పునరావాసం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు

0
36

 రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో విధించిన షరతులకు లోబడి పునరావాస ప్యాకేజీ పూర్తయిన తర్వాతే డ్యామ్ పనులను నిర్వహించాలని రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెండు లక్షలమంది గిరిజనులు, దళితుల ప్రాణాలను ఫణంగా పెడుతూ పునరావాస ప్యాకేజీ అమలు చేయకుండా డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని వేదిక అభిప్రాయపడింది. అంతంత మాత్రంగా అమలు జరుగుతున్న పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, గిరిజనుల స్థానంలో గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం నిర్వాసిత గ్రామాల పర్యటన అనంతరం సోమవారం విజయవాడ బందరు రోడ్ లోని జాప్ మీడియా సెంటర్ లో వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోలవరం నిర్వాసితుల రౌండ్ టేబుల్ ఈ మేరకు అభిప్రాయపడింది. వేదిక అధ్యక్షులు దూలం బూసి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నిర్వాసితులు పలువురు పాల్గొన్నారు . గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన పిసా చట్టం ప్రకారం గ్రామ సభలను నిర్వహించిన తర్వాతే, అక్కడి తీర్మానాల మేరకే పునరావాస ప్యాకేజీ ని అమలు జరపాలని సమావేశం తీర్మానించింది. నిర్వాసితుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జాతీయ ఎస్ టీ కమీషన్ మరోమారు పోలవరం ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేసింది. పాలకులు, అధికారులు చెప్పినదానికి భిన్నంగా 35 మీటర్ల ఎత్తులోని కాఫర్ డ్యాం వల్ల పెద్ద ఎత్తున 137 గ్రామాలు జలమయం అయినందున కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తిరిగి పోలవరం కాంటూర్లను సమీక్షించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. పాక్షిక ముంపు గ్రామాలను కూడా పూర్తి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, అటవీ హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తీర్మానించింది. ‘శక్తి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పిరాట్ల శివరామకృష్ణ, పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి అధ్యక్షులు సుబ్బరాయ శాస్త్రి, సామాజిక సమరసత జాతీయ సమన్వయకర్త శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

       VSK ANDHRAPRADESH