నేటి పల్లెటూరు!!!

200

ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా ఇళ్ళకి  తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు…వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు…ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు…షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని…
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..ఖాతాలుపెట్టి…
క్వార్టర్లు తాగుతుంటే…
తెల్లకార్డు… వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం దాక్కోని ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత…
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని  ఆమ్ల  క్షారత…

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ…ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నీటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు…
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు…
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఏవడికి వాడే గాంధీ.‌.
ఏవడికి వాడే సూపర్ హీరో…
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ..
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే
పనికి రాని ..మనుషులకు
పనికి ఆహర పథకాలయ్యాయి.

చదువు చెప్పే టీఛర్లు..పిల్లలకు
తాము చదువు చెప్పుతున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు.
పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు  చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు.

ఏటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పశువుల డాక్టర్ వుద్యొగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
మనుషుల డాక్టర్ కూడా వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
కూలి పనికొచ్చిన వాళ్ళు
కూలి పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు..

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్సిట్యూట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పూడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు  చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా  తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకోని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా  బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక  కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే…
నన్ను బాగుచేసేదే న్యాయం…
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దెగ్గిరనించి ఏ పథకం వస్తుందా
ఏంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు?

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
దాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టొర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకోని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక… చాలామంది
పొట్లాలపాలు తెచ్చుకోని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత  సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపొయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపొయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ…
రియల్ ఎస్టేట్ దెయ్యాల  వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా… పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకమందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ…అస్థిపంజారాలుగా మిగిలి పోతున్నాయి
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపొయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే…….

ఈ రాజ్యం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో.