చరిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ ఘ‌ట్టం

0
22

👉ఇళ్ల ప‌ట్టాల పంపిణీపై మంత్రుల హ‌ర్షం
👉జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం: ల‌బ్దిదారులు
👉విజ‌య‌న‌గ‌రంలో ఘ‌నంగా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ

క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో ఒకేసారి ఏకంగా 30ల‌క్ష‌ల‌, 75వేల ఇళ్ల ప‌ట్టాల పంపిణీ దేశ చరిత్ర‌లోనే ఒక చిర‌స్మ‌ర‌ణీయ ఘ‌ట్ట‌మ‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రులు, మంత్రులు, శాస‌న స‌భ్యులు, అధికారులు కొనియాడారు. ఇటువంటి కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అయినందుకు త‌మ జ‌న్మ ధ‌న్య‌మ‌య్యింద‌ని పేర్కొన్నారు.

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా గుంక‌‌లాంలో జ‌రిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, గిరిజ‌న సంక్షేమ‌శాఖామంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి మాట్లాడుతూ పేద‌ల సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చిన రోజు చారిత్ర‌క దిన‌మ‌ని పేర్కొన్నారు. వారి గుండెల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోతార‌ని కొనియాడారు. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 73ఏళ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ, ఈ 73 ఏళ్ల‌లో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌లేని ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కేవ‌లం 73 వారాల్లోనే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి చేశార‌ని చెప్పారు. ఆయ‌న ఒక‌ అన్న‌లా ప్ర‌జా స‌మ‌స్య‌లు విని, ఒక అమ్మలా పాలిస్తున్నార‌ని కొనియాడారు. రామ‌రాజ్యాన్ని, రాజ‌న్న రాజ్యాన్ని క‌లిపి మ‌న క‌ళ్ల‌ముందుంచిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కింద‌న్నారు. జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మ‌హిళా ప‌క్ష‌పాతి అని, ప‌ద‌వులూ, ప‌థ‌కాల‌ను మ‌హిళ‌కోసమే తెచ్చి, ప‌థ‌కాల ఫ‌లాల‌ను కూడా మ‌హిళ‌ల‌కే అందిస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఉప ముఖ్య‌మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మాట్లాడుతూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను నెర‌వేరుస్తూ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి జ‌న‌రంజ‌క పాల‌న అందిస్తున్నార‌ని కొనియాడారు. ఆయ‌న చేతుల‌మీదుగా ప‌ట్టాల పంపిణీ జ‌ర‌గ‌డం ఒక అధృష్టంగా పేర్కొన్నారు. స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే పాల‌న అందించార‌న్నారు. వెనుక‌బ‌డ్డ‌ ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో పేద‌లు, బిసిలు, వ్య‌వ‌సాయ‌దారులు, వ్య‌వ‌సాయ కూలీలు ఎక్కువ‌ని, వారి సంక్షేమానికి ముఖ్య‌మంత్రి పెద్ద‌పీట వేస్తున్నార‌ని చెప్పారు. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప‌లాస‌లో రూ.600 కోట్ల‌తో వాట‌ర్ గ్రిడ్ తెచ్చార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి వెంట న‌డ‌చేందుకు జ‌నం ఉర్రూత‌లూగుతున్నార‌ని ధ‌ర్మాన‌ అన్నారు.

రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఇళ్ల ప‌ట్టాలు పొంద‌డం పేద‌ల చిర‌కాల స్వ‌ప్న‌మ‌ని, దానిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి నెర‌వేర్చార‌ని కొనియాడారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక త‌మ పార్టీకి ఒక భ‌గ‌వ‌ద్గీత అని, దానిని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని చెప్పారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. నిధులకు క‌ట‌క‌ట‌లాడుతున్న క్లిష్ట ప‌రిస్థితిలో కూడా, దైర్యంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ల‌క్ష‌లాది మంది పేద ప్ర‌జ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా, వారికి ఇళ్లు మంజూరు చేసి, సొంతింటి క‌ల‌ల‌ను నిజం చేస్తున్నార‌ని అన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను ప్ర‌స్తావించి, వాటిని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాల‌ని బొత్స కోరారు.

