వైసిపి పాలనలో దేవాలయాలపై దాడులు

525

రాష్టంలో వైసిపి ప్రభుత్వ  పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరు అరండల్ పేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ చైతన్యశర్మ, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు ఏదో రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలో 400 ఏళ్ళ నాటి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఏకంగా రాములవారి తలని ధ్వంసం చేసి తలా పట్టుకెళ్లారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.. దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఎవరో మతిస్థిమితం లేని వారు, ఆకతాయిలు ఇలాంటి పనులు చేశారు అంటూ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే హిందూ ధర్మం పై దాడులు విధ్వంసాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తుంది అన్నారు.వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించలేమని చెబితే,తామే రక్షణ కల్పించుకుంటామని తెలిపారు. దేవాలయాల సొమ్మును ఈప్రభుత్వం అన్యమతస్తుల కోసం ఖర్చు చేస్తుందని  తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా హిందూ ధర్మంపై దాడులు ఆపకుంటే హిందువుల ఆగ్రహాన్ని ఈప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు