గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం

642

2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యూపీ ప్రభుత్వం పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు పేర్కొంది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్ తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.

2017లో యూపీలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ నదీ తీరాన ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగింది. దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా లభించింది.

   -VSK ANDHRAPRADESH