తిరుపతి అభివృద్దే భాజపా- జనసేన పార్టీల లక్ష్యం

521

– భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

  తిరుపతి అభివృద్దే భాజపా- జనసేనపార్టీల  లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతిలో తిరుపతి పార్లమెంటరీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీనాయకులతో కలసి,  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి నియోజకవర్గంపై భాజపా ప్రత్యేక శ్రద్దను చూపిస్తోందన్నారు. అంతేకాదు రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. తిరుపతి పార్లమెంటు అభ్యర్ధి నిర్ణయంపై భాజపా- జనసేనపార్టీల నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

భాజపా పోటీ వైకాపా, తెదేపాలపైనే అన్నారు.

గత తెదేపా ప్రభుత్వం, ఇప్పటి వైకాపా ప్రభుత్వాలు తిరుపతికి చేసిన అభివృద్ది, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్దిని పోల్చిచూడాలన్నారు. మోదీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు తిరుపతి ప్రాంతానికి రూ.50 వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేయగా అందులో 70 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో స్మార్ట్‌సిటీతో పాటు నడికుడి నాలుగులైన్ల రహదారివంటి 18 రకాల అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేస్తామని వాటిని కరపత్రంలో పొందుపరచిచనట్లు చెప్పారు.

తెదేపా, వైకాపాలకు మరో సీటు వచ్చినా దానివల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఓటు దండగ ఔతుందన్నారు. తిరుపతిని ఇప్పటికంటే మరింత అభివృద్ధి చేయడమే భాజపాలక్ష్యమని చెప్పారు. తిరుపతి అభివృద్ధిలో తెదేపా, వైకాపాల భాగస్వామ్యాన్నివీర్రాజు ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం కేంద్రం తిరుపతికి ఇచ్చిన రూ.450 కోట్లలో కొంత బ్రిడ్జి నిర్మాణానికి వాడిందని, ఈప్రభుత్వం తిరుమలకు వచ్చిన రూ.5 వేలకోట్ల డిపాజిట్లను తమ ఖాతాల్లో వేసుకుని దానిని అనుభవించడానికి ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. పైగా ఆలయాల స్థలాలను వేలం వేయాలనుకుంటోందని ఆరోపించారు.ఎర్రచందనం వంటి విలువైన సంపద తరలిపోతుంటే కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. వనరులను సమాజ అభివృద్ధికి వినియోగించాలని తిరుపతితో పాటు రాయలసీమ, మిగతా 25 పార్లమెంటు స్ధానాలను అభివృద్ది చేయాలనేది భాజపా లక్ష్యంగా పేర్కొన్నారు. తిరుపతిలో చేసిన 18 అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేశామని అన్ని గ్రామాల్లో మోదీ ఉన్నారన్నారు.తిరుపతిపై భాజపాకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. తిరుమలను కేవలం నిధులు కుమ్మరించే సంస్థగా భావించే పార్టీలను ఈ ఎన్నికల్లో భాజపా నిలదీస్తుందని,ఎండగడుతుందని చెప్పారు. సమావేశంలో భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునిల్‌డియోధర్‌, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీనాయకులుపాల్గొన్నారు.

 

 

 

 

4 COMMENTS