తెలంగాణలో..కల్వకుంట్ల రాజ్యాంగం:డాక్టర్ కె. లక్ష్మణ్

406

తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్  అన్నారు. భారత్ బంద్ కు మద్దతు తెలిపిన కేసీఆర్.. దిల్లీలో రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పాలనలో వైఫల్యాలను ఎండగట్టారు. హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేసీఆర్‌ తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,  దుగ్యాల ప్రదీప్ కుమార్,  బంగారు శృతి, బిజెపి అధికార ప్రతినిధి పాల్వాయి రజినీ కుమారి పాల్గొన్నారు.

రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తే తప్పేంటని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దళారుల జేబులు నింపటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చురకలు అంటించారు. భూసార పరీక్షల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించారని డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సురేష్ యాదవ్‌పై దాడిని ఖండించారు. కేసీఆర్ రైతుల భుజాలమీద తుపాకులు  పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:
నయా తుగ్లక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం పతనం
• తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేసీఆర్‌ తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారు.
• నిజాం పాలనలో-  గడీల్లో చీకటిమయమై, చిధ్రమైన తెలంగాణలానే నేటి తెలంగాణ కనపడుతోంది.
• నేడు 8వ నిజాం కేసీఆర్ పాలనలో అదిరించుడు.. వినకుంటే బెదిరించుడు.. హద్దుల పెట్టుకునుడు.. గిదీ. కేసీఆర్ గడీల పాలన తీరు.
• నిరుద్యోగ భృతి జాడే లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణమే లేదు. స్థలం ఉంటే ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పినా.. దాని ఊసే లేదు. రుణమాఫీ లేదు, రెండో విడత గొర్రెల పంపిణీ లేదు.
• హైదరాబాద్ లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు, హైదరాబాద్ లో వరదలు, తెలంగాణలో రైతాంగం పంట నష్టపోతే పట్టించుకోలేదు.
• డీఏ, ఐఆర్, పి.ఆర్.సి ల గురించి పట్టించుకోకుండా.. కేవలం ఈ సమస్యను కేసీఆర్.. ఎన్నికల ఎరగా వాడుకుంటున్నారు.
• అటు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు సైతం.. కేసీఆర్ తో కుమ్మక్కై ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారు.
హామీల వరద .. టీఆర్ఎస్ బురద రాజకీయం
• సన్నధాన్యానికి గిట్టుబాటు ధర ఎక్కడ..? 57 ఏళ్లు నిండిన రైతుకు ఫించన్ ఎక్కడ..? రైతులకు ఉచిత ఎరువులు ఇంకెప్పుడు ఇస్తరు..? ముందు మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. ఆ తర్వాత గురిగింజ నీతులు వల్లించండి.
• రైతులను నిట్టనిలువునా మోసానికి గురిచేస్తూ కేసీఆర్‌ సర్కార్‌ దళారి వ్యవస్థను పెంచి పోషిస్తూ అక్రమంగా డబ్బులు కొల్లగొడుతోంది.
• సన్నవడ్లు కొనుగోలు చేయకుండా, మద్దతు ధర, రుణ మాఫీ అమలు చేయకుండా, పంట నష్టాన్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మీరు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం మిలీనియం జోక్.
• కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఆనాథగా వదిలేసిన రంగాలను సంస్కరించడం ఆశామాషీ కాదు. కారోనా కాటు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కకావికలం చేసింది. ఇలాంటి స్థితిలో ప్రధాన ఉత్పత్తి రంగాల విషయంలో సంస్కరణలు తప్పనిసరని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. కానీ బిజెపిపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక విపక్షాలు విషం చిమ్ముతున్నాయి. వారితో టీఆర్ఎస్ తో కలవడం దురదృష్టకరం.
• దేశంలో కనుమరుగైన కాంగ్రెస్‌, మ్యూజియం పార్టీలుగా మిగిలిపోయిన లెఫ్ట్‌ పార్టీలు ఇచ్చిన భారత్‌ బంద్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలకడం సిగ్గుచేటు.
కొత్త సాగు చట్టం.. రైతన్నకు మోదీ కట్టిన పట్టం
• దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలతో చిన్న, సన్నకారు రైతులకు వారి ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని అవకాశాలు కల్పించనున్నాయి.
• కొత్త చట్టాల వల్ల వ్యవసాయ రంగంలో ఓపెన్ మార్కెట్ కు అవకాశం ఉంటుంది. దీంతో రైతులు వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందుతారు. రైతులను పీడిస్తున్న దళారీ వ్యవస్థను కొత్త చట్టాలు రూపుమాపుమాపుతాయి.
• ప్రతిపక్షాలు రైతులకు జరిగే మంచిని తెలియనీకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉద్యమాలను తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడం సిగ్గుచేటు. కొన్ని రైతు సంఘాలను రెచ్చగొట్టి ఈ చట్టాలను అడ్డుకోవాలని చూస్తున్నాయి. రైతుల్లో భయాన్ని, అభద్రతను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
• రైతుల కడుపుకొడితే బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే.. గ్రామాల్లో వేల కోట్ల సంపద సృష్టిస్తే.. అప్పుడు అది బంగారు తెలంగాణ.

కాస్కో కేసీఆర్.. భవిష్యత్తు బిజెపిదిదే..
• ఎన్నికలు వచ్చినప్పుడల్లా నిరుద్యోగులు, స్టూడెంట్లకు ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ఎరవేసి, అవసరం తీరాక వారిని పట్టించుకోకపోవడం కేసీఆర్ కు మామూలే.
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు దండుకునేందుకే 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ డ్రామా ఆడుతున్నారు.
• 40 లక్షల మంది తెలంగాణ యువతను నిరుద్యోగులుగా మార్చిన కేసీఆర్ పాలనపై బిజెపి యుద్ధం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోంది.
• ఇక కేసీఆర్ గారడి మాటలకు మోసపోయే రోజులు పోయాయి. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ పాలనలో మోసపోయిన తెలంగాణ సమాజం యుద్ధం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ సర్కారు పతనం మొదలైంది. రాష్ట్రంలో మార్పు పవనాలు వీస్తున్నాయి.
• తెలంగాణలో సబ్బండ వర్ణాలకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు.. ఉద్యమ ద్రోహులను అందలమెక్కించి.. ఉద్యమకారులను, అమరవీరుల ఆశయాలను తుంగలోతొక్కిన టీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు సిద్ధమయ్యారు.