కమ్మ పోయి..రెడ్డి వచ్చె ఢాం..ఢాం..ఢాం!

405

ఒకటి తిట్టి  వంద తిట్టించుకుంటున్న  తెలుగుదేశం
విరుచుకుపడుతున్న వైసీపీ సోషల్ మీడియా దళం
( మార్తి సుబ్రహ్మణం- 9705311144)

ప్రజాస్వామ్యం.. సామ్యవాదం.. లౌకికవాదం. ఇలాంటి మెరమెచ్చు వాదాలు ఎన్ని ఉన్నా,   అమలులో ఉంది మాత్రం కులవాదమే. ఇది మనం మనుషులం అన్నంత నిజం!  అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు,  ఫలానా కులం వారిని అందలమెక్కించాయన్న పార్టీలే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత,  అదే చెప్పుల్లో కాళ్లు పెడుతున్న కుల సంస్కృతి. నాటి నుంచి నేటి వరకూ ఇదే సంస్కృతి విజయవంతంగా కొనసాగుతోంది. మళ్లీ దీనిపై తర్క-వితర్కాలొకటి. బుద్ధీ-బుర్రా లేకుండా!

ఏ కులం అధికారం వెలగబెట్టినా.. వారి చుట్టూ కమ్ముకున్న వ్యాపారవేత్తలు- పారిశ్రామికవేత్తలు- అనుచరులు- నాయకులకు తప్ప, మొత్తంగా ఆ కులం వారికి వచ్చేదేమీ లేదు.  ఎవరి కష్టం వారు చేసుకోవలసిందే. ఎవరి జీవనపోరాటం వారిదే. వారికి కష్టం-నష్టం వస్తే ఎవరికివారు ఓదార్చుకోవలసిందే తప్ప, అధికారంలో ఉన్న ఆయా ‘కులపతులు’ వచ్చి ఓదార్చేదేమీ ఉండదు.. ఇదీ నిత్య జీవితంలో కనిపించే సత్యం! అందుకే  ఏపీ  ఇప్పుడు.. కమ్మ పోయి రెడ్డి వచ్చె ఢాం ఢాం ఢాం అన్నట్లుగా తయారయింది.

‘ఏపీలో రెడ్డిరాజ్యం నడుస్తోంది. అన్ని రంగాల్లోనూ రెడ్డి వర్గానిదే హవా. యూనివర్శిటీ వీసీలలో 83 శాతం, సలహాదారుల్లో 71 శాతం వాళ్లే. 712 నామినేటెడ్ పోస్టులు రెడ్లకే ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాదుల్లో 16 మంది, వర్శిటీ సెర్చి కమిటీల్లో 9మంది వాళ్లే. సీఎంఓ, సలహాదారుల్లో అంతా రెడ్లే. ఇదేనా సామాజిక న్యాయం? పనికిరాని పోస్టులు బీసీలకు ఇచ్చి, లాభం ఉండే పోస్టులన్నీ రెడ్లకే ఇచ్చారు’- ఇదీ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజా ఆరోపణ.  సరే… దానిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం, సహజంగానే తెలుగుదేశం గురిగింజ తనాన్ని ఎండగట్టింది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ చేసిన ‘కమ్మసేవ’ను మరోసారి గుర్తుచేసింది. ఒకటి తిట్టి పది తిట్టించుకోవడం అంటే ఇదే!పోనీ ఇన్ని ఆరోపణలు చేస్తున్న టీడీపీ కోయిలలు ఏమైనా పరిశుద్ధాత్మలా అంటే.. అదీ కాదాయె! టీడీపీ కూడా ఆ తాను ముక్కనే కదా? అంతకుముందు వైఎస్. ఆయనను చూసి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయనను చూసి, రెట్టించిన ఉత్సాహంతో జగన్.  ఎవరికి వారు ‘కులపతులు’గా మారిన వైనం.  చంద్రబాబు తనకు కావలసినవన్నీ ‘ప్రజాస్వామ్య’ పద్ధతిలో లాగించేవారు. అంటే డెమోక్రటికల్‌గా కనిపిస్తారు.  కానీ  వైఎస్ అండ్ సన్ మాత్రం, తాము అనుకున్నది నేరుగా  చేస్తారు. కాకపోతే ఒకరు తక్కువ. మరొకరు ఎక్కువ. అదే తేడా! కొత్తగా తెరపైకి..  చంద్రబాబు పక్కన ‘చౌదరి’, జగన్ పక్కన ‘రెడ్డి’ అనే భుజకీర్తులే ‘అదనపు ఆభరణాలు’గా తెరపైకొచ్చాయి. మిగిలిన ‘సేవ’లన్నీ సేమ్ టు సేమ్.

టీడీపీ అధికారంలో ఉండగా.. ఎన్‌ఆర్‌ఐ పదవుల నుంచీ, క్యాటరింగు కాంట్రాక్టుల వరకూ అన్నీ కమ్మవారికే ధారాదత్తం చేశారన్నది..  ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆరోపణల తర్వాత కొత్తగా మళ్లీ తెరపైకొచ్చిన పాత చర్చ. విజయవాడ-అమరావతి కేంద్రంగా టీడీపీ సర్కారు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో క్యాటరింగ్ అంతా సొంత కులానికే సమర్పించుకున్నారట. చంద్రబాబు కుటుంబం-పార్టీకి,  వాస్తు గట్రాలు చూసే కమ్మ పురోహితుడికి సీఆర్డీఏలో సర్కారీ జీతంతో,  కన్సల్టెంటుగా నియమించిన విషయం వైసీపీ దళం పుణ్యాన మరోసారి తెరపైకొచ్చింది. నిజానికి ఈ విషయం అప్పట్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు, రెడ్లపై చేసిన ఆరోపణ తర్వాత వైసీపీ సోషల్‌మీడియా దళం, ఈ నిజాన్ని వెలికితీసింది. మీడియా నుంచి అన్ని రంగాల్లోనూ పరిమళించిన ‘కమ్మదనం’పై,  వైసీపీ దళం తవ్విన వివరాలు సహజంగానే టీడీపీకి నైతిక సంకటమే.

మీడియా రంగానికి సంబంధించి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, ఈనాడుతోపాటు మరికొన్ని ‘కులపతు’ల చానెళ్లకు ధారపోసిన,  కోట్లాదిరూపాయల యవ్వారంపై ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. సమాచార శాఖ బడ్జెట్టంతా నాకేసిన కమ్మ మీడియా చెబుతున్న,  నేటి సుద్దులను తూర్పారపడుతోంది. ఎన్నికల ముందు రెడ్డి కులం నుంచి ఉన్న,  ఒకే ఒక కలెక్టర్ ధనుంజయరెడ్డిని పక్కనపెట్టిన వైనాన్ని గుర్తుచేస్తోంది. కన్సల్టెంట్ల పేరుతో చేసిన కమ్మసేవను నిలదీస్తోంది. ఆ రకంగా.. అచ్చెన్నాయుడు కదిపిన రెడ్డిరాజ్యం అనే తేనెతుట్టె.. చివరాఖరకు కమ్మవర్గానికి శూలాల్లా త గలక తప్పడం లేదు.

కేంద్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న  అశోక్‌బాబు, సాంబశివరావు, కోటేశ్వరమ్మ, గంటా సుబ్బారావు, సంధ్యారాణి, జెఏ చౌదరి, రాజమౌళి, జాస్తి కృష్ణకిశోర్, కృష్ణమోహన్,  వెంకయ్యచౌదరిని ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకువచ్చిన వైనాన్ని వైసీపీ దళం ఇప్పుడు తవ్వితీసింది.  వేమూరి హరికృష్ణ ప్రసాద్,  ఉదయభాస్కర్, శ్రీనివాసులునాయుడు, కుటుంబరావు, దమ్మాలపాటి శ్రీనివాస్, జీవీ కృష్ణారావు వంటి వారికి సలహాదారు, న్యాయపదవులిచ్చిన విషయాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది. ఫైబర్‌నెట్, స్కిల్ కార్పొరేషన్లు కమ్మవారికి ధారాదత్తం చేసిన నాటి చరిత్రను గుర్తు చేసింది.  పోలీసు శాఖలోనూ కమ్మ కులానికే బాబు సర్కారు దండ వేసి, మిగిలిన వారిని లూప్‌లైన్లకు పంపించిందంటూ.. నాటి గాయాలను వైసీపీ దళం, నేడు మళ్లీ గుర్తు చేస్తోంది. కీలక ప్రాంతాల్లో డీఎస్పీలుగా తమ కులం వారినే నియమించిన నాటి వైనాన్ని,  పేర్లతో సహా నేడు చర్చకు తెచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే.. జగన్ సర్కారులో ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు మినహా, మిగిలిన వారంతా ఎక్కడో ఒక చోట ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. మరి కులముద్ర పడిన ఈ అధికారులంతా అనర్హులయితే, మళ్లీ వారితో ఎలా పనిచేయించుకుంటున్నారన్నది అర్ధం కాని ప్రశ్న. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కులానికి చెందిన అధికారితోనయినా పనిచేయించుకోవలసిందే. అది ఎవరికయినా తప్పదు! కాకపోతే వారికిచ్చే పోస్టులు ప్రాధాన్యమా? అప్రాధాన్యమా అన్నదే ప్రశ్న. ఈ ఆరోపణలన్నీ ఎన్నికల్లో గట్టెక్కడానికి మాత్రం ఒక నిచ్చెనలా పనిచేస్తాయంతే!  ఇప్పుడు జగన్‌కు సన్నిహితంగా మెలిగే కృష్ణబాబు, సీఎంకు  నీడలా ఉండే మిత్రుడయిన తలశిల రఘురాం, అధినేత మనసు గెలిచిన మంత్రి  కొడాలి నాని, కొత్తగా వైసీపీ తీర్ధం తీసుకున్న కరణం బలరాం, వల్లభనేని వంశీ వంటి వారంతా మళ్లీ.. అదే వైసీపీ వ్యతిరేకిస్తున్న కమ్మజాతి ఆణిముత్యాలే! కాకపోతే ఇదొక భిన్నమైన కులసమీకరణ. అది వేరే విషయం.

