రు.23,535 కోట్ల భూమి పేదల పరం

133

30 లక్షల కుటుంబాల్లో ‘గూడు’ కట్టిన అభిమానం
ఆంధ్రాలో అవధుల్లేని ఆనందం
30 లక్షల మందికి ఇంటి స్థలాలు, రిజిస్ట్రేషన్లు
బడుగులపై జగనన్న ముద్ర
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇల్లు పేదవాడి తీపి కల. ఓ ఇంటివాడు కావాలన్నది ప్రతి మధ్యతర గతి మనిషి స్వప్నం. ఈ కలకు కులం లేదు. మతం లేదు. భాష లేదు. అది అన్నింటికీ అతీతమైన చిరకాల స్వప్నం. ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. ఏపీ సీఎం జగన్.. బడుగులపై తన చిత్తశుద్ధి-అంకితభావాన్ని క్రిస్మస్,వైకుంఠ ఏకాదశి పర్వదనం సందర్భంగా మరోసారి ప్రదర్శించనున్నారు. అది కూడా దేశ చరిత్రలోచిరస్థాయిలో నిలిచేంత అద్భుతంగా!  23,535 కోట్ల రూపాయల ఖరీదయిన భూమిని 30 లక్షలాది మందికి పంపిణీ చేసే విడతలవారీ యజ్ఞానికి వైఎస్సార్‌సీపీ సర్కారు నాందిపలికింది. స్వాతంత్య్రానంతరం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు-స్థలాల పంపిణీ ప్రక్రియ ఏ రాష్ట్రంలోనూ ప్రారంభం కాలేదు. అది ఏపీ సీఎం జగన్‌కే సాధ్యమయింది. ఆ అపరూప రికార్డు ఆయనకే సొంతం కానుంది.

రాష్ట్రంలో నేటి నుంచి ఇళ్ల పండగ ప్రారంభం కానుంది. సీఎం జగన్ పేద-మధ్య తరగతి వర్గాలకు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలుకానుంది. ఎప్పుడెప్పుడా అని ఉద్విగ్నం-ఉత్కంఠతో ఎదురుచూస్తున్న స్వప్నం సాకారం కానుంది. రాష్ట్రంలో 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమానికి, తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం  కొమరగిరి గ్రామం  వేదిక కానుంది. గృహనిర్మాణ భూమి పూజ-ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని, సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇది 26 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకూ కొనసాగనుంది. ఇందులో భాగంగా 15,60క్షల మందికి, ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలు కూడా ఉండటం మరో విశేషం.

దీనికోసం ఇప్పటికే టిడ్కో ఇళ్లతో కలపి 30.70 లక్షల మంది అర్హువను గుర్తించారు. వీటికి రహ స్యంగా కాకుండా గ్రామ-వార్డు సచివాలయ కార్యాలయ బోర్డుల్లో నోటీసులో లబ్థిదారుల పేర్లు ఉంచడం ద్వారా ఎంపిక చేయడం విశేషం. గతంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే వివిధ పథకాలు అందేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా లబ్థిదారుల పేర్లు నోటీసులలో ఉంచడం ద్వారా, పారదర్శక విధానం పాటిస్తుండటం విశేషం.

మొత్తం 30, 75,755 మంది లబ్థిదారులను ఎంపిక చేయగా, పట్టాల కోసం 68,361 ఎకరాలు సిద్ధం చేశారు. ఇందులో ప్రైవేటు భూములు కూడా, ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదలకు ఇవ్వడం   మరో విశేషం.  వీటి అంచనా వ్యయం 50,940 కోట్ల రూపాయలు. ఇందులో  17,004 వైఎస్సార్ కాలనీలు కూడా ఉన్నాయి.  ఈ మొత్తం  మార్కెట్ విలువ 23, 535 కోట్ల రూపాయలు.

తొలి దశలో 15.60 లక్షల ఇళ్లకు  భూమి పూజ చేయనున్నారు. రెండో దశలో మరో 28.30 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు.  ఒక్క 25వ తేదీనే 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్థిదారుల పేరుతో..కేవలం ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇంటిని,  రిజిస్ట్రేషన్ చేయించే విప్లవాత్మక పథకానికి తెరలేవనుంది. దీనివల్ల ప్రభుత్వంపై,  7,251,80 కోట్ల ఆర్ధికభారం పడనుంది.

నవరత్నాల హామీలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు.. శరవేగంగా జరుగుతున్న ఈ ఏర్పాట్లకు,  ఎలాంటి ఆటంకాలు రాకుండా చూశారు. అంటే క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదనాలు వచ్చినా.. పేదల గూడు కలను సాకారం చేసేందుకు సర్కారు, రిజిస్ట్రేషన్ శాఖకు సెలవు రద్దు చేయడం విశేషం. ‘జగనన్న ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది. చేసిందే చెబుతుంది. ఇళ్ల కార్యక్రమాలు ముగిసిన తర్వాత సామాన్య, సగటు మనిషి పూర్తి ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో జీవిస్తాడు. మేం లబ్థిదారులతో మాట్లాడుతుంటే, వారిలో కనిపించిన ఆనందంలో మాకు సీఎం జగన్ కనిపించారు’ అని గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.