబడిన కులాలకు చెందిన సగర (ఉప్పర) కులానికి చెందిన భవనాన్ని క్రైస్తవులకు కేటాయించి బీసీ వ్యతిరేకిగా నిరూపించుకుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెనకబడిన కులాలకు ఆత్మగౌరవ భవనాలు పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భవనాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఆ భవనాలు నిర్మించకపోగా.. సగర కులానికి చెందిన ఆత్మగౌరవ భవనాన్ని క్రైస్తవులకు కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు.  ఇది వెనకబడిన తరగతుల వారిని, ఉప్పర-సగర కులానికి అన్యాయం చేయడమే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ సంతుష్టీకరణ మాయలో పడి హిందువులైన వెనకబడిన తరగతుల వర్గాల వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక, బీసీ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఇందుకు కేసీఆర్ బీసీల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.

వెనకబడిన తరగతులకు చెందిన సగర(ఉప్పర) కులానికి కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ సర్కార్ వెనక్కు తీసుకొని, దానిని క్రైస్తవ భవన్ కు కేటాయించడం పట్ల ఆవేదన చెందుతూ.. ఆ స్థలానికి తమకు ఇప్పించాల్సిందిగా కోరుతూ తెలంగాణ సగర సంఘం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ స్థలాన్ని క్రైస్తవులకు కేటాయించడమే కాకుండా ఇప్పటికే మంత్రిచేత క్రైస్తవ భవన్ కోసం శంకుస్థాపన కూడా చేశారని సగర సంఘం ప్రతినిధులు బండి సంజయ్ ముందర తమ గోడు వెళ్లబోసుకున్నారు

బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తున్న కేసీఆర్ వారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి సాధికారత, అభివృద్ధి పట్ల కనీస చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లోనూ బీసీలకు చెందిన డివిజన్లను అక్రమంగా మైనార్టీలకు కట్టబెట్టి బీసీ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకతను చాటుకున్నారని తెలిపారు. గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడి తగిన మూల్యం చెల్లించుకున్న విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకుంటే మంచిది చురకలంటించారు. దుబ్బాక ఉపఎన్నికలు, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో హిందువులు తగిన గుణపాఠం చెప్పినా కేసీఆర్ బుద్ధి మార్చుకోలేదన్నారు.

ఓటుబ్యాంకు రాజకీయాలు, మైనార్టీల సంతుష్టీకరణ పేరుతో హిందువులకు, బీసీలకు అన్యాయం చేస్తే బిజెపి చూస్తూ ఊరుకోదని, ఉప్పర-సగర కులానికి చెందిన ఆత్మగౌరవ భవనాన్ని క్రైస్తవులకు కేటాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు బిజెపి పోరాడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు.