ఫార్మాసిటీని వ్యతిరేకిద్దాం-ఆరోగ్య తెలంగాణ సాధిద్దాం

433

సీమాంధ్ర పాలనలో మగ్గిపోతున్న మన తెలంగాణ నేల విముక్తి కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఎన్నికల పార్టీగా ఉన్నందున టిఆర్ఎస్ పార్టీని గెలిపంచుకున్నాం. అభివృద్ధికి ఐదేండ్లు సాలదంటే మరోసారి గెలిపించినం. దళితున్ని సీఎం చేస్తానని మాట మార్చినా వదిలేసినం, ఉద్యోగాలు ఇయ్యకున్నా ఎట్లో గట్ల బతుకుతున్నాం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ఆరేండ్లుగా ఊరిస్తున్నా కిరాయి ఇండ్లల్ల కాలం గడుపుతున్నం, కేజీ టు పిజి విద్య ఇవ్వకున్నా విద్య కోసం అప్పులపాలవుతున్నాం.  మల్లన్న సాగర్లో ఊర్లు మునుగుతుంటే పోనీ చుట్టుపక్కల ఊర్లన్నా బాగుపడ్తయి కదాని రాజీ పడ్డం. మూడెకరాల ముచ్చటే మరిచిపోయినం, రైతు మరణాలు ఆగడం లేదు.

అవినీతి అంశంలో అందరు పాలకులు చేస్తున్నదేనని సమాధాన పడ్డం. ఇట్లా చెప్పుకుంటే పోతే ఎన్నో విషయాలు కాని రెండోసారి గెలిచినంక  జీరో కాలుష్యమంటూ అందమైన అబద్దమాడుతూ, ఫార్మాకు ప్రపంచ రాజధానిగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని చెబుతుంటే మౌనంగా ఎలా ఉండగలం. ప్రపంచ ఫార్మాసిటీ పేరుతో  ప్రపంచ కాలుష్య రాజధానిగా తెలంగాణ మారితే త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నదేందుకు? తెలంగాణ సాధించినప్పటికి ఫార్మాసిటీ వెదజల్లే కాలుష్యం వల్ల భవిష్యత్ తరాల ముందు మనం  దోషులుగా నిలబడాల్సి ఉంటుంది.

గతంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలలో ఫార్మా కాలుష్య కారక కంపిణీలు పెట్టి విధ్వంసం చేసిండ్రనే మనం పోరాడి తెలంగాణ సాదించుకున్నాం. హైదరాబాద్ ఉమ్మడి నగరంగా ఉండాలనే ప్రతిపాదనను కూడా తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర పాలకుల విధానాలను మరింత ఉదృతంగా అమలు చేయడమే అవుతుంది. ఆంద్ర పాలకులు ఉంటే తెలంగాణ ప్రజలకు భయపడి ఇలాంటి ఫార్మాసిటీలు పెట్టేవారు కాదు. జీరో కాలుష్యమంటూ విదేశాలకు మన బృందాలను పంపి అధ్యయనం జరిపించామని చెబుతున్న పాలకులు ముందు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాలుష్యాన్ని నిర్ములించాల్సిన బాధ్యత విస్మరించారాదు.

తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేండ్లయిన జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ వెదజల్లుతున్న వాసనలను, కాలుష్యాన్ని నివారించలేనపుడు ఫార్మసిటీలో కాలుష్యం ఉండదంటే నమ్మేదెట్ల? ఇటీవల విశాఖ పట్నంలో వెలువడిన విషవాయువుల వల్ల చనిపోయినవారు చనిపోగా బతికున్నవారు జీవచ్చవాలుగా బతుకులీడుస్తున్నారు. దేశంలో భోపాల్ గాస్ లీకు ఇంకా మరువనేలేదు. పులి మీద పుట్రలా దాపురించిన కరోనా వాయు కాలుష్యంతో దెబ్బతింటున్న ఊపిరి తిత్తులపై దాడి చేస్తూ  మరింత ఎక్కువ నష్టాలకు గురి చేస్తుంది. కరోనా నేపథ్యంలో నైనా ఫార్మాసిటీ ఏర్పాటును పునఃపరిశీలించుకోవాల్సి ఉంది. కరోనాకు ముందు చేసిన ఫార్మా ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరముంది.

కరోన వైరస్ వల్ల మానవ సమాజం గమనించిన విషయాలకు అనుగుణంగా ఆరోగ్య విధానం ఉండాలి. పౌష్టికాహార లోపం, ఆరోగ్య క్షీణత వల్లనే కరోన లాంటి వైరస్ లు మానవ సమాజంపై దాడి చేస్తున్నాయని తేటతెల్లమైనప్పుడు ప్రభుత్వ ప్రణాళికలు ఆ దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తులను పెంచే ప్రణాళికలు వదలి ఫార్మా సిటీ నిర్మాణం కోసం పరుగులు తీయడం సరైంది కాదు.

