సమర్థ సద్గురు శ్రీ కాశినాయన

252

నిరతాన్న దానము – సేవ – ప్రేమ – జీర్ణాలయోద్ధరణలను అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మ రక్షణకై అవతరించి వ్యక్తిగత కష్టనష్టాలకు అతీతమైన జీవన యాత్ర సాగించి కుల, మత, జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారిని అర్హతను బట్టి అనుగ్రహించి తన లీలలను ప్రకటిస్తూ చిత్రమైన పాత్రపోషణ గావించి దుర్మార్గులను సన్మార్గులుగా, అవిటి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలసిన వాడు శ్రీ సమర్థ సద్గురు కాశినాయన.

కాశినాయన దూరం – దగ్గర, దగ్గర – దూరం అని బోధిస్తూ “చెప్పి రమ్మన్నారు మాకేల – చెప్పి పోతున్నాము మాకేల” అని సంచరిస్తూ….. ఆర్తితో నాయనా “నీవే దిక్కు” అని అనుకోగానే “తలపులోనే నేను ఉంటాను” అని అభయమిచ్చిన అవధూత కాశినాయన. ఎక్కడా తాను గొప్పవాడినని గానీ, మహత్తు గలవాడినని గానీ ప్రవర్తించలేదు. ఒకతను తన భార్యకు బాగోలేదు ఏదైనా చెయ్యమని అడిగితే…… నేనూ నీలాంటి మనిషినే, నేను వైద్యుడను కాను. ఆరోగ్యము కొరకైతే దేవుడి దగ్గరకు వెళ్ళమని చెప్పారు. నాయన గారికి అంకితమై, కుటుంబమంతా కాశీనాయన సేవలోనే గడిపిన ఒక భక్తుని భార్య అనారోగ్యముగా ఉన్న సమయంలో వారి ఇంటిలో దాదాపు ఇరవై ఐదు రోజులుండి ఆమె ఆరోగ్యము కుదుటపడగానే వారికి కారణం చెప్పి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్లారు.

కాశినాయన గారు విద్యాభ్యాసము తరువాత కాశీలో మూడు సంవత్సరములు ఉండినారు. రెండు పర్యాయములు కాశీకి వెళ్లారు. మహాత్ములు తమలో ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు ప్రదర్శించటానికి, మరియు తీర్థయాత్రలలో ఎలా ప్రవర్తించాలో లోకానికి విదితము చేయడానికి తీర్థయాత్రలు చేస్తారు. కాశినాయన స్వయంగా అన్ని యాత్రలను విధివిధానంగా చేస్తూ తమతో పాటు క్షేత్రాలను దర్శించేవారికి ఏ భావంతో క్షేత్రాలకు వెళ్ళాలి? ఎట్లా వెళ్లాలి? ఏమి తీసుకుని వెళ్లాలి? ఎట్లా ప్రవర్తించాలి? తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉండాలి? అనేవి ప్రత్యక్షంగా ఆచరిస్తూ అనుభవపూర్వకంగా తెలియపరచినారు.

అవతార పురుషులు ఉద్భవిస్తే వాళ్ళ కార్యక్రమాలు నిర్దిష్టంగా ఒకానొక ప్రయోజనానికి ఉద్దేశింపబడి ఉంటాయి. తదనుగుణంగా వారి జీవన విధానమూ ఉంటుంది. కానీ సద్గురువుల జన్మ ఎల్లలులేని అపార కరుణతో లోకాన్నంతా ఉద్ధరించగలదు. అవతార పురుషుల జీవన విధానం సుఖదుఃఖాల సమ్మిళితంగా ఉంటుంది. కానీ మహాత్ములు, జ్ఞానులు అన్ని రకాల ద్వంద్వాలకు అతీతులు. అని అవతార తత్వాన్ని, జ్ఞాని తత్వాన్ని కంచి పరమాచార్యులు వివరించారు. అట్టి కోవలోని వారే కాశి నాయన గారు కూడా. కాశినాయన గారు నెల్లూరు జిల్లా బెడుసుపల్లి గ్రామమునందు పోకనాటి రెడ్ల వంశములో మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు జన్మించారు. వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉపవాస దీక్షతో ప్రార్థనలు సలుపగా ఒకనాటి రాత్రి స్వామి పతివ్రతామ తల్లి అయిన శ్రీమతి కాశమ్మ గారికి స్వప్నంలో సాక్షాత్కరించి “అమ్మా! నీవు సంతానము లేదని చింత పడవద్దు. ఇరువురు సంతానము… ముందు ఆడబిడ్డ, తరువాత కుమారుడు జన్మిస్తారు”. అని అభయమిచ్చి అంతర్ధానమైనారు. అందు కుమారుడు సర్వసంగ పరిత్యాగియై బ్రహ్మానుభూతుడైన పుణ్య పురుషుడు. అతని వలన మీరు కీర్తివంతులగుదురని చెప్పెను.

