విశాఖ టీడీపీ నేతల భూకబ్జాలపై ‘విజయ’ అస్త్రం!

794

కార్పొరేషన్ కైవసమే వైసీపీ లక్ష్యం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

బంగారం కంటే విలువైన విశాఖ జిల్లా భూములను కొల్లగొట్టిన తెలుగుదేశం నేతలపై , ఇప్పుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. రానున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్‌పై,  వైసీపీ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న విజయసాయిరెడ్డి.. అందులో భాగంగా అధికారంలో ఉండగా, టీడీపీ నేతలు కొల్లగొట్టిన భూములపై దృష్టి సారిస్తున్నారు. ఆ మేరకు ఆయన,  తమ్ముళ్ల భూ కబ్జాలను తవ్వితీసే పనిలో నిమగ్నమయ్యారు. దీనితో భూములు కొల్లగొట్టిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చేందుకు పరుగులు తీస్తున్న వైసీపీ సర్కారు.. దానికంటే ముందే అక్కడ,  శత్రుశేషం లేకుండా చూసుకునే పనిలో ఉంది. అందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి,  శరవేగంగా పావులు కదుపుతున్నారు. సంస్థాగతంగా పార్టీలో ఉన్న అసంతృప్తులను దారికితెచ్చిన విజయసాయి, ఇప్పుడు టీడీపీ నేతలు కొల్లగొట్టిన భూముల వివరాలు సేకరించి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది సహజంగానే ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తోంది.

అందులో భాగంగా..టీడీపీ సీనియర్ నేతలయిన గంటా శ్రీనివాస్ బందువులు,  భరత్ భూ ఆక్రమణలపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సర్కారు..తాజాగా పీలా గోవిందు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూకబ్జాలపై దృష్టి సారించారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు ఆక్రమించిన, 60 ఎకరాల ప్రభుత్వ భూమిపై సర్కారు కొరడా ఝళిపించడం సంచలనం సృష్టించింది. ఆనందపురం మండలంలోని భీమన్నదొరపాలెం  సర్వే నెంబర్ 156లో, 60 ఎకరాల ప్రభుత్వ భూమిని తాజాగా ఆర్డీఓ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 300 కోట్ల పైమాటేనట. కాగా ఆనందపురం మండలం రామవరం గ్రామంలో 99.89 ఎకరాల సర్కారు భూమి చేతులు మారిన యవ్వారంలో,  గోవిందుతో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న,  రిషికొండ అక్రమ నిర్మాణాలను సైతం,  తాజాగా అధికారులు కూల్చివేయడం కలకలం సృష్టించింది. 8వ వార్డు పరిథిలోని సర్వే నెంబర్ 21లోని,  6 సెంట్ల స్థలాన్ని ఆయన కబ్జా చేశారన్న ఆరోపణ టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఉంది. దాని విలువ 2 కోట్లు. అయితే అది రెవిన్యూ రికార్డుల ప్రకారం పోరంబోకు స్ధలం. అక్కడ ఆయన నిర్మించిన రేకుల షెడ్లు, ప్రహరీగోడను అధికారులు కూల్చివేసి, అది ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ బోర్డుకూడా ఏర్పాటు చేశారు.  దీనితో తెలుగుదేశం నేతల వెన్నులో చలి మొదలయింది. అంతకుముందే, టీడీపీ నేత, మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ఆక్రమణ, లోకేష్ తోడల్లుడు భరత్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి టీడీపీ నేతలకు వైసీపీ సర్కారు ఒక హెచ్చరిక సంకేతం పంపింది.

ఇవన్నీ రానున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాంశంగా మార్చడమే లక్ష్యంగా, విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ అగ్రనేతలు అధికారం అడ్డుపెట్టుకుని సాగించిన భూకబ్జాలను ప్రజల దృష్టికి వెళ్లడం ద్వారా, ఆ  పార్టీని అప్రతిష్ఠ పాలుచేసే వ్యూహమే.  అదే సమయంలో, టీడీపీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకుని, వాటిని ప్రభుత్వపరం చేయడం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం రక్షించామన్న సంకేతాలిచ్చేందుకే, విజయసాయిరెడ్డి టీడీపీ నేతల కబ్జాలపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

రాజధాని నగరంగా రూపాంత రం చెందనున్న విశాఖ నగర  పరిథిలో,  సాంకేతికంగా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గత కొద్దికాలం క్రితమే వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ టీడీపీలో ఉన్నా లేనట్లే ఉన్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు  విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ మోకాలడ్డుతున్నారు. రహ్మాన్ వంటి సీనియర్ టీడీపీ నేతలందరినీ, ఆ పార్టీకి దూరం చేయడంలో విజయం సాధించిన విజయసాయిరెడ్డి… రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లోగా, టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మిగిలిన వారి భూకంభకోణాలను వెలికితీయడం ద్వారా, పార్టీని నైతికంగా దెబ్బతీయాలని భావిస్తున్నారు. ఆ రకంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లోగా టీడీపీని భూస్థాపితం చేయడం ద్వారా, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పాగా వేయాలన్నదే విజయసాయిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాత్రమే టీడీపీలో చురుకుగా పనిచేస్తున్నారు.