రాయలసీమ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

3246

-ప్రభుత్వానికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్‌

రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత తెదేపా ప్రభుత్వం, ఇప్పటి వైకాపా ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని శ్వేతపత్రాలుగా ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. కర్నూలులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. కాంగ్రెస్, తెదేపా, వైకాపా ప్రభుత్వాలు రాయలసీమ అభివృద్దిని ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చిన్నచూపుచేశారని విమర్శించారు. రాయలసీమలో లభించే వనరులను తమ సొంత ఆదాయవనరుగా మార్చుకుని ప్రజలకు ద్రోహం చేసినట్లు ఆరోపించారు. ఒకపక్క ప్రజలు చుక్కనీరు అందక తాగునీటికి, సాగునీటికి ఇబ్బందిపడుతుంటే తాము మాత్రం జేబులు నింపుకుని కోట్లకు పగడలెత్తారని మండిపడ్డారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించి 3 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఇలా అన్నారు……

జిల్లా మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెదేపాలో చేరినప్పుడు ఇరిగేషన్‌పై విడుదల చేసిన కొన్ని జీఓల్లో ఏమి అమలయ్యాయి. వైకాపా ప్రభుత్వం ఈ 18 నెలల్లో రాయలసీమకు ఏంచేసింది? ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్దికి 40 వేల కోట్లతో డిపిఆర్‌లు తయారుచేయించినట్లు చెబుతోంది. ఇది కూడా గత ప్రభుత్వం వలెనే ప్రచారానికి తప్ప అమలుకు నోచుకోగలదా? భాజపా అధికారంలో వస్తే రూ.20వేల కోట్లతోనే ఈ ప్రాజెక్టులు కట్టేస్తాం.

పోలవరం నిర్మాణానికి యుద్దప్రాతిపదికన నిధులు తెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకోసం యుద్దప్రతిపదికన ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు ఇందుకు కేటాయించి 3 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తిచేయాలి. తుంగభద్ర మిగులు జలాలకు అవసరమైతే కర్నాటకతో చర్చలు జరపాలి.

కర్నూలు జిల్లాకు కేంద్రం పలు ప్రాజెక్టులు తెచ్చింది. రూ.10 వేల కోట్లతో డిఆర్‌డీఓ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని వల్ల 4 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇవి కాక నాలుగు రోడ్ల రహదార్లు నిర్మిస్తున్నారు. కర్నూలుజిల్లానే కాదు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ బడ్జెట్‌తో కాకుండా ప్రత్యేకంగా ఇచ్చే నిధులతో అమలుచేసే ప్రాజెక్టులను రాష్ట్రం విధిగా ప్రచారం చేయాలి.
రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు ఈ ప్రాజెక్టులు, సంస్థల్ని సందర్శించి, పరిశీలించి ప్రజల వద్దకు తీసుకెళ్తారు. చంద్రబాబు రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నారు. రాజధాని నిర్మాణానికి ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన రూ.7,200 కోట్లపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమ వెనుకబాటుతనంపై , శ్రీబాగ్ ఒప్పందం అమలుపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు అవినీతి చేసినట్లు ఆరోపిస్తూ పెద్ద పుస్తకం ప్రచురించిన జగన్, అధికారంలోకి వచ్చాక కేవలం రూ.150 కోట్ల అవినీతిని మాత్రమే పట్టుకోగలడాన్ని ప్రశ్నించారు. మగతా మొత్తం ఎప్పుడు విచారిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తూ, తోడుదొంగలుగా వ్యవహరిస్తూ,రాష్ట్రాన్ని వంతులవారీగా దోచేస్తున్నారని ఆరోపించారు. వీరి అవినీతిని ఆరోపించే దమ్ము, ధైర్యం ఒక్క భాజపాకే ఉందన్నారు.

వైకాపా ప్రభుత్వంలో అన్ని రకాలు పన్నులు చెల్లించే బంగారమైనా దొరుకుతుంది కాని ఇసుక మాత్రం సులభంగా లభ్యం కావడం లేదన్నారు. ఇసుక లభ్యం కాక యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదాయం పొందుతూనే అవసరమైనవారికి ఇసుక సులభంగా దొరికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి దోపిడికి గురౌతున్న ఎర్రచందనాన్ని రాయలసీమ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు.

తెదేపా, వైకాపాల అవినీతి ప్రభుత్వాలకు ప్రత్నామ్యాయంగా అభివృద్ధి పథంలో పాలించే సత్తా భాజపాకే ఉందన్నారు. రాయలసీమలో వనరుల ఆధారంగా ఉద్యానపంటలతో, పారిశ్రామికంగా, శక్తి ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని భాజపా కాంక్షిస్తోందన్నారు. అవినీతిలేని, బంగారు రాయలసీమతో, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు భాజపా- జన సేనల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సంకల్పం తీసుకున్నామన్నారు.

సమావేశంలో రాజ్యసభ సభ్యులు, భాజపా నాయకులు టీజీ వెంకటేష్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధనరెడ్డి, భాజపా కర్నూలు జిల్లా అధ్యక్షులు పి. రామస్వామి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నాయకులు డాక్టర్ పార్ధసారధి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కునిగిరి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.

ఘాట్ల నిర్మాణంపై విచారణ జరపాలి :
సోమువీర్రాజు మంత్రాలయం పుష్కరఘాట్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి,

జిల్లా అధ్యక్షులు పి.రామస్వామితో కలసి తుంగభద్రానదికి చెందిన మంత్రాలయం వద్ద గల రెండు ఘాట్లను శనివారం పరిశీలించారు. తుంగభద్ర నది పుష్కరాలు పూరైనా ఇంకా అక్కడ ఘాట్ల నిర్మాణం కొనసాగుతూ ఉండటాన్ని గమనించారు. సుమారు రూ.230 కోట్ల రూపాయలతో చేపట్టిన పుష్కరఘాట్ల నిర్మాణం నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. పార్టీ నాయకులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మకై నాసిరకంగా పనులు చేపట్టినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదుచేశారు. పనులను యాత్రికులకు అనుకూలంగా, భద్రత కల్పించేలా సకాలంలో ఘాట్‌ నిర్మాణం ఎందుకు పూర్తిచేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు.

2 COMMENTS