‘సోషల్ ఇంజనీరింగ్’లో ‘సోము’ ఫెయిలయ్యారా?

507

కాపు-బ్రాహ్మణ-వైశ్యులకు చోటేదీ?
కమ్మవారిపై ద్వేషమెందుకో?
మాదిగలను దరిచేర్చుకునే వ్యూహమేదీ?
కమలనాధుల అంతర్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజకీయ పార్టీలంటేనే కులాలు-మతాల సమ్మేళనం. సామాజిక సమీకరణంపైనే రాజకీయాలు నడుస్తున్న కాలమిది.  కులాలే పునాదులుగా కదులుతున్న రోజులివి. ఫలానా పార్టీ ఫలానా కులానికి కేరాఫ్ అడ్రసు. ఫలానా కుల నేత ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ సక్సెస్. ఇదీ ఇప్పటి కులం లెక్కలు! అందుకే ఏ ప్రాంతంలో ఏ కులం పెత్తనం ఎక్కువగా ఉంటే, ఆ కులం వారిని పార్టీలు అందలమెక్కిస్తుంటాయి.  ఈ ‘సోషల్ ఇంజనీరింగ్’లో ఇప్పటివరకూ టీడీపీ, వైసీపీ సక్సెస్ అయ్యాయి. కానీ ఏపీ  బీజేపీ నాయకత్వం మాత్రం,  ఈ సోషల్ ఇంజనీరింగ్‌లో ఫెయిలయిందన్నది సీనియర్ల ఆగ్రహం. ఆ విషయంలో అధ్యక్షుడు సోము వీర్రాజుకు,  రాజకీయ అనుభవం-వ్యూహం లేకపోవడమే దానికి కారణమన్నది కమలదళాల ఉవాచ.

క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్టే ఆడాలి. కానీ సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ మాత్రం,  క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతోందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కుల రాజకీయాలకు పుట్టినిల్లయిన ఏపీలో,  రాజకీయాలు దశాబ్దాల నుంచి కులాల చుట్టూ తిరుగుతున్నాయన్నది నిష్ఠుర నిజం. ఆ నిజాన్ని అర్ధం చేసుకున్నందుకే టీడీపీ, వైసీపీ అధికారంలోకి రాగలిగాయి. బీజేపీ నుంచి వెంకయ్యనాయుడు వంటి  అగ్రనేతలు ఢిల్లీ స్థాయికి ఎదిగినా.. ఇప్పటిదాకా నిర్దిష్టంగా ఒక్క కులాన్ని కూడా,  పూర్తి స్థాయిలో సొంతం చేసుకోలేకపోయారు. పోనీ ఆ కాలంలో  సొంతం చేసుకున్న  కమ్మ వర్గాన్ని కూడా,  పూర్తి స్థాయిలో ఆకర్షించుకోవడంలో బీజేపీ విఫలమయింది.

కానీ, ఈసారి అధికారం మాదేనని,  బల్లగుద్ది చెబుతున్న బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం.. సోషల్ ఇంజనీరింగ్ చేయకుండానే, అధికారంపై కలలు కనడంపై సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. వీర్రాజు ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో, కాపు-బ్రాహ్మణ-వైశ్య వర్గాలకు పెద్దగా చోటు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సీనియర్ అయిన వీర్రాజు,  పార్టీపరంగా వివిధ స్థాయిలో పనిచేశారు. అయితే  రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలపాత్ర పోషించకపోవడం, జిల్లా రాజకీయాలకే ఎక్కువ పరిమితం కావడం వల్లనే, ఆయనకు రాష్ట్ర స్థాయిలోని ‘సోషల్ ఇంజనీరింగ్’ వ్యవహారం, తెలిసి ఉండకపోవచ్చని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. సహజంగా సుదీర్ఘకాలం నుంచీ రాజకీయాల్లో ఉంటూ ఎలక్షన్లు చేసిన వారికి, గెలిపించే బాధ్యత తీసుకున్నవారికి మాత్రమే సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యం తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

సోము.. తాను  కాపు అయినందున, ఇక మిగిలిన కాపులు పార్టీకి అవసరం లేదన్న భావనతోనే.. వారికి  పదవులు  ఇవ్వలేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  లేదా మరొక కాపు నేతకు అవకాశం ఎందుకులేనన్న ముందుచూపయినా ఉండాలన్న భావన కనిపిస్తోందన్నది ఆ వర్గ నేతల అనుమానం. ఉదాహరణకు ఉత్తరాంధ్రను తీసుకుంటే… అక్కడ ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తూర్పు/కాపుల సంఖ్య ఎక్కువ. ఏ పార్టీ అయినా ఉత్తరాంధ్ర నుంచి ఆ కులానికే ప్రాధాన్యం ఇస్తాయి. మంత్రులు, ఎంపీలు  కూడా కాపులే ఎక్కువగా ఉండే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కానీ, సోము సారధ్యంలోని కొత్త కమిటీలో ఉత్తరాంధ్ర కాపులకు స్థానం లేదు.  కాపునాడు ఉద్యమ నేత సిఫార్సుతో, కాపు కోటాలో పదవి పొందిన ఓ మహిళ కూడా కాపు కాదని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఉభయ గోదావరి, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కూడా కాపులకు ప్రాధాన్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనకాపల్లి, కాకినాడ, విశాఖ, విజయనగరం, అమలాపురం, నర్సాపురం, ఏలూరు  పార్లమెంటు జిల్లాల నుంచి కూడా కాపులకు ప్రాతినిధ్యం లేదంటున్నారు. కాపుల్లో గుర్తింపు ఉన్న ‘నల్లా’ కుటుంబానికి, మాజీ ఎమ్మెల్యే దొరబాబుకు ప్రాధాన్యం లేకుండా పోయింది. చివరకు బలిజనాడు రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న.. తిరుపతి నేత ఓ.వి. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జనతాదళ్ నేతగా జాతీయ రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన ఆయన,  నద్దా సమక్షంలో బీజేపీలో చేరారు. వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత పడిన తొలి వేటు,  బలిజ నేతదే కావడం విశేషం.  దీన్ని బట్టి పార్టీ చీఫ్‌కు,  సోషల్ ఇంజనీరింగ్‌పై అవగాహన చేసుకునే స్థాయి లేనట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కంభంపాటి హరిబాబు-కన్నా హయాంలోనే కాపులకు ప్రాధాన్యం లభించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇక బ్రాహ్మణ-వైశ్యుల పార్టీగా మొదటి నుంచీ ముద్ర ఉన్న బీజేపీలో.. ఇప్పుడు అసలు ఆ వర్గాలకే ప్రాధాన్యం  లభించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏలూరులో వైశ్య నేత చిన్నం రామకోటయ్య, సినీ నటి కవితకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక పార్టీకోసం ఆర్ధికంగా వనరులు వెచ్చించిన పైడా కృష్ణమోహన్‌తోపాటు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకూ ప్రాధాన్యం లేదు. ఈ  అంశాలు పరిశీలిస్తే,   పార్టీని ఆర్ధికంగా ఆదుకునే వైశ్యుల ప్రాధాన్యంపై అధ్యక్షుడికి ఎంత అవగాహన ఉందో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు,  ఆ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి దశాబ్దాల నుంచీ పట్టణాల్లో బీజేపీ మూలస్తంభాల్లో వైశ్యులు ఒకరు. స్థానిక కార్యక్రమాలను వారే సొంత ఖర్చుతో నిర్వహిస్తుంటారు. చాలా పట్టణాల్లో ఇప్పటికీ బీజేపీని  వైశ్యుల పార్టీ- బ్రాహ్మణుల పార్టీగా పరిగణిస్తుంటారు.

పార్టీని దశాబ్దాల నుంచి అంటిపెట్టుకున్న బ్రాహ్మణ వర్గాన్ని కూడా వీర్రాజు నాయకత్వం , వైశ్యుల మాదిరిగానే దూరం పెట్టారన్న విమర్శలు,  ఆ వర్గం నుంచి వినిపిస్తున్నాయి.  జూపూడి రంగరాజు వంటి సీనియర్‌కే ఆదరణ లేని పరిస్థితి ఏర్పడిందని,  నూజివీడు లక్ష్మీపతిరాజా, చెరకు రామకోటయ్య, నాగభూషణం వంటి నేతలకు స్థానం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.  ఐవైఆర్ కృష్ణారావు వంటి అధికారులు,  ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీర్రాజుకు సన్నిహితంగా వ్యవహరించే చిట్టిబాబు, రామకృష్ణ, శాస్త్రిలో ఒకరు సంఘ్ బాధ్యతలోకి వెళ్లగా, మిగిలిన వారు వీర్రాజు వ్యవహారశైలి నచ్చక, రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చిందట.

ముఖ్యంగా, ఏపీలో అత్యంత బలమైన మాదిగలను ఆకట్టుకునేందుకు వీర్రాజు నాయకత్వం, పెద్దగా ప్రణాళికలేవీ రూపొందిస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు. ఏపీలో మాల-మాదిగల మధ్య వ్యత్యాసం కేవలం నాలుగు లక్షలు మాత్రమే. మాదిగలు తొలి నుంచీ టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో వైసీపీకి జైకొట్టారు. తెలంగాణాలో మాత్రం ఇప్పటికీ మాదిగలు బీజేపీ వైపే ఉన్నారు. కానీ ఏపీలో ఎవరికి దన్నుగా నిలవాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్న మాదిగలను.. తన వైపు ఆకర్షించుకోవడంలో వీర్రాజు నాయకత్వం, విఫలమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు మాత్రమే పరిమితమయిన క్షత్రియులకు, వైకాపాకు మానసిక మద్దతుదారులయిన రెడ్డి సామాజికవర్గానికి కమిటీలో పెద్ద పీట వేయడం బట్టి.. తమ పార్టీ నాయకత్వానికి సోషల్ ఇంజనీరింగ్‌పై , ఎంత అవగాహన ఉందో అర్ధమవుతోందని సీనియర్లు ఎద్దేవా చేస్తున్నారు.

అన్ని కులాలను సమన్వయం చేసుకోవలసిన దళపతి, కొన్ని కులాలపై ద్వేషభావంతో ఉండటంపై  పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.  వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, కమ్మవర్గంపై ద్వేషభావంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. టీడీపీ పతనమయిన నేపథ్యంలో, బీజేపీలోకి రావాలనుకుంటున్న కమ్మ నేతలు.. కేవలం సోము వ్యవహారశైలి వల్లే నిలిచిపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  అదే వర్గానికి చెందిన వెలగపూడి గోపాలకృష్ణ, లంకా దినకర్‌ను సస్పెండ్ చేశారు. వీరిలో వెలగపూడి గోపాలకృష్ణ తన సొంత భూమిని, పార్టీ నిర్మాణం కోసం విరాళంగా ఇవ్వగా, ఆయనను కూడా సస్పెండ్ చేయడం బట్టి.. వీర్రాజు కమ్మ సామాజికవర్గంపై,  ఏ స్థాయిలో ద్వేషంతో ఉన్నారో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడును,  మీడియా చర్చలకు వెళ్లవద్దని నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

చివరకు వెలగపూడి విరాళంగా ఇచ్చిన భూమిలో, పార్టీ ఆఫీసు నిర్మించటం కూడా చేతకావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.  కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పార్టీలో చేరిన వారికి,  ప్రాధాన్యం లేకుండా చేయడంతోపాటు… సుజనా వర్గాన్ని అణచివేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రయత్నాలకు సునీల్ దియోథర్ పరోక్ష సహకారం కూడా ఉందన్న చ ర్చ,  బాహాటంగానే జరుగుతుండటం విశేషం. ప్రస్తుతం వీర్రాజు-దియోథర్-మధుకర్‌జీ ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు బీజేపీ నేతల నోట వినిపిస్తున్నాయి.