కేంద్ర వ్యవసాయ చట్టాలకు రైతు సంఘాల మద్దతు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ పలు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ను కలిశారు. వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ వారు తోమర్ కు మెమోరాండం సమర్పించారు. ఓ వైపు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న తరుణంలో పలు రాష్ట్రాల రైతు సంఘాలు వ్యవసాయ బిల్లులకు మద్దతు పలుకుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి తోమర్ ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తోమర్ ని కలిసిన వారిలో ఉత్తర్ప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్, హరియాణా రాష్ట్రాల ‘ఆల్ ఇండియా కిసాన్ సమన్వయ సమితి’ సభ్యులు ఉన్నారు.
‘మేం ఆలిండియా కిసాన్ సమన్వయ సమితి తరఫున తోమర్ ని కలిసేందుకు వచ్చాం. మేం వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు మద్దతు తెలియజేస్తున్నాం. ఎప్పటిలాగే ఎం ఎస్ పీ, మండీ వ్యవస్థను కూడా కొనసాగించాలి. నూతన వ్యవసాయ చట్టాలతో మేం సంతృప్తిగా ఉన్నాం. ఈ నూతన చట్టాలను వెనక్కి తీసుకోకండి ‘ అని వారు లేఖలో పేర్కొన్నారు. అనంతరం తోమర్ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు చేసే మేలు గురించి వారు తమ అనుభవాల్ని నాతో పంచుకున్నారు. మోడీ ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఈ చట్టాలు తెచ్చిందన్నారు. వాటికి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు’ అని తోమర్ తెలిపారు. ఇప్పటికే ఆదివారం హరియాణా, ఉత్తరాఖండ్ నుంచి పలువురు రైతుల బృందాలు తోమర్ ను కలిసి చట్టాలకు మద్దతు తెలిపారు.
-vskandhra.org