కొలది రోజులలోనే కాశమ్మ గర్భము ధరించెను. ఒక ఆడ బిడ్డను ప్రసవించెను. ఆమెకు కాశమ్మ అను నామకరణము చేసిరి. మరికొంత కాలము తరువాత తల్లి కాశమ్మ మరల గర్భము ధరించి పుష్యమాసము అమావాస్య (15 – 01 – 1895) రోజున అర్ధరాత్రి యందు బాల భాస్కరుని వలె కాంతి కలిగి ఆజానుబాహుడు, అరవింద లోచనుడైనట్టి కుమారుని ప్రసవించెను. అతనికి కాశిరెడ్డి అని నామకరణం చేసిరి.

కాశినాయనకు నాలుగు సంవత్సరముల ప్రాయమప్పుడు తండ్రి సుబ్బారెడ్డి అకాల మృత్యువాత పడెను. బెడుసుపల్లిలో ఆదరించు వారు ఎవరూ లేనందున కాశమ్మ పుట్టెడు దుఃఖముతో తన తల్లి గారి ఊరయిన కొత్తపల్లికి పిల్లలను తీసుకుని వెళ్ళను. కొద్ది దినములకు తల్లి కాశమ్మ కూడా మరణించెను. పిల్లల పోషణ అవ్వ, తాతలు తీసుకుని అతి గారాబంగా పెంచుచుండిరి. అవ్వనే ‘అమ్మ’ అని సంబోధిస్తూ ఉండేవారు కాశినాయన. అక్షరాభ్యాసము చేయు ప్రాయము రాగానే అవ్వ బాలమ్మ కాశినాయనను సకల శాస్త్ర పారంగతుడైన శ్రీ వేమూరి రామయ్య గారి వద్దకు పంపెను. అప్పటినుండి గురు భక్తి కలిగి వేకువఝామునే లేచి భగవంతుని ప్రార్ధించి గురువుల వద్దకు వెళ్లి శ్రద్ధాసక్తులతో గురువుల వద్ద కూర్చుని వెలి బూడిదలో అక్షరములు దిద్దుతూ అతి త్వరలోనే బాల్య విద్యాభ్యాసమును పూర్తి చేసి సంస్కృత భాషలోని అమరకోశము మూడు కాండలు, నరసింహ శతకములోని పద్యాలు చక్కగా గురు ముఖతః కంఠస్థం చేసి, భారత, రామాయణ, భాగవతములను అవగాహన చేసికొనిరి. రోజూ విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారు. తను చదువుకుంటూ పిల్లలకు చదువు నేర్పించేవారు.

కాశినాయన గారికి సుమారు ఇరువది సంవత్సరముల వయసు రాగానే అవ్వ కాశినాయన వివాహము చేయదలచి నాయనా! నీవు వివాహము చేసుకోవాలి అని చెప్పినది. కానీ కాశినాయన గారు మౌనంగా విని ఊరుకున్నారు.

ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చి నాయన గారి ముఖకవళికలను చూచి భవిష్యత్తులో గొప్పవాడవుతాడని చెప్పి వెళ్లిపోయినాడు. ఒకరోజు బావిలోకి దూకి అరగంట సమయం గడిచినప్పటికీ బయటకు రాకపోవుటచే ఒడ్డున ఉన్న రైతు హృదయములో భయాందోళనలు చెలరేగి తడబడు కాళ్ళతో గ్రామస్తులకు వెళ్లి వివరించెను. గ్రామస్తులు గజ ఈతగాళ్లతో, వెదురు గడలతో, నిచ్చెనలతో వచ్చి బావినంతా గాలించిననూ కాశీనాయన గారి జాడ కనిపించలేదు. అందరూ చింతాక్రాంతులై బావి ఒడ్డున కూర్చుండిరి. ఇంతలో కాశినాయన నీటి ఉపరితలంపై పద్మాసనంలో, ప్రకాశవంతమైన వెలుగులో కనిపించెను. జనంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసి ఊరి వారంతా సంబరపడిపోయారు. నాయన గారు సామాన్యుడు కాడని, మహా మహిమాన్వితుడని సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రామస్తులందరూ గ్రహించినారు.