స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా కరోన లాంటి వైరస్ లు వచ్చాకనైనా పోషకాహార ఉత్పత్తులు, స్వదేశీ ఉత్పత్తులపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత మరిచి ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం దుర్మార్గం. స్థానిక వైద్యానికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఆయుర్వేద డాక్టర్లను ఆపరేషన్లు చేసే అనుమతి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రమాధమైన ఫార్మాసిటీకి అనుమతులు ఇవ్వడం సమంజసం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవాలంటే వెంటనే ఫార్మాసిటీ ప్రతిపాదనలు నిలిపివేసి, పౌష్టికాహారాన్నిచ్చే  ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. పండ్లు తింటే మంచిదని కరోన లాంటి వైరస్ లు వచ్చినప్పుడే చెప్పడం కాకుండా పాలకులు ప్రజారోగ్యానికి ఉపయోగపడే ఉత్పత్తుల అభివృద్ధికి బాటలు వేసి వైరస్ లను ఎదుర్కునే ఆరోగ్య మానవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి.

ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ప్రపంచానికి ఆరోగ్యం ఇస్తున్నామని వాదన చేసే పాలకులు ప్రపంచానికి ఆరోగ్యం ఇవ్వడానికి తెలంగాణను నాశనం చేయడం సమంజసమేనా?  ఒకసారి ఆలోచించాలి. ఒకే చోట ఫార్మా కంపిణీల ఏర్పాటు ఆలోచన ఒక నష్టదాయకమైన ఆలోచన. అంతగా ఫార్మా కంపిణీల వల్ల ఆరోగ్యం వచ్చేటట్టయితే ఒక దగ్గర కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెట్టుకోవచ్చు. ఏదేశం ఏ రాష్ట్రం తెచ్చి పెట్టుకోని కాలుష్య ఫార్మా కంపిణీలను తెలంగాణలో  పెట్టుకోవడం ఆత్మహత్య సదృశ్యమవుతుంది. ఫార్మా ప్రపంచ రాజధాని అని చెప్పడం కూడా గొప్ప వంచన అవుతుంది. ఫార్మాసిటీ సిటీ వల్ల ఫార్మాసిటీ ఏర్పాటు అవుతున్న గ్రామాల ప్రజలకు మాత్రమే కాలుష్యం పరిమితమం కాదు.

ఫార్మాసిటీ నుండి వెలువడే విష రసాయణాలతో కూడిన కాలుష్యం వాగుల్లో, వంకల్లో కలిసి చెరువుల్లో నిండి, మూసి నది గుండా కృష్ణా నదిలో అక్కడి నుండి సముద్ర తీరాలను కూడా చేరుకుంటుంది. రంగారెడ్డిజిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసి కిరువైపుల పంటపొలాలు విషపూరితమవుతాయి. ఇక్కడ పండే ఆహార పదార్థాలు అన్ని ప్రాంతాల ప్రజలు తినక తప్పదు. సమస్య మాది కాదని వేరే ప్రాంత ప్రజలు అనుకుంటే పొరపాటే. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, విభజించి, జిమ్మిక్కులు చేసి అనైతిక పద్ధతుల్లో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 19333 ఎకరాల భూమిని ప్రజల నుండి తెలంగాణ ప్రభుత్వం గుంజుకున్నది. దశల వారిగా ఇక ఎంతకి విస్తరిస్తుందో చెప్పలేని పరిస్థితి. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఫార్మా కంపెనీల వల్ల ఊహించని ప్రమాదం వచ్చిపడిందని ఆ ప్రాంత ప్రజలు వేదనకు గురవుతున్నారు. మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని మీడియా, ఉద్యమకారులంతా ఉరికినట్లు ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమానికి రావడం లేదు.

సాగునీటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఉరికిన ఉద్యమకారులు విషం చిమ్మే కంపిణీల ఏర్పాటును అడ్డుకోవడానికి అదే స్ఫూర్తితో ముందుకు రావడం లేదని యాచారం, కందుకూరు, కడ్తాల్ ప్రజలు అంతర్మధనం చెందుతున్నారు. అక్కడి ప్రజల్లో స్పందన లేదని ఉద్యమకారులు మాకు అండగా రావడం లేదని ఉద్యమకారులు ఇట్లాగే కాలం గడిపితే భవిష్యత్ తరాల ముందు అందరం దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ ఉద్యమకారులంతా సంఘటితంగా ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల ఆరోగ్యాన్ని కాలుష్యం బారినుండి కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది.
ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు, మేధావులు మరో తెలంగాణ ఉద్యమం లాగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఫార్మాసిటీని వ్యతిరేకినచడానికి ఐక్యమై ఆరోగ్య తెలంగాణ స్థాపించడానికి పోరాటం చేయాలి.