కేతువు వలన కలిగే దోషాలు-శాంతి మార్గాలు

కేతువు పార్ధివ నామ సంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుంచి అనేక వ్యాదులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది.

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి.. ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం 7 సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి జన్మించిన ఆరంభ దశ కేతు దశ.

కారకత్వం
కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రు బాధలు, దూర ప్రదేశాలు, దేశాలు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. వేదాంతం, తపస్సు, మోక్షం, మంత్ర శాస్త్రం, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసం, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.

వ్యాధుల వ్యాప్తి…
కేతువు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, వ్యాధులను కలిగిస్తాడు. రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడవుతాడు. అజీర్ణం, స్పోటకం, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యం, జ్వరం, వ్రణామలను సూచిస్తాడు కేతువు ఏ గ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగడంలో సమస్యలు సృష్టిస్తాడు.

కేతువు ధ్యానం
లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|
కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||
ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

 కేతు మంత్రము
ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కౌతలే ఐం సాః స్వాహా ||
14 9 16
15 13 11
10 17 11

కేతుయంత్రం
సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చేయాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.

పరిహారం
కేతుగ్రహ పరిహార పూజా కోసం కంచు ప్రతిమ మంచిది.
అధి దేవత – బ్రహ్మ
నైవేధ్యం – చిత్రాన్నం
కుడుములు – ఉలవ గుగ్గిళ్ళు
ప్రీతికరమైన తిథి – చైత్ర శుద్ధ చవితి
గ్రహస్థితిని పొందిన వారం – బుధవారం
ధరించవలసిన రత్నజ్ఞం – వైడూర్యం
ధరించవలసిన మాల – రుద్రాక్ష మాల
ధరించవలసిన రుద్రాక్ష – నవముఖి రుద్రాక్ష
ఆచరించవలసిన దీక్ష – గణేశ దీక్ష
మండపం – జెండా ఆకారం
ఆచరించ వలసిన వ్రతం – పుత్ర గణపతి వ్రతం
పారాయణం చేయవలసినది – శ్రీ గణేశ పురాణం
కేతు అష్టోత్తర శతనామావళి – గణేశ శతనామావళి
దక్షిణగా ఇవ్వాల్సిన జంతువు – మేక
చేయవలసిన పూజ – విగ్నేశ్వర పూజ, సూర్యారాధన
దానం చేయవలసిన ఆహార పదార్ధాలు – ఖర్జూరం, ఉలవలు.

– చింతా గోపీ శర్మ సిద్ధాంతి,
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం),
పెద్దాపురం, సెల్:- 9866193557

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami