‘గ్రేటర్’ కాంట్రాక్టర్ల ..గుండె గు‘బిల్లు’

556

కార్పొరేషన్‌లో రు. 300 కోట్ల పెండింగ్
ఇవ్వకపోతే 23 తర్వాత పనులన్నీ బంద్
సిటీలో  అభివృద్ధి పనులకు బ్రేక్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ధనిక రాష్ట్రమయిన తెలంగాణ రాజధానిలో రోడ్డు పనులన్నీ పడకేశాయి. చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.  వారికి చెల్లించాల్సిన దాదాపు 300 కోట్ల రూపాయల బిల్లులు నిలిచిపోవడమే దానికి కారణం. అటు సిబ్బందికి జీతాలు చెల్లించలేక, ఇటు పనుల కోసం తెచ్చిన సొమ్ముకు వడ్డీలు కట్టలేక జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. 23వ తేదీలోగా తమ బిల్లులు అణా పైసలతో సహా చెల్లించకపోతే, మొదలుపెట్టిన పనులే కాదు. టెండరులో వచ్చిన పనులూ కొనసాగించేది లేదని మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అల్టిమేటమ్ ఇచ్చిన ఫలితంగా,  అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు తమ డిమాండ్ల సాధన కోసం.. తొలిసారి  మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా చేయటం చర్చనీయాంశమయింది.  కాంట్రాక్టర్లు ఎప్పుడూ ఈ విధంగా ధర్నా చేసిన దాఖలాలు మునుపెన్నడూ లేకపోవడం ప్రస్తావనార్హం.

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిథిలో.. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు, నాలాల పనులు ఇక అంగుళం కూడా ముందుకు కదిలే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు.  తమకు ఆగస్టు నుంచి రావలసిన 300 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప, పనులు చేసేది లేదని కాంట్రాక్టర్ల అసోసియేయన్,  సర్కారుకు నిర్మొహమాటంగా అల్టిమేటమ్ జారీ చేసింది. చాలాకాలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, పాలకులు పట్టించుకోనందున ఇక తమకు సహాయ నిరాకరణ ఒక్కటే మార్గమని అసోసియేషన్ కుండబద్దలు కొట్టింది. దీనితో, గ్రేటర్ పరిథిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. గ్రేటర్ ఎన్నికల ముందు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట హడివిడి చేసిన మంత్రులు-ఎమ్మెల్యేలు, సగంలో నిలిచిపోయిన పనులపై మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.

ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి,  గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అధికారులు  బిల్లులు ఇవ్వడం నిలిపివేశారు. రోడ్డు నిర్మాణాలు, నిర్వహణ, నాలాల పూడిక తీతతోపాటు, రిపేర్ల పనులన్నీ ఈ కాంట్రాక్టర్లే చేస్తున్నారు. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు, రోడ్లను చిన్నాభిన్నం చేశాయి. దాదాపు నగరంలోని రోడ్ల వ్యవస్థ దెబ్బతింది. శివారు ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానం. దానితో పూర్తిగా దెబ్బతిన్న చోట కొత్త రోడ్లు, పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతుల కోసం 522 కోట్లు అవసరమని,  అధికారులు అంచనా వేశారు. అందులో తొలివిడతగా 250 కోట్లు రూపాయల విలువయిన పనులు ప్రారంభించారు. మరో 170 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు.

కాగా పది శాతం పనులు మాత్రమే పూర్తయి,  ఇంకా 90 శాతం వరకూ  పూర్తికావలసిన తరుణంలో, బిల్లులు చెల్లించడం లేదన్న కారణంతో కాంట్రాక్టర్లు అడ్డం తిరగడంతో అధికారులు తలపట్టుకోవలసి వచ్చింది. కాంట్రాక్టర్లను బుజ్జగించినా ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు.  పైగా 170 కోట్ల విలువయిన పనులకు బిడ్లు దాఖలు కాని పరిస్థితి. మరోవైపు బిడ్లు వేసిన 60 కోట్ల పనులను.. బిల్లులు చెల్లించేంత వరకూ మొదలుపెట్టే ప్రసక్తి లేదని, కాంట్రాక్టర్లు ఖరాఖండీగా తేల్చి చెబుతున్నారు. దీనితో అటు ప్రభుత్వం,  బడ్జెట్ విడుదల చేయకపోవడం, ఇటు  పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోవడం,  ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో, అధికారులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.  అయితే.. ఈ వాస్తవాలేమీ చర్చించకుండానే, 8 నెలల తర్వాత మళ్లీ ఏర్పాటయిన ఉన్నత స్థాయి కోఆర్డినేషన్ కమిటీ.. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

నిధుల విడుదలపై అధికారులు చాలాకాలం నుంచీ ఇస్తున్న హామీలపై,  పూర్తిగా నమ్మకం సడలినందుకే.. ఇకపై పనులు చేయకూడదన్న నిర్ణయానికి కారణమని,  కాంట్రాక్టర్ అసోసియేషన్ చెబుతోంది. తమ డిమాండ్ సాధన కోసం కాంట్రాక్టర్లు, తాజాగా  మల్కాజిగిరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం సర్కిల్ వద్ద   ధర్నా నిర్వహించడం చర్చనీయాంశమయింది. బిల్లుల నిలిపివేత కారణంగా, కాంట్రాక్టర్ల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని,   పనులకు కావ లసిన మెటీరియల్‌ను అప్పులు చేసి కొన్నామని, వాటికి వడ్డీ చెల్లించడం తలకుమించిన భారమవుతోందని అసోసియేషన్  అధ్యక్షుడు ఎస్.భాస్కర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లంతా, ఈ ధర్నాలో పాల్గొని జోనల్ కమిషన్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
తమ వద్ద పనిచేసే సిబ్బందికి  క్రమం తప్పకుండా  వేతనాలు, ఆఫీసు, నిర్వహణ ఖర్చులన్నీ తడసిమోపెడవుతున్నాయన్నది కాంట్రాక్టర్ల వాదన. కరోనా సమయంలో చాలామంది వర్కర్లు వారి సొంత గ్రామాలకు వెళ్లిపోయారని, మళ్లీ తాము వారి స్థానంలో కొత్త వారిని ఎక్కువ వేతనాలు ఇచ్చి పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో వర్కర్లు దొరకడం, వారికోసం వెదకడం గగనమవుతోందంటున్నారు.

ప్రభుత్వం తమ బకాయిలు క్రమం తప్పకుండా చెల్లిస్తేనే, తాము కూడా నిర్మాణ వ్యవస్థను అంతే సక్రమంగా నిర్వహించుకునేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.  మెటీరియల్ కోసం వడ్డీకి తెచ్చిన రుణం పెరుగుతున్నా, మళ్లీ పనులు చేయమని అధికారులు ఒత్తిడి చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న, మధ్య, పెద్ద తరహా కాంట్రాక్టర్లకు సుమారు 350 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉందంటున్నారు. బకాయిలు చెల్లిస్తే తప్ప, తాము కొత్త పనులు చేయలేమని నిర్మొహమాటంగా చెబుతున్నారు.