‘సర్వే’కు ‘శత’మానంభవతి

104

వందేళ్ల చరిత్ర సృష్టించిన జగన్
గ్రామాల్లో భూముల పంచాయితీకి తెర
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీ సీఎం జగన్ ఏదైనా అనుకున్నారంటే చేసేస్తారంతే. ఆలోచన రావడమే తరువాయి. ఇక అమలు చేసేదాకా ఏదీ వదలరు.పెన్షన్లను ఇంటివద్దకే ఇచ్చే విప్లవాత్మక నిర్ణయం.గ్రామ సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం.ఇప్పుడు వందేళ్ల తర్వాత,చరిత్ర సృష్టించిన భూముల  ‘రీ సర్వే’  ప్రక్రియ కూడా అంతే. వందేళ్ల చరిత్రలో, దేశంలో  ఏ రాష్ట్రం కూడా తలపెట్టని చరిత్రాత్మక కార్యక్రమం భూముల రీ- సర్వే.  ఇదో చరిత్రగా నిలిచిపోతుంది. కార్స్, డ్రోన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, జగన్ సర్కారు ఈ ప్రాజెక్టు పూర్తి చేయనుంది. ముందు ఏ కార్యక్రమం తలపెట్టినా బాలారిష్టాలు తప్పవు. దాన్ని అధిగమించి లబ్థిదారుల పెదవులపై చిరునవ్వులు పూయించిన వాడే మొనగాడు. ఇప్పుడు ఆ మొనగాడు సీఎం జగన్.

యస్. రాష్ట్రంలో 17,461 గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ-నగరాభివృద్ధి సంస్థల్లోని భూములు- ఇళ్లు- స్థలాలను సర్వే చేసి,  వాటికి హద్దులు కూడా ప్రభుత్వమే నిర్ణయించి యజమానులకు, హక్కు పత్రాలివ్వాలన్న వినూత్న ప్రాజెక్టు ఇది. గత వందేళ్లలో ఇలాంటి సరికొత్త ప్రాజెక్టు, ఏ పాలకుడి మదికీ తట్టకపోవడమే ఆశ్చర్యం. దానిని జగన్ ఏపీలో అమలుచేసేందుకు అడుగులు వేస్తున్నారు. దానికోసం సర్వేయర్లతో చేస్తున్న మహాయజ్ఞమే భూముల రీ సర్వే. ఇది భవిష్యత్తులొ అన్ని రాష్ట్రాలకూ ఒక మార్గదర్శిలా మారనుంది.

ఈ రీసర్వేలో యజమానులు తమ వద్ద ఉన్న ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. సహజంగా సర్కారు ఏ పథకం తలపెట్టినా, లబ్థిదారుల నుంచి ఆధారాలు అడగటం రివాజు. దాని కోసం వారు పడే పాట్లు వర్ణనాతీతం.  కానీ జగన్ సర్కారు తెరలేపిన ఈ రీ సర్వే ప్రక్రియకు, అలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. రెవిన్యూ శాఖ వద్ద ఉన్న రికార్డుల ప్రకారమే, రీసర్వే జరగడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. దీనివల్ల గ్రామాల్లో సుదీర్ఘకాలం నుంచి వివాదాల్లో నానుతున్న భూముల సమస్యకు, శాస్త్రీయమైన పరిష్కారం లభించనుంది. ఇప్పటికీ ఎవరి భూములు ఎంతో, ఏది ప్రభుత్వ-ప్రైవేటు భూమినో తెలియక తికమక. దాని స్పష్టత కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న వైనం.

జగన్ సర్కారు రూపొందించిన ఈ వినూత్న కార్యక్రమంతో, ఇక ఈ తికమకకు తెరపడనుంది. దీనికోసం రాష్ట్రంలో 70 బేస్ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నారు. దీనిని ప్రయోగాత్మంగా ప్రారంభించేందుకు,  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడు గ్రామం వేదిక కానుంది. అక్కడి నుంచే సీఎం జగన్ పట్టాలివ్వడం ద్వారా,  ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడే భూ యజమానులకు భూమి హక్కుపత్రం, ప్రాపర్టీ కార్డు అందచేయనున్నారు. ఇక ఆ తర్వాతనే ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. దానికోసం 13 జిల్లాలను ఎంపిక చేశారు. జగన్ సర్కారు ఇప్పటివరకూ అమలుచేసిన అనేక సంస్కరణల్లో.. ఈ రీ -సర్వే ఆయనను, గ్రామీణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలపనుంది.