వైకాపా పట్ల విధేయత కోసం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిందలు    

150

  – భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్దనరెడ్డి విమర్శ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ముఖ్యమంత్రి జగన్‌ పట్ల తన భక్తిని, విధేయతను చాటుకునేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లను విమర్శించడం తగదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్దనరెడ్డి ఆరోపించారు. వైకాపా విధేయుడైనా అయిదేళ్లుగా మేధావి ముసుగులో ఉన్న ఉండవల్లి నేడు భాజపా పట్ల ఉక్రోషంతో బయటపడ్డారన్నారు. అవినీతి, ఆరాచక, వ్యతిరేక విధానాలతో ప్రజల మద్దతు కోల్పోతున్న వైకాపాను బతికించేందుకు ఉండవల్లి వెనుకేసుకువస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో భాజపా బలపడుతుండటంతో ఆ పార్టీలో చేరేందుకు పలువుకు ముందుకు వస్తున్నారని దానిని సహించలేక మేధావులుగా చెలామణి అవుతున్నవారంతా ఇలా భాజపాను, ఆర్‌ఎస్‌ఎస్‌లపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రోత్సహించే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను ఉండవల్లి సరిగా అర్దం చేసుకోలేదని అన్నారు. సంఘ్‌ ఆశయాలు సర్వోన్నతమైనవని దానిని గుర్తించిన మాజీ ప్రధాని నెహ్రూ 1963 రిపబ్లిక్‌డే పెరేడ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. సంఘ్‌ ప్రేరణతో శీలవంతులైన ప్రతిభావంతులకు దేశంలో అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి పదవులు లభించాయని చెప్పారు.