టీడీపీ హయాంలో కమ్మ ప్రముఖులు మాత్రమే వెలిగిపోయారు.  పాలకుల పక్కన చేరింది కూడా వారే. అంటే రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇతర రంగాల్లో ఉన్న కమ్మ ప్రముఖులకు మాత్రమే లాభం జరిగింది. వీరంతా ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు జంపయితారు. అదే వర్గానికి చెందిన మిగిలిన వారంతా,  సామాన్యుల మాదిరిగానే ఉండిపోయారు. ఎవరి వ్యాపారం, ఎవరి వ్యవసాయం వారిదే  . వారిని ఆ పార్టీ ఉద్ధరించింది, ఊడబొడిచిందేమీ లేదు. కాకపోతే.. కమ్మవారు కాబట్టి, టీడీపీకి మాన సిక మద్దతుదారులంతే. ఎప్పటికీ వారిపై ఆ ముద్ర తప్పదంతే! అధికారవర్గాల్లో ఉన్న కమ్మ ప్రముఖులు ఎలాగూ.. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’లో ఆరితేరిన వారే కాబట్టి, అలాంటి వారికి  ఏ ప్రభుత్వంలో ఉన్నా దిగులు, చీకూ,  చింతా ఉండదు.

ఇప్పుడు వైసీపీ సర్కారులో.. రాజకీయాలతో సంబంధం లేని రెడ్ల పరిస్థితీ అంతే. టీడీపీ మాదిరిగానే వైసీపీ పాలకుల చుట్టూ వ్యాపార-పారిశ్రామికవేత్తలే దర్శనమిస్తున్నారు.  బాబు జమానాలో మంచి హోదాలు అందుకున్న రెడ్డి వర్గ అధికారులు, ఇప్పుడూ హవా కొనసాగిస్తున్నారు. కమ్మ వారి మాదిరిగానే , రెడ్లలో కూడా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కళ తెలిసిన వారున్నారు. టీడీపీ హయాంలో అత్యంత ప్రాధాన్యత గల హోదా అనుభవించిన జవహర్‌రెడ్డి వంటి అధికారులు, ఇప్పుడూ అదే హోదా అనుభవిస్తున్నారు.  అదీ సంగతి! అయితే వ్యాపారం-వ్యవసాయం-ఉద్యోగాలు చేసుకునే సాధారణ రెడ్డి వర్గానికి, వైసీపీ సర్కారు వల్ల కొత్తగా వచ్చిన లాభమేమీ లేదు.  కాకపోతే.. టీడీపీలో కమ్మ వారి మాదిరిగానే, రెడ్లు కూడా వైసీపీకి మానసిక మద్దతుదారులుగా మిగిలిపోతారంతే. వారిపైనా ఆ ముద్ర తప్పదు.
ఈ రెండు కులాలే ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించినందున.. వారికి  వ్యక్తిగతంగా ఎలాంటి మేలు జరగకపోయినా,  ‘ఆ రెండు పార్టీలు తమవే’ అన్న ‘మానసిక భ్రమ’ల్లో బతుకుంటారు. బతుకుతున్నారు. బతుకుతూనే ఉంటారు. దశాబ్దాల నుంచీ చూస్తున్నది ఇదే క దా? ఇదే కథ!