ఢిల్లీ ఉద్యమంలో అమరావతి రైతులు?

622

తొలి వారంలో ప్రయాణం
రెండు బస్సుల్లో ఢిల్లీకి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొద్దిరోజుల నుంచి ధర్నాలు చేస్తున్న రైతులకు, అమరావతి రైతులు  ప్రత్యక్ష మద్దతునిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు రెండు బస్సుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ధర్నా ద్వారా సాటి రైతులకు మద్దతునివ్వడం వల్ల, అమరావతిలో  రాజధాని కోసం భూములిచ్చి నష్టపోయిన వైనాన్ని,  దేశ ప్రజలకు చాటాలన్న ప్రధాన లక్ష్యంతో అమరావతి రైతులు ఢిల్లీ ధర్నాలో పాల్గొననున్నారు.  జనవరి తొలివారంలో అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కొద్దిరోజుల నుంచి ఎముకలు గడ్డ కట్టే చలిని సైతం లెక్క  చేయకుండా పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు ఆందోళనకు బీజేపీ, ఎన్డీయే పక్షాలు మినహా, మిగిలిన అన్ని పార్టీలూ మద్దతునిచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే, ఏకంగా ప్రభుత్వం తరఫునే బంద్ నిర్వహించారు. రైతుల ఆందోళన తీవ్రతరమవుతున్న నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రం,  ైరె తు సంఘాలతో చర్చలు ప్రారంభించింది. అందులో రెండు డిమాండ్లకు మోదీ సర్కారు దిగివచ్చింది.

ఈ నేపథ్యంలో, తాము కూడా ఢిల్లీకి వెళ్లి రైతుల ఆందోళనకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని అమరావతి రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై కొంత తర్జనభర్జన అనంతరం.. రెండు బస్సుల్లో ఢిల్లీకి వెళ్లి, సమస్య పరిష్కారం అయ్యేంతవరకూ అక్కడే ఉండాలని భావిస్తున్నారు. తాము ఆ ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొనడటం వల్ల, అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఆందోళన అంశాన్ని, దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఫలితంగా దేశంలోని ైరె తు సంఘాల మద్దతు కూడా పొందవచ్చన్నది మరో లక్ష్యం.

పార్లమెంటు సమావేశాల సమయంలో.. అమరావతి రైతులు, మహిళలు ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతలను కలసి, వారి మద్దతు అర్ధించారు. కాంగ్రెస్,వామపక్షాలు సహా వారికి తమ సంఘీభావం ప్రకటించాయి. రాజధాని కోసం మూడు పంటలు పండే  భూములు ఇచ్చి, నష్టపోయిన అంశాన్ని అమరావతి రైతులు,  జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు.
అయితే, ఆ తర్వాత కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో, రైతు నేతలు కొంత నిరాశ చెందారు. ఏడాదికి పైగా ఆందోళనలు నిర్వహిస్తున్నా, జగన్ ప్రభుత్వం స్పందించకపోవడం.. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న సమయంలో, ప్రధాన న్యాయమూర్తి సహా బదిలీ కావడం వారిని తీవ్ర నిరాశకు గురిచే సింది. ఈలోగా ఢిల్లీలో మొదలయిన రైతు ఆందోళన,  వారిలో కొత్త ఆలోచన రేకెత్తడానికి కారణమయింది. అక్కడి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప, తమ సమస్య జాతీయ స్థాయిని ఆకర్షించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. ఫలితంగానే రైతుల ఢిల్లీ పర్యటన. ఒకరకంగా వారు ఇది తమ చివరి అస్త్రంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘అమరావతి రైతులతో కలసి ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచన నిజమే. ఇప్పటికే మహిళా రైతులు పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లి, అన్ని పార్టీలనూ కలిశారు. వ్యవసాయ చట్టాల వల్ల మా లాంటి రైతులు నష్టపోతారు. పంజాబ్, హరియాణా రైతుల ఆందోళనలో న్యాయం ఉంది.  అమరావతి రైతులు కూడా  రాజధాని నగరానికి భూములిచ్చి దారుణంగా మోసపోయారు. భూములిచ్చిన రైతులను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులుగా ముద్రవేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతు  సంఘం  నాయకులు, ఢిల్లీ రైతుల ఆందోళనలో పాల్గొంటున్నారు. కొద్దిరోజుల్లోనే  మహిళా రైతులు కూడా అక్కడికి వెళ్లి, వారి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటారు.  అందుకోసం చాలామంది మహిళా రైతులు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. అక్కడే అమరావతి కోసం,  దేశంలోని వ్యవసాయ సంఘాల మద్దుతు కూడ గట్టేందుకు కృషి చేస్తామ’ని అమరావతి మహిళా జేఏసీ కన్వీనర్ సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.   ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను, అమరావతికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు.

కాగా ఢిల్లీకి వెళ్లి అక్కడి రైతుల ధర్నాకు ప్రత్యక్ష మద్దతునిచ్చే అంశంపై,  ఇప్పటికే పలువురితో చర్చించినట్లు అమరావతి జేఏసీ ప్రత్యేక ఆహ్వానితుడు, అఖిల భారత హిందూ మహాసభ ఏపీ అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కోవిడ్, రవాణా సౌకర్యాల కొరత దృష్ట్యా రెండు బస్సుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. దీనికి చాలామంది రైతులు ముందుకు వచ్చారన్నారు.  ఢిల్లీలో వాతావరణం దృష్ట్యా, కొందరిని మాత్రమే తీసుకువెళ్లే యోచన చేస్తున్నామన్నారు. ‘ఢిల్లీలో చలి బాగా ఎక్కువ. అయినా సరే వస్తామని రైతులు ముందుకొస్తున్నారు. అమరావతి కంటే మా ప్రాణాలు ఎక్కువేమీ కాదంటున్నారు. ఇప్పటికే రైతులు ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా బాగా దెబ్బతిన్నారు. అయినా వారిలో పట్టుదల సడలలేదు. అదే పట్టుదలతో ఢిల్లీకి వెళ్లి, రైతు ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నార’ని వెలగపూడి వ్యాఖ్యానించారు.  అమరావతి రాజధాని కోసం హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి ఇప్పటికే, జాతీయ స్థాయిలో పోరాటం నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.