సంజయ్ సెంటిమెంట్ అస్త్రం

198

అమ్మవారి ఆలయంలో కార్పొరేటర్లతో ప్రమాణం
జంపింగులు, అవినీతికి బండి చెక్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. భారతీయ జనతా పార్టీని విజయం అంచుల వరకూ తీసుకువెళ్లి, అధికార టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పోయించిన తెలంగాణ కమల దళపతి బండి సంజయ్… ఇప్పుడు తన పార్టీ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు సంధించిన ‘సెంటిమెంట్ అస్త్రం’ చర్చనీయాంశమయింది. గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ హవాకు,  బాటలు వేసిన భాగ్యలక్ష్మీ దేవాలయం కేంద్రంగా.. సంజయ్ సంధించిన సెంటిమెంట్ అస్త్రం, ఆ పార్టీ కార్పొరేటర్లను నైతిక-మానసిక- ఆధ్మాతికంగా కట్టిపడేసింది.

ఎన్నికల ముందు… ఎన్నికల కమిషనర్‌కు తాను లేఖ రాశానని సీఎం లేఖ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వచ్చి,  ప్రమాణం చేయాలని సంజయ్ చేసిన సవాల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆయన సవాల్‌కు కేసీఆర్ స్పందించకపోయినా, సంజయ్ మాత్రం అదే దేవాలయానికి వెళ్లి తన చిత్తశుద్ధి చాటుకున్నారు. నగరంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కూడా, తొలుత భాగ్యలక్ష్మీ ఆలయంలోనే పూజలు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం బీజేపీకి సెంటిమెంటుగా మారింది.

కొత్తగా ఎన్నికయిన బీజేపీ కార్పొరేటర్లతో సంజయ్,  శుక్రవారం హైదరాబాద్   పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమాణం చేయించి,  సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా ఈ విధంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులతో, ప్రమాణం చేయించిన దాఖలాలు లేవు.  అయితే.. కార్పొరేషన్‌లో అత్తెసరు మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్.. బీజేపీ కార్పొరేటర్లపై వల వేసిందన్న ప్రచారంతో బీజేపీ అప్రమత్తమయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని బలపడిన వ్యూహాన్నే,  టీఆర్‌ఎస్ గ్రేటర్ కార్పొరేషన్‌లోనూ అమలు చేసే ప్రమాదాన్ని పసిగట్టింది.

దానితో స్వయంగా రంగంలోకి దిగిన బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎవరూ ఊహించని విధంగా, తన పార్టీ కార్పొరేటర్లతో అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయించడం ద్వారా, అధికార పార్టీ ఎత్తును ఆధ్మాత్మికంగా చిత్తు చేసినట్టయింది. అవినీతికి పాల్పడకుండా, ప్రజాసేవ చేస్తామని వారితో ప్రమాణం చేయించిన తీరు కూడా ప్రజలలో పార్టీపై విశ్వసనీయత పెంచినట్టయింది. కార్పొరేషన్‌లో అన్ని పార్టీలతో పాటు,  బీజేపీ ప్రజాప్రతినిధులపై కూడా కొన్నేళ్ల నుంచీ అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేటర్ల అవినీతి చర్యలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ప్రభావం చూపుతాయని, ఒకప్పుడు కరీంనగర్ కార్పొరేటర్‌గా పనిచేసిన సంజయ్ పరిగణనలోకి తీసుకున్నారు.  ఆ తర్వాతనే కార్పొరేటర్లతో ఆలయంలో ప్రమాణం చేయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బండి సంజయ్ రాక సందర్భంగా,  చార్మినార్ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పాతబస్తీ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి తరలిరావడంతో,  కమలంలో మరోసారి సమరోత్సాహం తొంగిచూసింది.