767మంది ఆత్మహత్య చేసుకున్నారు:లోకేష్

673

జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 579 రోజుల్లో 767మంది ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్న నాలుగు కుటుంబాలను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్బంగా అవనిగడ్డలో మీడియాతో మాట్లాడుతూ…వరుస విపత్తలు వస్తే సమగ్ర నష్టం అంచనా ఎక్కడా జరగలేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవట్లేదనే రైతులు మనోవేదనకు లోనవుతున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో బిజీగా ఉన్నారన్నారు. రైతుల్ని ఆదుకోవాలని మేం అసెంబ్లీలో డిమాండ్ చేస్తే రైతులంతా సంతోషంగా ఉన్నారని.. అసత్యాలు చెప్తున్నారన్నారు. వరుస రైతు ఆత్మహత్యలు చోటుచేసుంటుంటే దున్నపోతు ప్రభుత్వానికి పట్టదా అన్నారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగితే కానీ పరిహారం ఇవ్వాలనే ఆలోచన రావట్లేదన్నారు. రైతుభరోసా సక్రమంగా అందుతుంటే ఎందుకు వందలమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు.