రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం

718
  • ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం’ ప్రారంభం:
  • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు వద్ద ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

పైలట్‌ ప్రాజెక్టు చేపట్టిన తక్కెళ్లపాడులో వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దురాయి(సర్వే రాయి) పాతిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కార్యక్రమం ప్రారంభించారు. సర్వేకు వినియోగించే పరికరాలను పరిశీలించిన సీఎం, డ్రోన్లను ప్రారంభించారు.

ఆ తర్వాత జగ్గయ్యపేట చేరుకున్న ఆయన అక్కడి ఎస్‌జీఎస్‌ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు.

‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం’ ప్రారంభ బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం

ఎవరూ సాహసించని కార్యక్రమం:

‘ఇక్కడ ఈ రోజు మీ అందరి ఆప్యాయతల మధ్య, ప్రేమానురాగాలమధ్య ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం మామూలుగా ఏ రాష్ట్రం కూడా, దేశంలో ఎవరూ కూడా సాహసించని కార్యక్రమం. కానీ ఇది జరగాలి. దీని వల్ల మన ప్రజలకు మంచి జరగాలన్న ఆరాటంతో ఏకంగా 16 వేల మంది సర్వేయర్లను గ్రామ, వార్డు స్థాయిల్లోనూ నియమించి, వారందరికీ అత్యుత్తమమైన కోర్స్‌ టెక్నాలజీ, డ్రోన్స్‌ టెక్నాలజీ వంటి వాటిలో వారికి శిక్షణనిచ్చి సర్వే ఆఫ్‌ ఇండియా వారితో కూడా మాట్లాడి వారి భాగస్వామ్యంతో ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం’.

ఆ మమకారం ఎంతో తెలుసు:

‘బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అదే మాదిరిగా భూమి మీద రైతుకు కూడా మమకారం ఉంటుంది. రైతు ఒక్కరే కాదు, కష్టపడి సంపాదించుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఒక ఇల్లు కట్టుకుంటే, ఆ ఇంటి మీద, ఇంటి స్థలం మీద ఎంత మమకారం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ భూమి ఆ రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ఆ చిన్న ఇల్లే ఆ కుటుంబం, తన పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వాలని చెప్పి ఆరాటపడే ప్రాణ సమానం’.

‘నిజంగా రూపాయి రూపాయి దాచుకుని రాత్రనక, పగలనక కష్టపడి సంపాదించుకున్న ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా, మరో భూమి అయినా వివాదంలోకి పోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో, నా కళ్లారా చూశాను’.

ఒక్కసారి ఆలోచించండి:

‘గట్టు జరిపి ఒక రైతు భూమిని ఎవరైనా ఆక్రమిస్తే, ఆ రైతన్న క్షోభ ఎలా ఉంటుందో మనమంతా ఊహించుకోవచ్చు. భూములు ఖాళీగా ఉన్నాయని చెప్పి రాబందుల వంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయడానికి స్కెచ్‌ వేస్తే చట్టపరంగా, న్యాయపరంగా పోరాడే శక్తి లేని ఆ కుటుంబం పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి మనమంతా ఆలోచించాలి. ఈ పరిస్థితిని మార్చాలా? వద్దా? అని నేను మిమ్మల్ని అడుతున్నాను. మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమాని అని ధృవీకరించే వ్యవస్థ ఉండాలా? వద్దా? అని అడుగుతున్నాను. మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా? అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. మీ ఆస్తిని మరొకరు వేరెవరికో అమ్మేసే అవకాశం ఉండకుండా, చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నాను’.

‘మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ కావాలా? వద్దా? ఆలోచించండి. మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారాంలో ఉందో, అదే రికార్డుల్లో కనిపించాలా? వద్దా? ఆలోచించండి. గిట్టని వారు ఎవరైనా లేదా కబ్జారాయుళ్లు రాళ్లు పీకేసినా, గట్టు చెదరగొట్టినా చెక్కు చెదరని పత్రాలు, దాఖలాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటారా?. ఒక్కసారి ఆలోచించండి’.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం:

‘భూమి రికార్డులు శాశ్వతంగా పరిష్కారమై, ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటే పక్కాగా రికార్డులు కావాలి. వీటన్నింటికి సమాధానంగా ఇదే తక్కెళ్లపాడు నుంచి భూముల సర్వేకు, శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం. మీ భూమికి హామీగా ప్రభుత్వం ఉంటుందని హామీ. మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఇవాళ, వైయస్సార్‌ జగనన్న భూహక్కు భూరక్ష కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీ పిల్లలు, వారసులకు చట్టపరంగా ఆస్తులు తగ్గేలా మొన్న అసెంబ్లీలో చట్టం కూడా చేశాం. ఆ మేరకు ఈ సర్వేను ఒక పవిత్ర కార్యక్రమంగా ప్రారంభిస్తున్నాం’.

ఇన్నేళ్లలో ఎన్నెన్నో మార్పులు:

‘100 ఏళ్ల తర్వాత ఇలాంటి సర్వే. తక్కెళ్లపాడులో అన్ని రికార్డులు పెట్టారు. చివరిసారిగా 1927, 1928లో సర్వే జరిగింది. దాదాపు 100 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకులు మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు వచ్చాయి. అన్నీ మన కళ్ల ముందే జరిగాయి’.

‘ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉంటే, ఇవాళ స్మార్ట్‌ ఫోన్‌ లేని మనిషి ఎక్కడున్నాడు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతగా మారిన రోజులో కూడా వందేళ్ల క్రితం బ్రిటిష్‌ వారు 1920లో చేసిన భూముల సర్వే తర్వాత ఒక్కసారి కూడా భూముల సర్వే జరగలేదు అంటే అవి ఎన్నెన్ని అనర్ధాలకు దారి తీస్తూ వచ్చాయంటే అన్నది వేరే చెప్పాల్సిన అవసరమే లేదు’.

ఇవాళ్టి పరిస్థితి ఏమిటి?

‘ఇవాళ భూమి అన్నది దిగజారిన రాజకీయవేత్తలకు, రౌడీలకు గూండాలకు వ్యవస్థలను మేనేజ్‌ చేయగలిగిన వారికి కూడా, తమది కాని భూమి ఒక పాడి ఆవులా మారింది. పోవడం, రికార్డులు మార్చడం, రౌడీయిజమ్‌ చేయడం, జెండా పాతడం. ఇది పూర్తిగా మారిపోవాలి. ఈరోజు వివాదాలలో ఉన్న భూమి మాత్రమే కొంటామని ఏకంగా బ్రోకర్లు, డీలర్లు రాష్ట్రంలో ఒక పద్ధతిగా తయారయ్యారు. ఎక్కడైనా వివాదాలలో ఉన్న భూమి కనిపిస్తే, దాన్ని చాలా తక్కువకు కొనాలని చెప్పి, ఏదైనా భూమి మీద వివాదాలు సృష్టించి తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని చెప్పి ఆరాటపడే బ్రోకర్లు, డీలర్లు, రౌడీలు కనిపిస్తున్నారు. అలాంటి వారి నుంచి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రం రావాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది’.

అందుకే ఈ పథకం:

‘పరుల సొమ్ము పాము అని గతంలో పెద్దవాళ్లు చెప్పే వాళ్లు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే, కబ్జాల భూములతో ఎలా కోట్లకు పడగెత్తాలి అని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చడం కోసమే నా 3648 కి.మీ పాదయాత్రలో నేను చూసిన ఘటనలను, వాటి నుంచి ప్రజలకు మంచి చేయాలి, అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు అని చెప్పి తాపత్రయం నుంచే ఈ కార్యక్రమం వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టాం’.

నాలుగు స్థంభాలాట:

 ‘ఈ పథకం గురించి వివరించే ముందు ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం వ్యవస్థ ఎలా ఉంది అని చూస్తే.. ఏదైనా భూమికి సంబంధించి వ్యవహారాలు, వివరాలు కావాలంటే, అవి ప్రస్తుతం నాలుగు శాఖల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, రిజిస్ట్రేషన్‌ శాఖలు, స్థానిక సంస్థల వద్ద భూములు, ఆస్తుల వివరాలు ఉంటున్నాయి’.

‘ఒక భూమికి సంబంధించి హక్కుదారుడు ఎవరో తెలుసుకోవాలంటే రెవెన్యూ శాఖకు వెళ్లాలి. ఆ భూమిని ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారా లేక తనఖా పెట్టారా అని తెలుసుకోవాలంటే, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు పోవాలి. ఆ భూమికి సంబంధించి ఏమైనా సబ్‌ డివిజన్‌ జరిగిందా, స్కెచ్‌ కావాలంటే సర్వే శాఖకు పోవాలి. ఒక ఇంటికి సంబంధించిన కొలతలు, పన్నుల వివరాలు తెలుసుకోవాలంటే స్థానిక సంస్థలకు పోవాలి. ఇలా అన్నీ ముడిపడి ఉన్నాయి’.

‘కుడి చేయి చేసే పని ఎడమ చేయికి కూడా తెలియనట్లుగా, ఎవరికి వారు, నాలుగు శాఖలు పని చేస్తున్నాయి. వాటి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భూవివాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. భూవినియోగం, భూమిపై హక్కుల గురించి తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడు ఇన్ని శాఖల మధ్య తిరగాల్సి వస్తా ఉంది. అలాగని ఇందులో ఏ ఒక్క శాఖకు భూమికి సంబంధించిన టైటిల్‌ నిర్ధారణ బాధ్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆర్డీఓలు, పోలీసులు, సివిల్‌ కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు’.

భరోసా లేదు:

‘భూమి కొనుగోలు చేసిన ఏ వ్యక్తి అయినా డబ్బు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు కాబట్టి ఆ భూమి ఖచ్చితంగా అతనిదేనా అని అంటే… అవునూ అని ఖచ్చితంగా ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి వుంది. డబ్బు కట్టి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాను కాబట్టి అవును ఆ భూమి నాదే అంటే…  అవునూ ఆ భూమి నీదే అని ఖచ్చితంగా సమాధానం ఇచ్చే పరిస్థితి ఈ వ్యవస్థలో లేదు. సమస్య ఏమిటీ అంటే ఇప్పటి వరకు వున్న చట్టాల ప్రకారం భూమి కొనుగోలు చేసే వ్యక్తే ఆ భూమికి హక్కుదారుడైన యజమాని ఎవరూ అని తెలుసుకోవాలి. ఒకరు కొనడం, మరొకరు అమ్మడం జరుగుతోంది కాబట్టి రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ఆదాయం వస్తోంది. కాబట్టి ఆ భూమి కొలతలు ఏమిటీ? యజమాని ఎవరు? నిజమైన యజమానే అమ్ముతున్నాడా అనే ప్రశ్నలతో నిమిత్తం లేకుండా గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి’.

‘భూమి ఒకరి నుంచి మరొకరికి మారినప్పుడు దానిని సర్వే చేయడం, యాజమాన్య మార్పిడి, వారి పేర్లు, రికార్డుల్లో నమోదు చేయడం వంటివన్నీ జరగాలి. కానీ అలా జరగడం లేదు. అందువల్ల అసలైన పట్టారుదారు ఎవరు? సాగుదారు ఎవరు? సర్వే నంబర్‌ ప్రకారం రికార్డుల్లో నమోదైన భూమి వాస్తవంగా ఉందా? కాగితాల్లో వున్న విస్తీర్ణం కంటే ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం ఎక్కడా లేదు. కాబట్టే ఒక భూమిని ఇద్దరూ, ముగ్గురు అమ్మిన సందర్భాలను మనం చూస్తున్నాం’.

పరిస్థితిని మార్చేందుకే..:

‘ఈ పరిస్థితిని నివారించేందుకు భూహక్కు, భూరక్ష పథకాన్ని ఈరోజు తీసుకువస్తున్నాం. గతంలో ఉన్న పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, మన రాష్ట్రం ల్యాండ్‌ రికార్డుల్లో ఒక మోడల్‌గా ఉండాలని చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా లావాదేవీలు జరిగితే భూతద్దం వేసి వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం’.

ఈ కార్యక్రమం ఇలా..:

‘భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుందంటే..

ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం ఆ భూయజమానికి ఇస్తాం. దానితో పాటు అంగుళాలతో సహా నిర్థారించిన భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్‌ పరిధిలో ఒక విలేజ్‌ మ్యాప్‌ వుంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్‌ నెంబర్‌ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్‌ ఐడి నెంబర్‌ కూడా కేటాయిస్తారు. అంటే ఆ నెంబర్‌తో సదరు  భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది’.

‘దీనిని సోషల్‌ ఆడిట్‌ కోసం అభ్యంతరాలు వుంటే తెలియచెప్పేందుకు అదే గ్రామంలోని సచివాలయాల్లో, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. దీనిపై తరువాత ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే కొద్ది రోజుల తరువాత భూయజమానికి శాశ్వత టైటిల్‌ ఇస్తారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఒకేచోట ఉండేలా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా చేస్తారు. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. నూతన విధానం ద్వారా భూవివాదాలకు శాశ్వతంగా ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే తక్కిళ్ళపాడు గ్రామంలో ఈ ప్రక్రియ ద్వారా భూముల సర్వే పూర్తి చేసి, రాష్ట్రం అంతటికి ఆదర్శంగా ఈ గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేశాం’.

మూడు దశల్లో సర్వే:

‘రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కూడా కొలిచే ఈ సర్వే మూడు దశల్లో పూర్తి అవుతుంది. సర్వేకు అయ్యే ఖర్చులో ఒక్క పైసా కూడా రైతు, భూయజమానులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. సర్వే రాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటోంది. ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యం ఉంది’.

‘దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం చేపట్టగా, 4500 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే చేస్తున్నాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్ణీత కాలంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తాం. 2023 నాటికి చివరి, వార్డు, గ్రామంలో కూడా ఈ సర్వేను పూర్తి చేస్తాం. సర్వే పూర్తి చేసి, టైటిల్‌ మీద పూర్తి క్లారిటీతో కూడిన పత్రాలు అందచేస్తాం’.

సర్వే కార్యక్రమం ఇలా..:

‘భూహక్కు, భూరక్ష సర్వే ఎలా జరుగుతుందంటే.. గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూల్, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ, వార్డు పరిధిలో ప్రజలకు వివరించడం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో సర్వే బృందాలతో భూముల సర్వే చేస్తారు. ఇందుకోసం డ్రోన్, రోవర్, కోర్స్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్థిని అత్యంత ఖచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వేతో రెవెన్యూ రికార్డులు తయారవుతాయి. ప్రతి యజమానికి ఈ డిజిటల్‌ రికార్డుల వివరాలు నోటీస్‌ ద్వారా తెలియచేస్తారు. ఈ రికార్డుల్లో నమోదైన వివరాలపై ఏవైనా అభ్యంతరాలు వుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఈ అప్పీళ్ళను సత్వరం పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒక మోబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం’.

‘ఇలా భూసర్వే పూర్తయిన తరువాత యజమానుల ఆస్తికి శాశ్వత ఆస్థిహక్కు పత్రాలను అందచేస్తాం. ప్రతి భూమికి ఒక యూనిక్‌ ఐడి నెంబర్‌ ఇవ్వడం జరుగుతుంది. భూకమతం పటంతో పాటు గ్రామంలోని భూముల పటం, రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్, 1–బి రిజిస్టర్‌ వంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు డిజిటల్‌ రూపంలో నాలుగు చోట్ల ఉంటాయి. వాటిని ట్యాంపర్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. డిజిటల్‌తో పాటు హార్డ్‌ కాపీ కూడా భూజయమానులకు ఇస్తాం.

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు:

‘ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాల రిజిస్ట్రేషన్లు ఇక ఆయా గ్రామ సచివాలయాల్లోనే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎంత మంచి జరుగుతుందో చెప్పనకరలేదు. మీ భూముల సర్వే, ఇతర అన్ని వివరాలు అక్కడే లభిస్తాయి. అదే సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి అవకతవకలు జరగవు’.

శాశ్వత భూహక్కు, భూరక్షలో ప్రత్యేకత:

‘రాష్ట్రంలో ఏ రైతు అయినా 2019లో చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తరువాత ఆ భూమి మీద హక్కు లేదని తేలితే, రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తుందనే గ్యారెంటీ ఇస్తున్నాం. దీని కోసం ఒక చట్టంనే తీసుకువచ్చాం. ఇటువంటి చట్టం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రం దీనికి మొట్టమొదటిగా నాంది పలుకుతోంది. ఇది జరిగితే ఆంధ్రరాష్ట్రంలో భూములు కొనుగోలు చేసే వారు ఎక్కడా చూసుకోవాలసిన పనిలేదు. ఆంధ్రరాష్ట్రంలో భూములు కొంటే అది గోల్డ్‌ స్టాండర్డ్‌ అని నిర్థారణ అవుతుంది. ఆంధ్రరాష్ట్రంలో

మొదలైన ఈ విప్లవం దేశమంతా ప్రభావం చూపుతుంది. ఏపీ ఒక మోడల్‌ గా నిలుస్తుంది. ప్రస్తుతం భూ యజమానులకు భూములపైన ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి తప్ప పూర్తి హక్కులు లేవు. మన భూరక్ష– భూహక్కు పత్రం ద్వారా అలాంటి హక్కులు కంక్లూజివ్‌ టైటిల్‌ (సమగ్ర టైటిల్‌) హక్కులు లభిస్తాయి’.

ఇంకా ఏం జరుగుతుంది?:

‘సర్వే వల్ల జరిగే ప్రయోజనాలు మీ పొరుగువారికి తెలియచెప్పాలి. పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా, మీ గ్రామంలో, మీ ముందు, ఇకపై అన్ని భూలావాదేవీలు జరుగుతాయి. తెలియని వారికి ఈ మంచిని గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను ఈ స్కీంలో పూర్తిగా దోషరహితంగా సక్రమంగా తీర్చిదిద్దుతారు. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు తయారవుతాయి. సబ్‌ డివిజన్లు అన్నీ నమోదు అవుతాయి. ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా హద్దురాళ్ళు లేకపోవడం వల్ల సరిహద్దు తగాదాలు కోర్టుల వరకు వెళ్లడం చూస్తున్నాం. ఈ సర్వేతో ప్రతి సర్వే నెంబర్‌ కు, ప్రభుత్వ ముద్రతో కూడిన సర్వే రాళ్ళను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ముద్రతో ఉండే ఈ రాళ్ళను ప్రభుత్వమే ఉచితంగా రైతులకు, యజమానులకు అందిస్తుంది. దీనితో సరిహద్దు వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ప్రబలంగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను’.

వివాదాల పరిష్కారం–పారదర్శకత:

‘రాష్ట్రంలో కొన్ని చోట్ల కొందరికి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే.. అనుభవిస్తున్న భూమి మరో చోట ఎక్కడో ఉంటోంది. ఇలాంటి లోపాలను అన్నింటినీ సర్వే ద్వారా పూర్తిగా సరిదిద్దడం జరుగుతుంది. భూమికి సంబంధించిన సబ్‌ డివిజన్‌ సమస్యలు తొలగిపోతాయి. ఇకపై ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయి. మరింత పారదర్శకం, సులభంగా చేసే పరిస్థితి దీని ద్వారా వస్తుంది. వ్యవస్థలో నిజాయితీని తీసుకువస్తామనే మాటకు కట్టుబడి 18 నెలల పాలనలో  మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా చేస్తూ వచ్చాం. దీనిలో భాగంగా ఇప్పిటికే జుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసుకువచ్చాం. వీటి ద్వారా దేశ చరిత్రలోనే అవినీతిరహిత విధానంలో ముందడుగులు వేశామని గర్వంగా మీ బిడ్డగా చెబుతున్నాను’.

‘ఇప్పుడు స్థిరాస్తికి సంబంధించి అవకతవకలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తా ఉన్నామని కూడా చెబుతున్నాను. తరతరాలుగా ఉన్న సమస్యల పరిష్కారానికి బాటలు వేసే సర్వే ఇది. ఇరుగుపొరుగు మధ్య వివాదాలకు తావు లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టే సర్వే ఇది. మీ వారసులు, మీ పిల్లలకు ఎలాంటి వివాదాలకు తావు లేని టైటిల్‌ అందజేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం. అంగుళాలే కాదు, మిమీ తో సహా సర్వే ఆఫ్‌ ఇండియాతో కలిసి సరిహద్దులు ఖరారు చేస్తున్నాం’.

రాక్షసులు యజ్ఞం చెడగొడతారు:

‘ఇది ఒక యజ్ఞం. దేవతలకు కూడా రాక్షసుల బెడద తప్పలేదు. దేవతల యజ్ఞం చెడగొట్టడానికి రాక్షసులు ప్రయత్నించడం మనమందరం విన్నాం. మనుషులమైన మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకు కూడా కొందరు రాక్షసులు ఉన్నారు. ఆ దెయ్యాలు, రాక్షసులు ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు. మన కర్మకొద్దీ ఆ దెయ్యాలు, రాక్షసులకు ఎల్లో మీడియా అని ఒక పేరు పెట్టుకుని ఇదే రాక్షసత్వం చేసే కార్యక్రమం కూడా జరుగుతోంది. వీరంతా తప్పుడు ప్రచారం చేస్తారు. తప్పుడు రాతలు రాస్తారు. తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు రాతలు రాసి ఈ మంచి కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు రకరకాలు కుయుక్తులు పన్నుతారనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి’.

ప్రభుత్వం గ్యారెంటీ:

‘ఇవాళ మీ అందరికి కూడా, మీ భూమికి మీరే శాశ్వత యజమానులుగా ఎవరూ మార్చలేని టైటిల్‌ను ప్రభుత్వం నష్టపరిహారానికి గ్యారెంటీ ఇచ్చి మరీ సర్వే చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతా ఉన్నామనేది కచ్చితంగా గుర్తించమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను’.

‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం మీకు మంచి మాత్రమే చేస్తుందని మరోసారి స్పష్టం చేస్తూ  వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంతో రైతులు, స్థిరాస్తి కలిగిన ప్రతి ఒక్కరికి మరింత భద్రత, భరోసా కలగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’.

జగ్గయ్యపేటకు వరాలు:

‘కాసేపటి క్రితం భాను అన్న (జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను) మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా ప్రకటించమని కోరారు. దీనికి అన్ని అర్హతలున్నాయి. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తాం. ఉత్తర్వులు కూడా ఇస్తాం ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనం కోసం రూ.5 కోట్లు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం రూ.15 కోట్లు, రూ.3 కోట్లతో ట్రామా కేర్‌ సెంటర్‌ కావాలన్నారు. అన్నీ మంజూరు చేస్తున్నాము. ఎర్రకాలువ, వేపలవాగు అభివృద్ధి కోసం రూ.5 కోట్లు అడిగారు. అవి కూడా ఇస్తున్నాం. జగ్గయ్యపేటకు ప్యాసింజర్‌ రైలు కావాలని అడిగారు. అది మన చేతుల్లో లేదు. కేంద్రానికి లేఖ రాస్తాం. రూ.486 కోట్లు మంజూరు చేసి, ఇక్కడే వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం చేపట్టిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను’.

అంటూ సీఎం  వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కొందరు భూయజమానులకు ఫీల్డు మ్యాప్, భూయాజమాన్య హక్కు పత్రం (1బీ), స్థలాలు, ఇళ్ల వంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు (ఆస్తి పత్రం) అందజేశారు.

డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)తో పాటు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీష్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.