ఫాఫం…బీసీ సబ్ కలెక్టర్!

548

ఆనం వ్యాఖ్యలతో వెనక్కి
నిద్ర పోతున్న అధికారుల సంఘాలు

జగనన్న పాలనలో అధికారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఘటన మరోసారి స్పష్టం చేసింది. అధికార పార్టీ నేతల దూకుడు ఫలితం.. బీసీ వర్గానికి చెందిన ఓ సబ్ కలెక్టర్, అందరి ఎదుట అవమానం పాలయిన వైనమిది. ‘మీరు ఉన్నంతవరకూ స్టేజి మీదకు వచ్చేది లేదన్న’ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలతో.. మనస్తాపం చెందిన ఓ సబ్ కలెక్టర్, అక్కడి నుంచి అవమానభారంతో నిష్క్రమించిన దారుణ వైనం అధికార వ ర్గాల ఆగ్రహానికి కారణమయింది.

జగనన్న సర్కారు విప్లవాత్మకంగా ప్రారంభించిన, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజవర్గంలో జరిగింది. దానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. ముందస్తుగా ఏర్పాటుచేసిన వేదికపై బీసీ వర్గానికి చెందిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆశీనుయ్యారు. ఆ వేదికపై ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఆనం కూడా ఉండాలి.

ఆ ప్రకారంగా ఎమ్మెల్యేను వేదికపై ఆహ్వానించారు. కానీ ఆనం మాత్రం ‘మీరు ఉండగా స్టేజీపైకి రాను. మీరు కలెక్టర్ చెప్పినట్లు కార్యక్రమం ముగించుకుని వెళ్లిన తర్వాతే మా కార్యక్రమం మేం చేసుకుంటాం’ అని తెగేసి చెప్పడం సంచలనం సృష్టించింది. దానితో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అవమాన భారంతో కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమయింది.
ఈ ఘటన అధికార వర్గాల ఆగ్రహానికి కారణమయింది. ఒ బీసీ అధికారి ఉంటే తాము రానని చెప్పడమంటే, మొత్తం బీసీలు, అధికారవ్యవస్థనే అవమానించడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు ఇంతవరకూ స్పందించకపోవడంపై, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అధికార పార్టీ ఎమ్మెల్యే అవమానిస్తే, సాటి అధికార సంఘాలు,ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత కొంతకాలం నుంచీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత ఆనం.. పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

– సుమ