స‌భాధ్య‌క్ష‌త వ‌హించిన విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, ఇళ్ల ప‌ట్టాల కోసం సుదీర్ఘ‌కాలంగా ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నేటికి నెర‌వేరాయ‌ని అన్నారు. ఇళ్ల స్థ‌లాల పంపిణీని అడ్డుకొనేందుకు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు త‌న 40ఏళ్ల అనుభ‌వాన్నంతా ఉప‌యోగించినా, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ముందు అవి ఫ‌లించ‌లేదని పేర్కొన్నారు. అర్హులంద‌రికీ అవినీతికి, ప‌క్ష‌పాతానికి తావులేకుండా ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. గుంకలాం లేఅవుట్‌ను రాష్ట్రంలోనే అతిపెద్ద కాల‌నీల్లో ఒక‌టిగా రూపొందించామ‌ని, దీనికి ముఖ్య‌మంత్రి పేరుమీదుగా జెఎన్ఆర్ కాల‌నీగా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌ను మోడ‌ల్ సిటీగా అభివృద్ది చేయాల‌ని, వైద్య‌క‌ళాశాల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని కోల‌గ‌ట్ల కోరారు.

ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ పట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 1164 లేఅవుట్ల‌ను అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దీనిలో గుంకలాం లేవుట్ రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ల‌లో ఒక‌టిగా నిలిచింద‌ని చెప్పారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ల‌క్షా, 8వేల‌కు పైగా ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనిలో తొలివిడ‌త‌గా 98,886 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న‌ట్లు చెప్పారు. వీటిని 18 నెల‌ల్లో పూర్తి చేయ‌నున్నామ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా,ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకొని, జిల్లా మంత్రులు, ప్రజాప్ర‌తినిధుల స‌హ‌కారంతో స‌మిష్టిగా జిల్లా అభివృద్దికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఫ‌లితంగా జిల్లాకు 16 ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు వ‌రించాయ‌ని, వీటి స్పూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు.

పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో భాగంగా గుంక‌లాంలో ఇంటి పట్టాను పొందిన ల‌బ్దిదారు, ప‌ద్మావ‌తిన‌గ‌ర్‌కు చెందిన‌ కొమ‌ర‌గిరి ర‌త్న‌కుమారి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి కృతజ్ఞ‌త‌లు చెప్పారు. తాను టైల‌రింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాన‌ని, త‌న‌కు సొంతింటి భాగ్యాన్ని క‌ల్పించిన ముఖ్య‌మంత్రికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. అద్దె ఇంటి క‌ష్టాల‌ను చెప్పి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 12 ఇళ్లు మారాన‌ని, త‌న క‌ష్టాలు కొద్ది కాలంలోనే గ‌ట్టెక్కిపోతాయంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం వ‌ల్ల త‌న కూతురు బిటెక్ వ‌ర‌కూ చ‌దువుకోగ‌లిగిందని చెప్పారు. జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ప్ర‌భుత్వంలో త‌న‌కు వితంతు పింఛ‌న్ వ‌చ్చింద‌ని, ఇప్పుడు ఇళ్లు కూడా మంజూరు కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు.

స‌భానంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ల‌బ్దిదారుల‌కు ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. అంబేద్క‌ర్ కాల‌నీకి చెందిన పిన్నింటి రామ‌ల‌క్ష్మి, కెఎల్ పురానికి చెందిన మ‌జ్జి మౌనిక‌, 28వ వార్డుకు చెందిన పోల జ‌య‌ల‌క్ష్మి ఇంటి స్థ‌లానికి సంబంధించిన ప‌ట్టాల‌ను అందుకున్నారు. అలాగే టిట్కో ఇళ్ల‌కు సంబంధించి జి.పార్వ‌తి, కె.దివ్య ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా ప‌ట్టాల‌ను పొందారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, గృహ‌నిర్మాణ శాఖామంత్రి చెర‌కువాడ శ్రీ‌రంగ‌నాధ‌రాజు, ప‌ర్యాట‌క శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస్‌, పార్ల‌మెంటు స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, గొట్టేటి మాధ‌వి, ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, స‌త్య‌వ‌తి, ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు, ఎంఎల్ఏలు పీడిక రాజ‌న్న‌దొర‌, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు,శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, కంబాల జోగులు, రెడ్డి శాంతి, క‌ళావ‌తి, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న స‌మ‌న్వ‌య‌క‌ర్త త‌ల‌శిల ర‌ఘురామ్‌, వైకాపా జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీల‌క్ష్మి, డిఐజి కాళిదాస్ రంగారావు, ఎస్‌పి బి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, ఇత‌ర అధికారులు, వివిధ కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్లు, కోల‌గ‌ట్ల శ్రావ‌ణి త‌దిత‌ర‌ ప‌లువురు పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.