అట్టి కాశీనాయన కూడా లోకాచారాన్ని అనుసరించి సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వద్ద శిష్యునిగా చేరిరి. శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారు మహిమలను చూపుచూ, ఆశీస్సులను ఇచ్చుచూ శిష్యులకు జ్ఞాన బోధ చేయుచుండిరి. గురువు గారి వద్ద శాస్త్ర ధర్మాన్ని, లోకాచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు. తమ గురువుగారైన శ్రీ అతిరాచ గురవయ్య స్వామి వారిచే ప్రేరితుడై గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువాజ్ఞ తీసుకుని నాయన గారు తపో యాత్రకు బయలుదేరినారు. కాశీలో మూడు సంవత్సరములు ఉండినారు. కాశీయాత్ర సందర్భంగా దారిలో ఉన్న అన్ని పుణ్య క్షేత్రములను దర్శించుకున్నారు. నాయన గారు మైసూరు, చిక్ మంగళూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మద్రాస్, బళ్లారి ఇంకా చాలా చోట్ల తిరిగినారు.

కాశీనాయన గారు ప్రత్యక్ష దైవ స్వరూపముగా బిడ్డల గడప గడపనూ సంచరించుచూ శిధిలమైన దేవాలయ కట్టడములను జీర్ణోద్ధరణ గావించి, ఆ క్షేత్రములలో మంచినీటి బోరులను, బావులను త్రవ్వించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలను నెలకొల్పినారు. కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పోరుమామిళ్ల దగ్గర లింగమయ్య కొండమీద లింగమయ్య కొండ ఆశ్రమం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానందాశ్రమము, కోట గొట్ల నందు గని క్షేత్రంలో గని ఆశ్రమము, గంగన్న పల్లి మెట్ట ఆశ్రమము, గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమము, సీతారామపురం ఆశ్రమము, నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమం, ఉదయగిరిలో లింగాల దొనలో అన్నదాన క్షేత్రములను నెలకొలిపినారు. నేటికీ నిరంతరాయముగా అన్నదాన కార్యక్రమాల నిర్వహణ జరగడం కోసం పోషకులను నియమించినారు. ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్త్యం తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాతా మహాత్మ్యమును వివరిస్తున్నారు.

చివరిగా కడప జిల్లాలో నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశినాయన మండలం, వరి కుంట్ల గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒకప్పటి కీకారణ్యంగా చుట్టూ కొండలు ఎత్తయిన మామిడి, రావి, జువ్వి, మేడి, ఊడుగ చెట్ల మధ్య సెలయేళ్లతో ఎంతో రమణీయంగా ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో 1995 డిసెంబరు 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులుగా కాలం చెందినారు.

కాలక్రమంలో అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అనేకచోట్ల కాశినాయన పేరుమీద నిరంతరం అన్నదానం గావించే క్షేత్రాలు వెలసినాయి. దేవాలయాలకు వచ్చిన భక్త జనాలు ఆకలితో బాధపడకూడదని అన్న క్షేత్రాలను స్థాపించి హిందూ ధర్మంలో ఇమిడియున్న సేవ, త్యాగము, దానము అనే గుణాలను అందరికీ అలవాటు చేస్తూ మన నేటి సమాజానికి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనమును తెలియజేసిరి. ఇతర దేశాల వారికి కూడా ఒక ఆదర్శంగా ఈ దేశంలో ఉన్న గొప్ప సాంప్రదాయాన్ని నేటికీ అందిస్తున్నారు.

కాశినాయన గారి లాంటి అవధూతలు మనదేశంలో కొన్ని వేలమంది ఇంకనూ ఉన్నారు. వీరు మన దేశం యొక్క ఆత్మ అయిన ఆధ్యాత్మికత, యోగ ద్వారా సాధారణ వ్యక్తి కూడా మహిమాన్వితుడు కాగలడని నిరూపిస్తూ, మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు ఈ దేశ ధర్మాన్ని, సంప్రదాయాలను అందిస్తున్నారు.

           సేకరణ : లక్ష్మయ్య ఈగ

           (VSK ANDHRAPRADESH)